YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీటీడీపీ...కిం కర్తవ్యం

టీటీడీపీ...కిం కర్తవ్యం
తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఊపు ఊపిన టీడీపీ ఇప్పుడు తెలంగాణలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీని నడిపించే సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడంతో... ఆ పార్టీ భవిష్యత్తు గాలిలో దీపంలా తయారయ్యింది. ఏపీలో పలు సమస్యలతో సతమతమవుతున్నటీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించకపోవడంతో తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది.రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలంగాణ టీడీపీకి ఇప్పుడు పెద్ద దిక్కుంటూ ఎవరు లేకుండా పోయారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పక్షాలు ప్రజలతో మమేకం అవుతుంటే టీ టీడీపీ నాయకులు మాత్ర ఎన్టీఆర్‌ భవన్‌కే పరిమితమవుతున్నారు.. పార్టీ నేతల్లో ఉలుకూ పలుకూ లేకపోవడంతో కేడర్‌ డీలా పడుతోంది. అసలు తెలంగాణలో తెలుగుదేశం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుందట తెలుగు తమ్ముళ్లకు...  కీలకమైన ఎన్నికల సమయంలో ఇతర పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో బిజీబిజీగా ఉంటే టీ టీడీపీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.. తెలంగాణ ఏర్పడిన తరువాత టీడీపీ 15 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపింది. వారిలో 12 మంది కారెక్కేశారు. కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు. పార్టీలో గ్రూప్  తగాదాలతో విసిగిపోయిన రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పంచన చేరారు. ఇక మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య మాత్రమే. ఇందులో ఆర్. కృష్ణయ్య పార్టీలో ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ట్రస్ట్ భవన్‌కి ఆయన వచ్చిందే లేదు. పై పెచ్చు ఆయన టీడీపీనే విమర్శిస్తూ టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండగా ఇప్పటి వరకు అధినేత ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడం... మిగతా పార్టీలేమో ప్రజల్లోకి దూసుకెళ్తుండటంతో నేతలు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు... ఇప్పటికే కీలక నేతలందరూ వేరే పార్టీల్లోకి చేరిపోగా... ఉన్న నలుగురు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఏ చెట్టుపై వాలిపోతారో తెలియని పరిస్థితి.టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉండటం.. తరువాత ఎలక్షన్స్‌ లో తిరిగి అధికారంలోకి పార్టీని తీసుకరావాల్సిన బాద్యత ఆయనపై ఉండటంతో, తెలంగాణలో పార్టీ పరిస్థితిని సమీక్షించే సమయం చంద్రబాబుకి దొరకడం లేదు. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌ రమణ బలమైన నాయకుడు కాకపోవడం, ఉన్న ఒక్క బలమైన నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఇప్పడు టీడీపీలో ఉన్న వారంతా చంద్రబాబుపైనే పూర్తిగా ఆధారపడే పరిస్థితి.. టీ టీడీపీని ఇంత మంది నేతలు వీడుతున్నా కనీసం వారిని ఆపేందుకు ప్రయత్నించిన నాయకులు కూడా లేకపోవడం విచిత్రం...
అడపాదడపా పార్టీ అధ్యక్షుడు, కొందరు సీనియర్లు చేసిన జిల్లాల పర్యటనలు చేస్తున్న... అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో అంతా ట్రస్ట్ భవన్ గడప దాటడం లేదు. ఇక్కడే ఉంటే వచ్చే ఎన్నికల్లో  నెట్టుకురావడం కష్టమేననే భావనలో కొందరు సీనియర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నేతలు పక్క చూపులు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉంటే మరికొందరు కాంగ్రెస్‌తో మంతనాలు సాగిస్తున్నారు. పార్టీలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఓ పెద్ద దిక్కు లేకపోవడమేనని అంటున్నారు కొందరు సీనియర్లు. పేరుకి జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నప్పటికీ... పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టకపోవడం.. టీటీడీపీ నేతలకు సమయం కూడా ఇవ్వకపోడం, తెలంగాణలో నెలకో సారి సమావేశం పెట్టుకుందామని చెప్పినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడంతో నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పడుతున్నారు. ఇక్కడే కొనసాగితే తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వారు భావిస్తున్నారట. చంద్రబాబు తీరు చూస్తుంటే తెలంగాణలో చాప చుట్టేసినట్టే ఉందని కొందరు నేతలు వాపోతున్నారు.ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అసలు టీటీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అన్న చర్చ మొదలైంది. ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేకపోవడం... ఏదో ఒక పార్టీతో జతకడితేనే భవిష్యత్‌ ఉంటుందన్న విశ్లేషణల నేపధ్యంలో చంద్రబాబునాయుడు టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందన్న సంకేతాలు ఇదివరకు ఇచ్చారు.. కాని ఇది పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని గ్రహించడంతో దానికి ఆదిలోనే బ్రేక్‌ వేశారు.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని చెప్పడంతో తెలంగాణలో టీడీపీతో కలిసే అవకాశాలు లేవు... ఇక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేకంగా అవుతుందన్న భయం.. బీజేపీ ఏకపక్షంగా పొత్తు రద్దుచేసుకోవడం... కోదండరాం తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్‌తో కలిసే అవకాశం ఉండటంతో టీటీడీపీ ఒంటరిగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి...తెలంగాణలో టీడీపీకి మంచి పట్టు ఉంది.. ఎన్టీఆర్‌ పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంతో బీసీ వర్గాలు టీడీపీ వెంటే నడుస్తున్నాయి.. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇప్పటికీ తెలంగాణలో బలమైన కేడర్‌ ఉంది. కాని సమర్ధవంతమైన నాయకులే కరువయ్యారు.. అందుకే బ్రాహ్మణికి తెలంగాణ పగ్గాలు అప్పచెప్పాలని కేడర్‌ కోరినప్పటికీ అందుకు చంద్రబాబు అంగీకరించలేదు.. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు తెలంగాణలోని పార్టీపై దృష్టి సారించి దీనిని గాడిన పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.. లేకుంటే పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు...

Related Posts