YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విజయశాంతి, బండ్లగణేష్ ఎక్కడ...

విజయశాంతి, బండ్లగణేష్ ఎక్కడ...

హైదరాబాద్, మే 8,
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్దరు నేత‌లపై తెగ చ‌ర్చ జ‌రుగుతోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ముందు వరకు తెగ హ‌డావిడి చేసిన ఆ ఇద్దరు ఆల్ ఆఫ్ స‌డెన్‌గా సైలెంట్ అయిపోయారు. సినీ నేపథ్యం ఉన్న ఆ ఇద్దరూ ఎన్నికల్లో ఎంతోకొంత ప్లస్‌ అవుతారనుకుంటే.. ఇప్పుడు సప్పుడు చేయకుండా సైడ్‌ అయిపోవడం పార్టీలో విస్తృత చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్‌లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనే విజ‌య‌శాంతి, బండ్ల గ‌ణేశ్‌ది ప్రత్యేక స్థానం. స్టార్‌ డమ్‌తోపాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన విజయశాంతి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే… సినీ నేపథ్యంతోపాటు తనదైన మాటతీరుతో తెలుగు రాష్ట్రాల్లోనే స్పెషల్‌గా నిలిచారు బండ్ల గణేశ్‌. ఈ ఇద్దరూ ఇప్పుడు కాంగ్రెస్‌లో కీలక నేతలుగానే ఉన్నారు. కానీ, ఎందుకనో పార్లమెంట్‌ ఎన్నికల్లో తెర ముందుకు రావడం లేదు. దీంతో ఆ ఇద్దరి పొలిటికల్‌ జర్నీపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. మంచి పాపులారిటీ ఉన్న విజయశాంతి, బండ్ల గణేశ్‌ ఒకేసారిగా మౌనం వ‌హించడం ఎవరికీ అంతుపట్టడంలేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ విజ‌య‌శాంతి.. అప్పట్లో విస్తృతంగా పర్యటించి ఎన్నిక‌ల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌లో చేర‌డం ద్వారా సొంత ఇంటికి వ‌చ్చిన‌ట్లు ఉందంటూ కామెంట్స్ చేశారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి వీలు లేక‌పోవ‌డంతో.. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో విజయశాంతి పోటీ చేస్తార‌ని అంతా భావించారు. కానీ పార్లమెంట్ ఎన్నిక‌ల్లోనూ ఆమెకు అవ‌కాశం ద‌క్కలేదు. గ‌తంలో ఆమె పోటీ చేసి విజ‌యం సాధించిన మెద‌క్ నుంచి విజయశాంతి పేరు ప‌రిశీలిస్తారని భావించినా, అసలు ఆ ఊసే లేకపోవడంతో సైలెంట్‌ అయిపోయారు విజయశాంతి. ఈ కారణంగానే పార్లమెంట్ ఎన్నిక‌ల ప్రచారానికి విజయశాంతి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన విజయశాంతి…. ఆ ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలతోపాటు, ప్రభుత్వ కార్యక్రమాలకూ దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది? ఏం చేస్తున్నది పార్టీ పట్టించుకోడం లేదని విజయశాంతి అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇక మ‌రోనేత బండ్ల గ‌ణేశ్‌ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే… 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిన త‌ర్వాత సైలెంట్ అయిన బండ్ల.. గత ఎన్నిక‌ల ముందు మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. ఎన్నికల ప్రచారం నుంచి… సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం వరకు తెగ హడావిడి చేశారు. గాంధీభ‌వ‌న్‌లో నిత్యం ప్రెస్ మీట్‌లు పెడుతూ వార్తల్లో నిలిచే వారు బండ్ల గణేశ్‌.సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం కోసం ఎల్‌బీ స్టేడియంలోనే వేచిచూస్తానని… స్టేడియంలోనే నిద్రపోతాననే కామెంట్స్‌ ద్వారా వైరల్‌ అయ్యారు బండ్ల… దీనంతటికీ కారణం నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకోడానికే అనే ప్రచారం జరిగింది. కానీ, బండ్ల గ‌ణేష్ ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఆ త‌ర్వాత రాజ్యస‌భ ఎంపీపైనా కన్నేసినా ప్రయోజనం దక్కలేదు. ఫైన‌ల్‌గా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని విశ్వప్రయ‌త్నం చేశారు. మ‌ల్కాజ్‌గిరి లేదా ఖ‌మ్మం నుంచి పోటీకి రెడీ అయ్యారు. మ‌ల్కాజ్‌గిరి సీటుకు ధ‌ర‌ఖాస్తు కూడా చేసుకున్న బండ్ల గ‌ణేశ్‌కు నిరాశే ఎదురైందిసో.. మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్‌లో సినీ నేప‌థ్యం ఉన్న విజ‌య‌శాంతి, బండ్ల గ‌ణేశ్‌ కోసమే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇద్దరు నేత‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు హ‌డావిడి చేసి… ఇప్పుడు జాడే లేకుండా పోయారు. ఈ ఇద్దరిని పార్టీ మున్ముందు ఎలా ఉప‌యోగించుకుంటుంద‌నేది వేచిచూడాలి.

Related Posts