YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వేడెక్కుతున్న హిందుపురం రాజకీయాలు

వేడెక్కుతున్న హిందుపురం రాజకీయాలు
హిందూపురం రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఎన్నికలకు మరోసారి ఏడాదిలోపు మాత్రమే గడువు ఉండటంతో రెండు పార్టీలు తమ అస్తద్రస్త్రాలను సిద్ధం చేసుకొంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీనటుడు నందమూరి బాలకృష్ణకు నువ్వానేనా అన్న రీతిలో పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు సైతం ఇక్కడ మకాం వేసి గెలుపుకు కృషి చేయాల్సి వచ్చింది. మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు ఇద్దరూ గతంలో పోటీ చేసిన వారే రెండు పార్టీల తరఫున బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి ఇక్కడి నుండి విజయకేతనం ఎగురవేయాలని ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. పట్టణ ఓటర్లను గుంపగుట్టగా సాధించాలన్న లక్ష్యంతో పట్టణానికి రూ.194 కోట్లతో తాగునీటి పథకం, రూ.23 కోట్లతో నూతన మార్కెట్ నిర్మాణం తదితర పనులు శరవేగంగా పూర్తి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు వౌలిక సదుపాయాల కల్పనకు రూ.66 కోట్లు మంజూరు చేయించేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే హిందూపురం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి పలు చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ దర్శిని కార్యక్రమాన్ని చేపట్టారు. రానున్న రోజుల్లో నాయకులంతా ప్రజల్లోనే ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. తెదేపా మరోసారి హిందూపురంపై జెండా ఎగురవేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుండగా వైకాపా సైతం ఈ సారి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. హిందూపురం రాజకీయాల్లో 30 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నవీన్‌నిశ్చల్ ఇవే చివరి ఎన్నికలు అనుకున్న రీతిలో చావోరేవో తేల్చుకునేందుకు పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతున్నారు. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇచ్చిన అనేక హామీల అమలులో విఫలం కావడాన్ని, బాలకృష్ణ స్థానికంగా అందుబాటులో లేని అంశాల ఆధారంగా పోరు సాగించాలని సిద్ధమవుతున్నారు. వైకాపాకు హిందూపురం నియోజకవర్గంలో గణనీయమైన ఓటుబ్యాంక్ ఉండటం, గత నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే వైకాపాకు పెట్టని కోటగా ఉండే ప్రధాన సామాజిక వర్గం నవీన్‌కు దూరంగా ఉండటాన్ని పసిగట్టిన అధిష్ఠానం సర్దుబాటు చర్యలు చేపట్టింది. అభ్యర్థి ఎవరైనా పార్టీనే ముఖ్యమని, నాయకులంతా అధినేత జగన్ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాల్సిందేనని ఉన్నత స్థాయి నుంచి సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ బంధువైన వైఎస్ కొండారెడ్డి రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయి నుండి ముఖ్య నాయకులందరినీ గుర్తించి పార్టీపరంగా పనిచేసేలా చూసేందుకు చర్చలు సాగిస్తున్నారు. నవీన్‌నిశ్చల్‌తో ఆ వర్గ నాయకులను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రస్థాయిలో చర్చలు సాగుతున్నాయి. దీనికితోడు గతంలో కాంగ్రెస్‌కు వచ్చిన 10 వేల ఓట్లలో మెజార్టీ భాగం వైకాపాకు అందుతాయని, కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని వైకాపాకు గెలుపు అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, జనసేన పార్టీలు నామమాత్రంగానే పోటీలో ఉంటాయని, ప్రధానంగా టీడీపీ, వైకాపా నడుమే పోటీ ఉంటుందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. రెండు పార్టీల బలాబలాలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లోనూ హిందూపురం నియోజకర్గంలో పోరు హోరాహోరీగా సాగే అవకాశం లేకపోలేదు.టీడీపీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు రోజులపాటు చిలమత్తూరులో మకాం వేసి పంచాయతీల వారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు తమకు జరుగుతున్న అన్యాయాలపై నేరుగా బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా చిలమత్తూరు మండల స్థానిక సంస్థల ముఖ్య ప్రజాప్రతినిధి వర్గీయులదే పెత్తనం సాగిస్తూ అటు పార్టీని ఇటు కార్యకర్తలను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో మండల కన్వీనర్ బాబురెడ్డిని తొలగించి గతంలో మండల కన్వీనర్‌గా పనిచేసిన బీ.రంగారెడ్డిని నియమిస్తూ  అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బాలకృష్ణ పీఏగా వ్యవహరించిన శేఖర్ వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి స్వచ్ఛందంగా మండల కన్వీనర్ పదవికి దూరమయ్యారు. అప్పట్లో ఓ మండల ప్రజాప్రతినిధి బంధువు బాబురెడ్డిని కన్వీనర్‌గా నియమించారు. బాలకృష్ణ సమీక్షలో చిలమత్తూరు మండలంలో జరిగిన తతంగాలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ రంగారెడ్డికే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇకపోతే లేపాక్షి మండలానికి చోళసముద్రం ప్రభాకర్‌రెడ్డి మండల కన్వీనర్‌గా వ్యవహరించగా బీసీలకు అవకాశం ఇవ్వాలని భావించి లేపాక్షి సర్పంచ్ జయప్పను నియమించారు. ప్రభాకర్‌రెడ్డి వివాదరహితుడిగా వ్యవహరించినప్పటికీ ఇటు హిందూపురం రూరల్ అటు చిలమత్తూరు మండలాలకు ఓసీలు కన్వీనర్లుగా ఉండటంతో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభాకర్‌రెడ్డిని తప్పించి జయప్పను నియమించినట్లు సమాచారం. 

Related Posts