
వరంగల్ జూన్ 11,
నేటి కాలంలో ఏ విషయమైనా సరే వెంటనే బయటికి వస్తోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రతి విషయం క్షణంలోనే బయటికి తెలుస్తోంది.. అలాంటి విషయమే ఇది కూడా. కాకపోతే ఇప్పుడు అధికారానికి దూరంగా ఉన్న భారత రాష్ట్ర సమితి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా హ్యాండిల్ లో ఈ వీడియో కనిపిస్తోంది.. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఆయన చేసిన వ్యవహారం ఏంటి? అధికారానికి దూరం కావడం.. పార్లమెంటు ఎన్నికల్లో సున్నాకు పరిమితం కావడంతో భారత రాష్ట్ర సమితి.. మళ్లీ తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో మరింత బలోపేతం అవ్వడానికి విపరీతంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ట్విట్టర్లో రకరకాల హ్యాండిల్స్ ను ఏర్పాటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిన్న లోపాన్ని సైతం భూతద్దంలో పెట్టి చూపిస్తోంది. అంతేకాదు 10 సంవత్సరాల కెసిఆర్ పరిపాలన కాలంలో తెలంగాణ ఇలా ఉండేదా అంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే బదులిస్తోంది. మొత్తంగా అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ మధ్య యుద్ధం జోరుగానే సాగుతోంది..ఇక తాజాగా భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేసే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వీడియో పోస్ట్ అయింది.. ఆ వీడియోలో ఏం ప్రస్తావించారంటే..” కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వసూళ్ల దందా.. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మామూళ్ల వసూలు.. వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్న మందుల సామెల్. ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టాను. రికవరీ కావాల్సిందే. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో? లేదో? తెలియదు. రోజుకు లక్ష ఖర్చు వస్తుంది. డీజిల్ కు కూడా డబ్బులు లేవు. ప్రభుత్వం ఇచ్చే జీతం కొసరు అవుతలేదు. మీరు ఇచ్చే మామూలు నాకు టీ ఖర్చులకు కూడా సరిపోవు. నా మాట వినని వాని సంగతి చూస్తా” అంటూ సామెల్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారని ఆ ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రస్తావించారు..ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత గులాబీ పార్టీ అనుకూల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు..” మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలా చేయలేదా.. అడ్డగోలుగా దోచుకోలేదా.. అసలు ఇలాంటి వ్యవహారాలు మొదలైందే మీతోనే కదా.. మీ పరిపాలన కాలంలో వైన్ షాప్ నిర్వాహకులతో అడ్డగోలుగా వ్యవహరించలేదా.. ఇష్టానుసారంగా దండుకోలేదా.. లంచాలు వసూలు చేసి నరకం చూపించలేదా.. ఇవాళ మీరేదో శుద్ధ పూసలు అయినట్టు చెబుతున్నారు అంటూ” కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతోంది… కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారంటూ సోషల్ మీడియా నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరైతే ఇలాంటి వాళ్లకు అధికారం ఇచ్చి తెలంగాణ ప్రజలు తప్పు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఎన్నికల్లో పెట్టిన ఖర్చు రికవరీ చేసుకోకపోతే ఎలా అంటూ ఇంకొందరు పేర్కొంటున్నారు.. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? తుంగతుర్తి ఎమ్మెల్యే ఎలాంటి సమాధానం చెబుతారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.