YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాములమ్మ దారెటు...

రాములమ్మ దారెటు...
విజయశాంతి ఉరఫ్ రాములమ్మ…సినిమాల్లో ఆమె లేడీ సూపర్ స్టార్…రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్… ఏ పార్టీలో ఉన్నా ఆమెది ప్రత్యేక ముద్ర. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. టీఆర్ఎస్ లో సెక్రెటరీ జనరల్ గా నెంబర్ టూ స్థానంలో పనిచేశారు. అయితే, ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అసలు ఆమె రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్లేనా లేదా మళ్లీ చురుగ్గా ఉంటారా అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. నాలుగేళ్లుగా ఎలాగూ సైలెంట్ ఉన్న ఆమె ఎన్నికలు మరో ఆరునెలల్లోనో, సంవత్సరంలోనో వస్తాయనుకుంటున్న ప్రస్తుత సమయంలోనూ ఇంకా కనపడకపోవడం చూస్తే ఇక ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.14 ఏళ్లకే సినీ జీవితంలోకి అడుగుపెట్టిన విజయశాంతి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించి లేడీ అమితాబ్ గా పేరు గాంచారు. 1997 సంవత్సరంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మతో ఆమెకు ప్రజల్లో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఈ సందర్భంగా 1998లో ఆమె రాజకీయ రంగప్రవేశం చేశారు. మొదట భారతీయ జనతా పార్టీలో చేరి స్లార్ క్యాంపెయినర్ గా ఎదిగారు. అనంతరం ఆమె ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాదనే లక్ష్యంగా ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. అయితే, లక్ష్యం ఒక్కటే కావడంతో ఆమె తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. 2009లో టీఆర్ఎస్ కు కంచుకోట వంటి మెదక్ లోక్ సభ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎంపీగా ఉద్యమంలోనూ కీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్ లో సెక్రెటరీ జనరల్ గా నెంబర్ 2 స్థానానికి ఎదిగారు. అయితే, ఏమైందో గానీ, ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ఇంచుమించు పూర్తవుతోంది అనే సమయంలో ఆమె టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.కాంగ్రెస్ తరుపున 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఎన్నికల తర్వాత ఆమె పార్టీకి, నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యాయి. పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలిగా పేరున్న విజయశాంతి జయలలిత మరణించిన కొత్తలో తమిళనాడు, ముఖ్యంగా అన్నా డీఎంకే వ్యవహారాల్లో కొంత తలదూర్చారు. శశికళను కలసి వచ్చారు. ఆ తర్వాత మూడు నెలల క్రితం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని చెప్పారు. దీంతో ఇక విజయశాంతి కాంగ్రెస్ లో చురుగ్గా ఉంటారని ఆ పార్టీ నేతలు భావించారు. రాష్ట్రంలో ఆమెకు వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ కలిసివస్తుందని వారు భావించారు. కాంగ్రెస్ నేతలు నిర్వహించిన బస్సు యాత్రలోనూ ఆమెజాడలేదు.ఒకదశలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు కూడా రాములమ్మకు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అవేవీ నిజం కాలేదు సరికదా ఆమె వ్యవహారంతో మెదక్ స్థానంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఆమె అసలు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా, చేయరా అనే విషయంలో క్లారిటీ లేకపోవడం కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. ఆమె ఇక గుడ్ బై చెప్పినా తాము ప్రత్యామ్నాయం చూసుకుని అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండకుండా, కనీసం నియోజకవర్గంలో కూడా తిరగకుండా ఎన్నికల వేళ వస్తే టిక్కెట్ ఇవ్వవద్దని కొందరు మెదక్ జిల్లా నేతలు వాదిస్తున్నారు. ఇంతకాలం అందుబాటులో లేకుండా ఎన్నికల వేళ వస్తే గెలవడం కష్టమే అంటున్నారు వారు. మొత్తానికి, ఆమె రాజకీయాల్లో ఉన్నట్లా, లేదా తేల్చకుండా విజయశాంతి కాంగ్రెస్ నేతలను, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. అయితే విజయశాంతి మాత్రం ఎన్నికల సమయానికి ఖచ్చితంగా బరిలోకి దిగుతారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Related Posts