YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు రాహుల్ ఆహ్వానం

చంద్రబాబుకు రాహుల్ ఆహ్వానం
రాహుల్ గాంధీ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఇఫ్తార్ విందుతో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పక్షాలను ఏకం చేయాలని రాహుల్ భావిస్తున్నాడన్న ఊహాగానాల మధ్యన ఏపీ సీఎంకు ఆహ్వానం రావడం విశేషమే. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అధినేతకు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు విందుకు ఆహ్వానం వచ్చింది. రాహుల్ గాంధీ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం అందలేదని మొదట వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ వాటిని ఖండించింది. ప్రణబ్‌ను ఆహ్వానించినట్టుగా పేర్కొంది. ఇక ఈ విందుకు ఒకప్పటి యూపీఏ పక్షాలతో పాటు ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానాలు అందినట్టుగా ఐఏఎన్ఎస్ పేర్కొంది. ఇలా ఆహ్వానాలు అందుకున్న వారిలో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి ఒకే వేదిక మీద కనిపించారు చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీతో కరచాలనం కూడా చేశారు. ఇప్పుడు విందుకు వెళితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యన బంధం మరింత బలపడినట్టే అని విశ్లేషకులు అంటున్నారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో  రాహుల్ ఇచ్చే ఇఫ్తార్ విందు జరగనుంది. 

Related Posts