YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పొంచి ఉన్న డయేరియా

పొంచి ఉన్న డయేరియా
కుమురం భీమ్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువే. ఏజెన్సీ ఏరియాలు కొన్ని అభివృద్ధికి కొంత దూరంలోనే ఉన్నాయి. దీంతో ఇక్కడి వారికి వైద్య సేవలు అందడంలో తరచూ ఆలస్యమవుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వానలు కురవడంతో వ్యాధులు విజృంభించే అవకాశాలే అధికమని అంతా భయపడుతున్నారు. ఆదిలాబాద్ లో ఇప్పటికే డయేరియా కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో కుమురం భీమ్ జిల్లా వాసుల్లోనూ ఆందోళన వెల్లువెత్తుతోంది. సురక్షిత తాగునీరు, పరిశుభ్రత ఉంటే వ్యాధులకు దూరంలో ఉండొచ్చు. కానీ ఏజెన్సీ ప్రాంతాలు అనేకం.. వీటికి దూరంగానే ఉండిపోతున్నాయి. వానాకాలంలో అతిసారం వ్యాప్తి ముప్పు ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. గుక్కెడు నీరు తాగితే.. ఎలాంటి రోగం వస్తుందోనని భయపడుతున్నారు. అయినప్పటికీ వారు అందుబాటులో ఉన్న నీటినే తాగుతూ అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ సమస్యలు తెలిసినా స్థానిక అధికారయంత్రాంగం మాత్రం ఉదాసీనంగా ఉంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య పనులు కొనసాగేలా చూడాలని అంతా కోరుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానాకాలం వస్తే వ్యాధుల విజృంభణ సాధారణమైపోతోంది. ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ ఏటా వ్యాధుల వ్యాప్తి ఎక్కువగానే ఉంటోంది. వేలల్లో జిల్లా వాసులు గిరిజన, గిరిజనేతర ప్రాంతం అనే తేడా లేకుండా ప్రజలు అనారోగ్యాలబారిన పడుతున్నారు.  
 
అధికారులు ఉదాసీనత వీడి ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య పనులు కూడా ముమ్మరంగా జరిపించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు. వైద్య విభాగం అన్ని రకాల అనారోగ్యాలకు త్వరితగతిన చికిత్స అందించేలా సిద్ధమవ్వాలని మందులకు కొరతలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు. ఇక ప్రజలు కూడా తమవంతు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున బావులు, చెరువులు, చెలమల్లో నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి నీటిని సేవిస్తే అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య శాఖ చెప్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు నీటిని కాచి, చల్లార్చి వడపోసుకొని తాగితే వ్యాధుల బారిన పడకుండా ఉంటారని సూచిస్తోంది. ఇక ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటూ పరిసరాలపైనా దృష్టి సారించాలి. ఇంటి సమీపంలో చెత్తా చెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తపడాలి. ఇళ్లల్లోనూ నిల్వ నీరు లేకుండా దోమలు దరిచేరకుండా చర్యలు తీసుకోవాలి. తప్పనిసరిగా దోమ తెరలు వాడాలి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలకు దోమ తెరలను సరఫరా చేశారు. వీటిని వాడాలి. దోమకాటుకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటే అనారోగ్యాలకు కొంత దూరంగా ఉండొచ్చు.  

Related Posts