YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

పసందైన వినోదం కోసం ‘ఛలో’ 

పసందైన వినోదం కోసం ‘ఛలో’ 

చిత్రం: ఛలో ., నటీనటులు: నాగశౌర్య.. రష్మిక మందాన.. నరేష్‌.. వెన్నెల కిషోర్‌.. సత్య.. పోసాని కృష్ణమురళి తదితరులు ., సంగీతం: మహతి స్వర సాగర్‌ ., సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌ ., ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.. తమ్మిరాజు ., దర్శకత్వం: వెంకీ కుడుముల ., నిర్మాత: ఉషా ముల్పూరి ., బ్యానర్‌: ఐరా క్రియేషన్స్‌.. కథేంటంటే..

హరి(నాగశౌర్య)కి చిన్నప్పటి నుంచి గొడవలంటే మహాఇష్టం. ఇద్దరు గొడవ పడుతుంటే చూసి తెగ ఆనందిస్తుంటాడు. ఎవరినైనా కొట్టాలన్నా, కొట్టించుకోవాలన్నా ఇష్టం. అతడి పోరు భరించలేక హరి తండ్రి (నరేష్‌) అతడ్ని తిరుప్పురం అనే ఊరు పంపించేస్తాడు. అది ఆంధ్రా, తమిళనాడు బోర్డర్‌లో ఉంటుంది. ఆ రెండు ఊళ్లకు అస్సలు పడదు. తెలుగు వాళ్లు, తమిళుల మధ్య పోరు సాగుతుంటుంది. హరి ఆ ఊరి కళాశాలలో చేరతాడు. అతను తమిళ వ్యక్తి అనుకొని తమిళ బ్యాచ్‌ అతన్ని వాళ్ల టీమ్‌లోకి చేర్చుకుంటుంది. అక్కడే కార్తీక(రష్మిక)ను చూసి ఇష్టపడతాడు. ఆమెలోనూ హరిలో ఉన్న లక్షణాలే ఉంటాయి. అయితే, కార్తీక ఓ తమిళ అమ్మాయి. ఆ అమ్మాయిని ప్రేమించాలంటే ఆ ఇంట్లో వాళ్లకు నచ్చాలి. అది జరిగే పనికాదని తెలిసి.. ఆ రెండు ఊళ్లను కలపాలని అనుకుంటాడు. మరి ఆ రెండు ఊళ్లు కలిశాయి? వీళ్ల పెళ్లి జరిగిందా? ఆ ఊళ్ల వెనుక ఉన్న పగ ఏంటి? అన్నదే ‘ఛలో’.

ఎలా ఉందంటే: మొత్తంగా చూస్తే ‘ఛలో’ కథ చాలా చిన్న లైన్‌. రెండు ఊళ్లను కలపడం చాలా సినిమాల్లో చూశాం. అయితే, కథ ఎలా ఉందన్నది పక్కన పెడితే దాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. హీరో పాత్రను చాలా విభిన్నంగా రాసుకొన్నాడు దర్శకుడు. దాని చుట్టూనే ఫన్‌ జనరేట్‌ చేశాడు. కళాశాల సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. హాయిగా నవ్విస్తాయి. హీరో-హీరోయిన్‌ల మధ్య సాగిన లవ్‌ ట్రాక్‌ కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఫస్టాప్‌లో పెద్దగా కథ లేకపోయినా, కామెడీ.. పాటలతో నడిపించాడు. రఘుబాబు, సత్యల కామెడీ ట్రాక్‌.. కళాశాలలో స్లిప్‌లు రాసే సన్నివేశాలు యూత్‌ను ముఖ్యంగా కాలేజ్‌ కుర్రకారును బాగా అలరిస్తాయి. ద్వితీయార్ధంలోనే హీరో అసలు ట్రాక్‌ మొదలవుతుంది. ఒక లక్ష్యం అన్నది అప్పుడే ఏర్పడుతుంది. అది ఆ రెండు ఊళ్లను కలపడం. కథను మరీ సీరియస్‌గా నడపకుండా వెన్నెల కిషోర్‌ పాత్రను ప్రవేశపెట్టాడు దర్శకుడు. దీంతో కథలో వినోదం డోస్‌ పెరుగుతుంది. ఆ పాత్రను రాసుకున్న విధానంగా కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అయితే పతాక సన్నివేశాలు కాస్త బలహీనంగా అనిపిస్తాయి. ఒక చిన్న కారణానికి రెండు ఊళ్లు గొడప పడటం అతికినట్లు అనిపించదు. అయితే దానిని కామెడీగా తీసుకుంటే అది కూడా పాసైపోతుంది.

ఎవరెలా చేశారంటే: హరి పాత్రను నాగశౌర్య చాలా ఈజీగా, జోవియల్‌గా చేశాడు. ఎక్కడా ఇబ్బంది పడినట్లు కూడా అనిపించలేదు. ఎదుటవారిని కొడుతుంటే ఆనందపడే పాత్ర గతంలో ఏ చిత్రంలోనూ రాలేదు. నాగశౌర్య ఆ పాత్రలో ఇమిడిపోయాడు. ఇక కథానాయిక రష్మికకు మంచి మార్కులే పడతాయి. చక్కని హావభావాలతో ఆకట్టుకుంది. నాగశౌర్యతో పోటీపడి నటించింది. తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి. సత్య, వెన్నెల కిషోర్‌లు బాగా నవ్విస్తారు. అయితే, బలమైన విలనిజం లేకపోవడం ఈ సినిమాకు లోటు. పాటలు అందంగా, వినగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. అనవసరంగా ఎక్కడా ఇరికించినట్లుగా కూడా అనిపించవు. నేపథ్య సంగీతం సినిమా అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. దర్శకుడు వెంకీ కుడుముల రాసుకున్న సంభాషణల్లో మెరుపులు కనిపించాయి. వెన్నెల కిషోర్‌తో చాలా పంచ్‌లు పేల్చారు. తొలి చిత్రమే అయినా, తడబాటు లేకుండా సినిమాను తీర్చిదిద్దిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.దాదాపు ఏడాది విరామం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన చిత్రం ‘ఛలో’. దర్శకుడితో కలిసి ఈ చిత్ర కథకు మెరుగులు దిద్దడంతో పాటు, సొంత నిర్మాణ సంస్థలో దాన్ని తెరకెక్కించడం విశేషం. అంతేకాదు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవిని పిలిచి మరీ ఆశీస్సులు తీసుకున్నారు నాగశౌర్య. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య. ఆ తర్వాత ‘కల్యాణ వైభోగమే’, ‘ఒక మనసు’, ‘జ్యో అచ్యుతానంద’, ‘కథలో రాజకుమారి’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా, విభిన్న కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 

 

Related Posts