YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ నూతన జోనల్‌ విధానికి కేంద్రం ఆమోదం

తెలంగాణ నూతన జోనల్‌ విధానికి కేంద్రం ఆమోదం
తెలంగాణ నూతన జోనల్‌ విధానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్రం తాజాగా గెజిట్‌ విడుదల చేసింది. గురువారం ఉదయం రాష్ట్రపతి సంతకం అనంతరం కేంద్ర హోంశాఖ వెంటనే గెజిట్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ జోనల్‌ విధానానికి ఆమోదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ ఆవశ్యకతను వివరించారు. జోనల్‌ వ్యవస్థను ఆమోదిస్తేనే తదుపరి ఉద్యోగ నియామకాలు చేపట్టే వీలు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్‌ వ్యవస్థకు ప్రధాని నరేంద్రమోదీ ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత ఇందుకు సంబంధించిన దస్త్రంపై మోదీ సంతకం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
కొత్త జోనల్‌ విధానం..
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళజోన్‌గా, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళజోన్‌గా పరిగణిస్తారు.
ప్రస్తుతం తెలంగాణలో జిల్లా కేడర్‌లో 80:20, జోనల్‌ కేడర్‌లో 70:30, బహుళజోనల్‌లో 60:40 నిష్పత్తిలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, బహుళజోన్‌, రాష్ట్రస్థాయి కేడర్లుగా పరిగణిస్తారు. మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. వాటికి 95 శాతం స్థానిక రిజర్వేషన్లు, అయిదు శాతం స్థానికేతర రిజర్వేషన్లు ఇస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టుల్లో రిజర్వేషన్లు లేవు. అందరూ వీటికి పోటీపడేవారు. కొత్త విధానంలో రాష్ట్ర స్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలను పూర్తిగా నిలిపివేసి కేవలం పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.
ప్రస్తుతం నాలుగు నుంచి పది తరగతుల్లో నాలుగేళ్లపాటు చదివినవారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇకపై ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులవుతారు. జిల్లా, జోన్లు, బహుళజోన్లు, రాష్ట్రస్థాయిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులవుతారు.

Related Posts