YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇవి రోడ్లేనా..?

ఇవి రోడ్లేనా..?

చంద్రన్న బాట పేరుతో వందల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించారు.. పల్లెల్లో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఉపాధిహామీ కన్వర్జెన్సీ నిధులను వెచ్చించారు.. లక్ష్యానికి మించి నిర్మించడంతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది.. ఇదంతా అభివృద్ధికి ఒకవైపు. ఏడాది పొడవునా చేయాల్సిన పనులను ఆర్థిక సంవత్సరాంతంలో చేస్తున్నారు.. పనులన్నీ ఒకేసారి మొదలవ్వడంతో పర్యవేక్షణ కొరవడడం.. గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేయడంతో నిర్మాణాలు నాసిరకంగా మారాయి. దీంతో రహదారులు కొద్దికాలానికే దెబ్బతినిపోతున్నాయి. ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కాదు.. శాఖాపరంగా చేపట్టిన నాణ్యత నియంత్రణ తనిఖీల్లో వెల్లడైన లోపాలే. వీటికి బాధ్యులైన అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చినా జిల్లా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

జిల్లాలో గత నాలుగేళ్లలో చంద్రన్నబాట పథకంలో 1,459 కిలోమీటర్ల మేర గ్రామాల్లో సీసీ రహదారులను నిర్మించారు. పల్లెల్లో పెద్దఎత్తున చేపట్టిన ఈ రహదారుల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం రహదారి మన్నిక 15 నుంచి 20 ఏళ్లు ఉండేలా నిర్మాణాల్లో ఎమ్‌20 నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. నిర్మాణాలు పూర్తయ్యాక కోర్‌ కటర్‌ ద్వారా నాణ్యతను పరిశీలిస్తామని చెప్పారు. అన్నట్లుగానే మొదటి రెండేళ్లు ఎమ్‌20 ప్రమాణాలు పాటించారా లేదా అని నాణ్యత నియంత్రణ తనిఖీలు చేపట్టి చాలా వరకు నాసిరకపు పనులను బయటపెట్టారు. వీటిపై అప్పట్లోనే బాధ్యుల నుంచి రికవరీలకు ప్రతిపాదించారు. అనంతరం విజిలెన్స్‌ తనిఖీల ఆధారంగా నాసిరకం పనులకు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి జవహర్‌రెడ్డి ఇదివరకే ఉత్తర్వులను జారీచేశారు. అయితే వీటిపై జరగాల్సిన విచారణలు మందకొడిగా జరుగుతున్నాయి. చర్యల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది విచారణ అధికారులపై ఆరోపణలు చేస్తూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ఉపాధిహామీ నిధులతో చేపట్టిన సీసీ, గ్రావెల్‌ రహదారుల నిర్మాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా నాసిరకమైన నిర్మాణాలకు కారణమయ్యారని పంచాయతీరాజ్‌కు చెందిన 23 మంది అధికారులపై మూడు విడతల్లో విచారణకు ఆదేశించారు. అప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేకపోవడంతో తుది విచారణ నిమిత్తం అధీకృత అధికారులను నియమించింది. వీరు విచారణ చేసి ఇచ్చే నివేదిక ఆధారంగానే బాధ్యులపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విచారణ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓవైపు బాధ్యుల ఒత్తిడి.. మరోవైపు పని భారంతో విచారణ ఉత్తర్వులను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో అక్రమాలకు పాల్పడిందెవరు.. పక్కదారి పట్టిన నిధులెంతో తేలడం లేదు.

Related Posts