YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో మరో కొత్త పార్టీ బీసీ ప్రజా పార్టీ, ప్రజా సమితి

తెలంగాణలో మరో కొత్త పార్టీ బీసీ ప్రజా పార్టీ,  ప్రజా సమితి

పేరుకే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే.. కానీ ఆయన పార్టీకి ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణల కారణంగా ఆయన మరోసారి తెరపైకి వచ్చారు. ఆయనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. బీసీ ఉద్యమ నేతగా పేరొందిన ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపే ఆయన కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారట. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారని వినికిడి. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన ప్రధాన రాజకీయ పార్టీలు తగినన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా బీసీలను చట్టసభల్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకని బీసీల పార్టీని నెలకొల్పాలని ఆర్‌.కృష్ణయ్యపై ఒత్తిడి పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలోని బీసీ సంఘాలు ఆయన్ని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. తాజాగా రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా బీసీ భవన్‌కు వచ్చి ఆర్‌.కృష్ణయ్యపై ఒత్తిడి తెచ్చారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను సిద్ధం చేయాలని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రసత్యనారాయణతో పాటు మేధావుల కమిటీ సభ్యులకు కృష్ణయ్య సూచించినట్లు తెలిసింది. పార్టీ పెడితే ఏ పేరు పెట్టాలనే అంశంపైనా చర్చకు వచ్చినట్లు బీసీ సంఘం నేతలు తెలిపారు. బీసీ జనసమితి, బీసీ జనసేన, బీసీ ప్రజాపార్టీ, బీసీ ప్రజా సమితి తదితర పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ పేర్లలో దేనిని ఎంపిక చేయాలన్న దానిపై ఆర్‌.కృష్ణయ్య తనయుడు డాక్టర్‌ అరుణ్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ చర్చిస్తున్నట్లు తెలిసింది. కాగా, ముందస్తు ఎన్నికల టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసే పార్టీ నాయకుల ప్రచారాన్ని అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. అయితే, కులాల ప్రాతిపదికన పెట్టే పార్టీల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి కృష్ణయ్య రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులతో కలిసి తిరగడంతో ఆ పార్టీలో చేరబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ, ఆయన అనూహ్యంగా కొత్త పార్టీని ప్రారంభించబోతుండడం చర్చనీయాంశంగా మారింది.

Related Posts