YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బుజ్జగింపుల కోసం రంగంలోకి దిగిన కేసీఆర్ మంత్రులు

బుజ్జగింపుల కోసం రంగంలోకి దిగిన కేసీఆర్ మంత్రులు

గణేశ నిమజ్జనం తరువాత  కేసీఆర్  ఎన్నికల రంగంలోకి దిగనున్నారు. పార్టీ గెలుపు బాధ్యత తన భుజస్కంధాలపైనే వేసుకున్న ఆయన ప్రస్తుతం కార్యాచరణ రచనలో బిజీగా ఉన్నారు. దానితో పాటే అసంతృప్తులు, అసమ్మతి వాదులతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు సమాచారం. నిమజ్జనం తరువాత వీరందరితో పాటు, దంపతులతోనూ ముఖాముఖీ జరుపుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొండా  సురేఖ దంపతులకు జరిగిన అవమానాలను సరిదిద్దాలని టీఆర్ఎస్ అవమానాలను సరిదిద్దాలని తెరాస అధినాయకత్వం భావిస్తోంది. త్వరలోనే వారిని హైదరాబాద్‌కు ఆహ్వానించబోతుంది. గణపతి నవరాత్రులు ముగిసిన వెంటనే రాజకీయ కార్యాచరణ అమలు జరపాలనే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి అప్పటి వరకు వేచి ఉండాలని కొండా దంపతులతో పాటు పలువురు అసంతృప్తులకు తెలియచేశారు. వివిధ నియోజక వర్గాల్లోని  అసంతృప్తివాదులతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు  ముఖ్యమంత్రి  కేసీఆర్  కూడా టెలిఫోన్‌లో మాట్లాడుతున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలనే ఆలోచనలో ఉన్నారు.పార్టీ  క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిని సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. కొండ దంపతుల విషయంలో కొంత పొరపాటు జరిగిందనే భావనతో పార్టీ అధినాయకత్వం ఉందని టీఆర్ఎస్ వర్గాలు తెలియచేశారు. తెరాస నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండా దంపతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధినాయకత్వంపై ధ్వజమెత్తారు. తాము విధించిన గడువులోగా పార్టీ స్పందించని పక్షంలో తమ రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. కొండా దంపతులు చేసిన హెచ్చరికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సీనియర్లతో సమీక్షించారు. వరంగల్ జిల్లాలో రాజకీయ పరిణామాలపై ప్రత్యేక వేగులతో సమాచారం తెప్పించుకున్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలతో తన వద్ద ఉన్న సమాచారాన్ని పోల్చి చూసుకున్నారు. కొండా దంపతులు ప్రభావం వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, భూపాలపల్లి నియోజక వర్గాల్లో బలంగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. తెరాస గెలుపులో వరంగల్ జిల్లా అత్యంత కీలకం అని భావించారు. అలాంటప్పుడు కొండా దంపతులను దూరం చేసుకోవడం సరికాదని భావించారు. ఎలాగోలా పార్టీ పరంగా జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడంతో కొండా సురేఖ, మురళిని కాపాడుకోవాలని భావించారు. వారు కోరుకున్న విధంగా వరంగల్ తూర్పుతో పాటు మరో నియోజక వర్గం కేటాయించడానికి కూడా ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇదే విషయం ప్రత్యేక దూత ద్వారా కొండా దంపతులకు చేరవేశారని పార్టీ వర్గాలు తెలియచేశాయి. కొండా దంపతులతో పార్టీ ముఖ్యులు ఇప్పటికే  చర్చలు జరిపారు. పార్టీని వీడాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. తాము కోరుకున్న విధంగా టికెట్లు ఇచ్చిన పక్షంలో తెరాసలో కొనసాగుతామని కొండా దంపతులు తమతో చర్చలు జరిపిన సీనియర్లకు హామీ ఇచ్చారు. దీంతో కొండా దంపతుల వ్యవహారం  సానుకూలంగా పరిష్కారం కాబోతుందనే సంతృప్తిని పార్టీ వర్గాలు వ్యక్తం చేశారు. కొండా దంపతులకు వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, భూపాలపల్లి నియోజక వర్గాల్లో మంచి పట్టు ఉంది. వారు పార్టీని వీడిన పక్షంలో ఈ నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్దులను గెలిపించుకోవడం కష్టమనే అభిప్రాయంతో రాజీ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. కొండా దంపతులను పార్టీలో  చేర్చుకోవడానికి కాంగ్రెస్ సిద్దం కావడం, వారు కోరిన విధంగా టికెట్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడంతో  సీనియర్లు అత్యంత వేగంగా పావులు కదిపారు. కొండా దంపతులను దూరం చేసుకోవడం వల్ల జరిగే రాజకీయ నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించి, వారు కోరుకున్న విధంగా రెండు నియోజక వర్గాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత కొండా దంపతుల సమస్య పరిష్కారం కాగలదనే ఆశాభావంతో ఉన్నారు.మంత్రి కేటీఆర్ తన అధికార గృహానికి వచ్చిన సీనియర్లతో చర్చలు జరిపారు. మంత్రి హరీశ్‌రావు కూడా పలువురు అసంతృప్తివాదులతో మాట్లాడారు. పార్టీ ప్రయోజనాలను ఆశించి అభ్యర్దులను గెలిపించుకోవాలని నచ్చజెప్పుతున్నారు. జిల్లాల వారిగా రగులుతున్న అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు.  పార్టీ ప్రకటించిన అభ్యర్దులకు వ్యతిరేకంగా కుంపడి పెడుతున్న నియోజక వర్గం స్ధాయి నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Related Posts