YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

రెండో వన్డేలో భారత్ ఘన విజయం..

రెండో వన్డేలో భారత్ ఘన విజయం..

- దక్షిణాఫ్రికాపై  20.3 ఓవర్లలోనే ఛేదన..

- అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న ధావన్.. 

- చాహల్‌కు 4, కుల్దీప్‌కు 3 వికెట్లు

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో భారత్ జయభేరి మోగించింది. టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించినా భారత్.. ఆది నుంచీ దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం చెలాయించింది. భారత స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌లు దక్షిణాఫ్రికా వెన్ను విరిచారు. ఈ స్పిన్ ద్వయం ధాటికి దక్షిణాఫ్రికా 118 పరుగులకే కుప్ప కూలింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఏ ఒక్కరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేకపోయారు.

అనంతరం 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్నే ఇచ్చారు. దూకుడుగా ఆడారు. తొలి ఓవర్లోనే సిక్సర్‌తో ఖాతా తెరిచిన రోహిత్.. ఆ తర్వాత రబాడ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది మంచి ఊపు మీద కనిపించాడు. అయితే అదే ఊపులో రబాడ వేసిన బౌన్సర్‌ను భారీ షాట్‌గా మలిచే ప్రయత్నంలో రోహిత్ (15, ఒక సిక్స్, 2 ఫోర్లు).. మోర్నె మోర్కెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 26 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఆది నుంచి దూకుడుగా ఆడుతున్న ధావన్‌ (53, 9ఫోర్లు)కు కెప్టెన్ కోహ్లీ (46, 4 ఫోర్లు, ఒక సిక్స్) జత కలిసి.. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని కరిగించేశారు. 20.3 ఓవర్లలోనే లక్ష్యానికి చేర్చారు. ధావన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే, ఓ దశలో భారత విజయానికి 2 పరుగులు కావాల్సిన తరుణంలో లంచ్‌ బ్రేక్ ఇచ్చారు అంపైర్లు. విజయానికి కావాల్సిన పరుగులు అతి స్వల్పమే అయినా అంపైర్లు లంచ్‌కు పిలవడంతో కోహ్లీ కాస్తంత అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే, సవరించిన కొత్త నిబంధనలకు అనుగుణంగా అంపైర్లు కూడా తాము చేసేదేమీ లేదంటూ లంచ్‌ బ్రేక్ ఇచ్చారు. లంచ్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపటికే ఆ రెండు పరుగుల లాంఛనం కానిచ్చేశాడు కోహ్లీ. రెండో వికెట్‌కు వీరిద్దరూ అభేద్యమైన 93 పరుగులు జోడించారు. కాగా, ఈ విజయంతో 6 వన్డేల సిరీస్‌లో 2-0తో భారత్ ముందంజ వేసింది.

Related Posts