ఖమ్మం, మే 16
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు పూర్తైపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టిపెడుతానని చెబుతున్నారు. రుణమాఫీ,కాంగ్రెస్ హామీల పూర్తిస్థాయి అమలు, మండలాలు, జిల్లాల రేషనైలేషన్ వంటి అంశాలపై ఫోకస్ పెడుతానని అంటున్నారు. అయితే టీ-కాంగ్రెస్ బాస్‌గా,రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సంగతి అటుంచితే..ఆ పార్టీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు,మంత్రి వర్గానికి చెందిన కొందరు ముఖ్యుల వ్యవహార శైలితో అప్పుడే కాంగ్రెస్‌లో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీకి సంబంధించిన కీలక నేతలు రహస్యంగా భేటీ అవుతుండడంతో..ఈ ప్రచారానికి మరింత ప్రయార్టీ ఏర్పడినట్లైంది.రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిసిన వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆయన స్వంత ఊరు ధన్వాడలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారివురు సుదీర్ఘ మంతనాలు జరిపారు. అదే టైంలో ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో పాటు తన అనుయాయులతో కేరళ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మంత్రుల భేటీలు, టూర్ల గురించి అస్సలు మాట్లాడడం లేదు. ఎన్నికలు పూర్తైనందున ఇక నుంచి పరిపాలనపైనే పూర్తిస్థాయిలో నజర్ పెట్టనున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ రకమైన స్టేట్ మెంట్స్ ఇస్తున్నప్పుడు..భట్టీ-దుద్దిళ్ల భేటీ,పొంగులేటి కేరళ టూర్ వెనక ఉన్న మతలబేంటి అనే అంశమే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ మారింది.లోక్ సభ ఎన్నికలకు ముందు టీ-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తామేమీ కూల్చబోమని..కానీ,దాని అంతల అదే కూలిపోతే మాత్రం మేమేం చేయలేమని చెప్పుకొచ్చారు. ఇక రెండు రోజుల క్రితం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేవంత్ సర్కార్ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని వెల్లడించారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇవే సంకేతాలిచ్చారు. దీంతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తికా గానే..కాంగ్రెస్ సర్కార్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం జోరుగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రులు కూడా క్యాంపు రాజకీయాలు నడుపుతుండడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. పొంగులేటి కేరళ వెళ్లడం..విక్రమార్క,శ్రీధర్ బాబు భేటీ కావడంతో..అప్పుడే సర్కార్‌లో లుకలుకలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది. వెరసి టీ-బీజేపీ నేతల స్టేట్ మెంట్లు..ఇటు అమాత్యుల వరుస భేటీలతో రేవంత్ సర్కార్‌కు ఏదో ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చనే డిస్కషన్ మాత్రం జరుగుతోంది.అయితే ఇదే అంశాన్ని టీ-పీసీసీ నేతల వద్ద ప్రస్తావించినప్పుడు మాత్రం తమ పార్టీలో అలాంటి క్యాంపు రాజకీయాలేం నడవడం లేదని కొట్టిపారేస్తున్నారు. కేవలం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున పొంగులేటి విడిది కోసం కేరళకు వెళ్లి ఉంటారని చెబుతున్నారు. అలాగే భట్టివిక్రమార్క-దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ వెనక కూడా అంతలా అంతర్యమేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల వివరణలు ఎలా ఉన్నా..మున్ముందు ఏదో జరగబోతుందనే అంచనాను రాజకీయాలు విశ్లేషకులు వేస్తున్నారు. అయితే ఎవరి ఎక్స్‌ఫెక్టేషన్స్ ఎలా ఉన్నా..చూడాలి మరీ మరికొద్ది నెలల్లో ఏం జరగనుందనేది.