YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొండా ఫ్యామలీని పోమ్మనకుండా... పోగబెడుతున్నారు..?

కొండా ఫ్యామలీని పోమ్మనకుండా... పోగబెడుతున్నారు..?

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో రెండుమూడు వ‌ర్గాలుగా చీలిపోయింది. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యే కొండా స‌రేఖ‌కు, వ‌రంగ‌ల్ న‌గ‌ర మేయ‌ర్ న‌న్న‌పునేని న‌రేంద‌ర్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇప్ప‌టికే మాట‌ల యుద్ధం మొద‌లైంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఇక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అది మ‌రింత‌గా ముదురుతోంది. అయితే, ఇక్క‌డ కొండా సురేఖ‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి పొమ్మ‌న‌లేక పొగ‌బెడుతున్నారా..? అనే అనుమానాలు ఆమె వ‌ర్గీయుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న మేయ‌ర్ న‌రేంద‌ర్ ఒక్క‌సారిగా నోరు తెరిచారు. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అవ్వ‌డంతో కొండా సురేఖ‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.. తాను కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ రేసులో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, న‌రేంద‌ర్ దూకుడు వెన‌క పార్టీ అధిష్టానం అండ‌దండ‌లు ఉన్నాయ‌నే టాక్ కూడా వినిపిస్తోంది. అందుకే మేయ‌ర్ న‌రేంద‌ర్ ఈ స్థాయిలో మాట్లాడుతున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్ తూర్పులో కొండా సురేఖ‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు నేత‌లు ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా మాజీ మంత్రి బ‌స్వ‌రాజు సార‌య్య‌, పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సోద‌రుడు ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరుకూడా టికెట్ రేసులో ఉన్నారు. కొండా సురేఖ కూడా గ‌తంలో స్పందించారు. తాజాగా.. మేయ‌ర్ న‌రేంద‌ర్ వారికి జ‌త క‌ల‌వ‌డంతో వ‌రంగ‌ల్ తూర్పులో ఎమ్మెల్యే కొండా సురేఖ‌, ఎమ్మెల్సీ కొండా ముర‌ళి దంప‌తులు ఒంట‌రి అయిపోయార‌నే టాక్ వినిపిస్తోంది. ఇదంతా కూడా పార్టీ అధిష్టానం క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తోంద‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ త‌న కూతురు సుష్మిత‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింపుతామ‌ని చాలాసార్లు చెప్పారు. ఈ మేర‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనూ కొండా వ‌ర్గీయులు చురుగ్గానే ప‌ర్య‌టిస్తున్నారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే, స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారిపై చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. స్పీక‌ర్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌నీ, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే త‌న కూతురిని ఇక్క‌డి నుంచి పోటీ చేయిస్తాన‌ని ఆమె అన్నారు. దీనిపై పార్టీలో పెద్ద దుమార‌మే రేగింది. ఒక‌వేళ తాము కోరుకున్న‌ట్లు టికెట్లు ఇవ్వ‌క‌పోతే.. కొండా దంప‌తులు మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే వ‌రంగ‌ల్ న‌గ‌ర‌మేయ‌ర్ న‌రేంద‌ర్ కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మీ ఇంట్లో మీరు మూడు టికెట్లు అడుగొచ్చుగానీ.. నేను ఒక్క టికెట్ అడిగితేనే త‌ప్పా.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.అయితే, పార్టీల‌తో సంబంధం లేకుండా.. కేవ‌లం వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోనే గెలవ‌గ‌ల స‌త్తా ఉన్న నేత‌లు కొండా దంప‌తులు. ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో కొండా వ‌ర్గీయులు బ‌లంగా ఉన్నారు. క్యాడ‌ర్‌ను కాపాడుకోవ‌డంలో కొండా దంప‌తులు ఎప్పుడూ ముందువ‌రుస‌లోనే ఉంటార‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ముందు వారు క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నా.. ఆశ్చ‌ర్య‌మేమీ లేద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికే భూపాల‌ప‌ల్లి నుంచి సుష్మిత‌ను బ‌రిలోకి దించితే.. తాము గెలిపించుకుంటామ‌ని కొండా వ‌ర్గీయులు బ‌హిరంగంగానే చెబుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

Related Posts