YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రఘవీరా రెడ్డి పై వేటు తప్పదా..!!

రఘవీరా రెడ్డి పై వేటు తప్పదా..!!
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనే అన్నీ తానే అయి వ్యవహరించారు. గత నాలుగేళ్లుగా ఆయన అమరావతిలోనే ఎక్కువగా కన్పిస్తూ పార్టీ కార్యక్రమాలను సజావుగానే నిర్వహిస్తున్నారు.కానీ ఆయనను మార్చాలట. ఆయనను పదవి నుంచి తమ వర్గం నేతలకు ముఖ్యమైన పదవిని కట్టబెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మింగ మెతుకు లేకపోయినా…..అన్న సామెత ఆంధ్రప్రదేశ్ కు ఖచ్చితంగా సరిపోతుంది. రాష్ట్ర విభజనతో ఆ పార్టీ దాదాపు కోమాలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు సరైన నేతలూ లేరు..క్యాడరూ లేదు. మళ్లీ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కు దశాబ్దాలుగా ఉన్న ఓటు బ్యాంకు చెల్లా చెదురైపోయింది.ఈ పరిస్థితుల్లో నేతలు ఏం చేయాలి? సమైక్యంగా ఉండి పార్టీ పరిస్థితిని మెరుపడేలా ప్రయత్నాలు చేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సంఘటితంగా కృషి చేయాలి. అలా చేస్తే…వారు కాంగ్రెస్ నేతలు ఎందుకు అవుతారు? పార్టీ ఎలా ఉన్నా….నాయకుడిని మార్చాల్సిందేంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు. తొలినాళ్లలో ఆ పదవిని తీసుకునేందుకు కూడా నేతలు ఎవరూ ముందుకు రాలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా రఘువీరారెడ్డి మాత్రం ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క నేత వెళుతున్నప్పటికీ రఘువీరారెడ్డి మాత్రం నిత్యం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను పార్టీ వైపు మళ్లించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రఘువీరారెడ్డిని మార్చాలన్న డిమాండ్ ను పార్టీలో కొందరు లేవనెత్తారు. ముఖ్యంగా మాజీ ఎంపీ చింతా మోహన్ బహిరంగంగా రఘువీరారెడ్డిపై ధ్వజమెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లోని కొందరు నేతలు రఘువీరాపై హైకమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారు.రఘువీరారెడ్డి జగన్ కు అనుకూలంగా ఉన్నారని, దీనివల్ల కాంగ్రెస్ బలపడలేదని ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పంపారు. అయితే అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఉమెన్ చాందీ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా నియమించడం, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీలో చేరడంతో మళ్లీ రఘువీరాను మార్చాలన్న నినాదం ఊపందుకుంది. కిరణ్, ఉమెన్ చాందీ సమక్షంలోనే కొందరు నేతలు రఘువీరాపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఉమెన్ చాందీ మాత్రం ఆ నేతలకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. తొలుత పార్టీని బలోపేతం చేయాలని, ఆ తర్వాతనే నేతలను మార్చే విషయం ఆలోచిస్తామని చెప్పారట. కాని సదరు నేతలు మాత్రం తమ ప్రయత్నాలను మానుకోలేదు. కొత్తగా చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రఘువీరారెడ్డిని మార్చేందుకు మాగ్జిమమ్ ట్రై చేస్తున్నారు. మరి కిరణ్ ఎవరి పక్షాన నిలబడతారో చూడాలి.

Related Posts