YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూడుగా చీలిన ఖమ్మం టీడీపీ

మూడుగా చీలిన ఖమ్మం టీడీపీ

ఖమ్మం, మే 10,
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది. కొద్ది నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తెలంగాణ నుంచి అభ్యర్థులను నిలబెట్టలేదు. అయితే ఖమ్మం జిల్లాలో టీడీపీని అభిమానించేవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లంతా కాంగ్రెస్‌కు ఓటేశారు. అయితే ఈసారి టీడీపీ మద్దతుదారుల ఓట్లు ఏ పార్టీకి అనేది రాజకీయ చర్చకు దారితీస్తోంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాం కదా…ఈసారి కూడా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి ఓటు వేద్దామని ఓ వర్గం వాదిస్తోంది. కాస్ట్ ఈక్వేషన్స్‌లో భాగంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వాలని మరో వర్గం పట్టు పడుతోంది. ఇక ఏపీలో బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి వినోద్‌ రావుకు ఓటు వేయాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇలా ఖమ్మం టీడీపీ మూడు పాయలుగా చీలిపోయింది.
ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలంటూ మూడు పార్టీల అభ్యర్థులు టీడీపీ ఆఫీసు గడప తొక్కారు. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఒక వర్గం ప్రకటించడమే కాకుండా…కాషాయ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సమావేశం అయి..కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మరో వర్గం ప్రకటించింది. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినందుకు టీడీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు పొంగులేటి.ఖమ్మం గుమ్మంలో టీడీపీ మద్దతుదారులు…మూడు దారుల్లో పయనిస్తున్నారు. పార్టీ మూడు పాయలుగా చీలిపోయింది.
మరో వైపు ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని టీటీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా, టీటీడీపీ నేతలతో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చర్చలు జరిపారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, సీనియర్‌ నేతలు సాయిబాబా, కాట్రగడ్డ ప్రసూన, శ్రీపతి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి భేషజాలు పెట్టుకోకుండా ప్రతీ టీడీపీ కార్యకర్త ఈసారి బీజేపీకి ఓటు వేసే విధంగా కృషి చేయాలని చింతల రామచంద్ర రెడ్డి కోరారు. మన ఓటు ఇతర పార్టీలకు వేస్తే ఉభయులకు నష్టం చేకూరుతుందని, ఏపీలో చంద్రబాబు సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి)కి టీడీపీ మద్దతు ఇవ్వడం శుభపరిణామం అన్నారు. ఈనెల 10వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారని, ఆరోజు బహిరంగసభకు తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున రావాలని ఆయన కోరారు.సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జి. కిషన్‌రెడ్డి గెలుపునకు టీడీపీ కృషి చేస్తుందని పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎం. అరవింద్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీతో టీడీపీ ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు టీడీపీ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సోమవారం దోమలగూడలోని టీడీపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జి. కిషన్‌రెడ్డికి మద్దతుగా టీడీపీ నగర అధ్యక్షుడు పి. సాయిబాబా అధ్యక్షతన సమావేశం జరిగింది.

Related Posts