YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

7032 గ్రామాల్లో డంప్‌యార్డులకు స్థలాలు

 7032 గ్రామాల్లో డంప్‌యార్డులకు స్థలాలు
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టడమే లక్షంగా సర్కారు ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీని కోసం పంచాయతీలలో పారిశుద్ధం నిర్వహణకు పెద్ద ఎత్తున సానిటరీ వర్కర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  రాష్ట్రంలోని 12751 పంచాయతీలలో 21768 గ్రామాలున్నాయి. వీటిలో చెత్తను తొలగించి గ్రామానికి దూరంగా వేసేందుకు డంప్ యార్డులు కేవలం 2691 గ్రామాల్లో మాత్రమే ఉన్నాయి.  మరో 19077గ్రామాల్లో డంప్‌యార్డులు లేవు. వీటిలో 7032 గ్రామాల్లో డంప్ యార్డుల కోసం స్థలాన్ని గుర్తించి వాటి వివరాలను పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు పంపించారు. వీటితో పాటు గ్రామాల్లో చెత్తను సేకరించి డంప్ యార్డుల వరకు తరలించడానికి గ్రామ స్థాయిని బట్టి ఆటోలు, రిక్షాలు, ఎడ్ల బండ్లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి అవసరం ఎంత మేరకు ఉందో కూడా ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శుల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంటోంది.పట్టణాల్లో మాదిరిగానే పల్లెల్లో తడిపొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని, వాటిని డంప్ యార్డుల్లోకి చేర్చి రీ సైక్లింగ్ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు తగు ఏర్పాట్లకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శు లు, ప్రత్యేకాధికారులు తగు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాదేశాల మేరకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో డంప్ యార్డులు లేని గ్రామాలను గుర్తించారు. వాటిలో 7032 గ్రామాల్లో డంప్ యార్డుల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించారు. రాష్ట్రంలో అన్ని పంచాయతీలలో  స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. నెల రోజుల పాటు ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పంచాయతీలతో పాటు వాటి పరిధిలోని ఆవాసాలన్నింటిని స్వచ్ఛగా మార్చేయాలని సంకల్పించింది.ఇప్పటికే పాత పంచాయతీలలో చాలా మేర ఇవి ఉన్నాయి. లేని పంచాయతీలు, ఆవాసాలను గుర్తించి వాటిలో ఏమేరకు అవసరమో నిర్ణయించి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు వచ్చిన నివేదిక ప్రకారం ప్రస్తుతం 2800ల రిక్షాలు ఉండగా మరో 20546 అవసరం. అలాగే ఆటోలు ప్రసుత్తం 410 ఉండగా మరో 3937 ఆటోలు, ఎడ్లబండ్లు 326 ఉండగా మరో 1561 అవసరం. మొత్తం పంచాయతీల వారీగా అన్ని గ్రామాలకు చెందిన వివరాలు రాలేదు. మరి కొన్ని పంచాయతీల నుంచి ఈ వివరాలు రావాల్సి ఉందని పంచాయతీరాజ్ అధికారి ఒకరు తెలిపారు. పూర్తి పంచాయతీలు, అన్ని ఆవాసాల వారీగా  అవసరమైన డంప్‌యార్డులు, ఆటోలు, రిక్షాలు, ఎడ్ల బండ్లకు సంబందించిన వివరాలు రాగానే వాటి ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు కోసం ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమానికి ప్రభుత్వ విశేష ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. దీంతో వీటి ఏర్పాటులో జాప్యం జరగదని వేగంగానే మంజూరి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related Posts