YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

శృంగేరి జగద్గురు వైభవం

శృంగేరి జగద్గురు వైభవం

శ్రీకంఠయ్య కలకత్తా రైల్వేస్ లో పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగి. సెలవు మీద బెంగళూరులో ఉన్న స్నేహితుడు నాగేశ్వర అయ్యర్ను కలవడానికి వెళ్ళారు. ఈ అయ్యరు బెంగళూరులో పేరు మోసిన వకీలు. అయ్యరు వారంతంలో కుటుంబ సమేతంగా శృంగేరి జగద్గురువుల దర్శనానికి వెళ్తున్నామని, శ్రీకంఠయ్యని కూడా తమతో రమ్మని ఆహ్వానించారు. శ్రీకంఠయ్య తనకు ఇబ్బంది ఏమీ లేదని, తనది పూర్తిగా పాశ్చ్యాత పద్దతి అని, సనాతన ధర్మ ఆచార వ్యవహారలపట్ల తనకు లెక్క లేదని, జగద్గురువులు తనును ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగితే తను దురుసుగా సమాధానం చెప్పవలసి వస్తుందని చెప్పారు. అయ్యరు అలాంటి పరిస్థితి రాదని చెప్పగా, అందరు కలిసి శృంగేరి చేరుకున్నారు.

విద్యాశంకర, శారదాంబల దర్శనం ఐన తరువాత, మహాస్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి వారి ముందు నుంచున్న శ్రీకంఠయ్య కు స్వామి వారి పట్ల అపరిమితమైన గౌరవం కలిగింది. స్వామి వారు సాక్షాత్తు యజ్ఞేశ్వరునిలా కనిపిస్తున్నారు. అయ్యరు స్వామి వారిని పరిచయం చేసాక, మహాస్వామి వారు శ్రీకంఠయ్యతో మట్లాడుతూ అతని ఉద్యోగాది వివరాలను తెలుసుకుని, ఇలా అడిగారు.

స్వామి: నువ్వు రోజూ సంధ్యావందనం చేస్తున్నావా?
శ్రీకంఠయ్య : వాడిన మొహంతో అతి కష్టం మీద,"లేదు"
స్వామి : ఎందుకు? సంధ్యావందనం నేనెందుకు చెయ్యాలని చెయ్యట్లేదా? చెయ్యకపోతే ఏమౌతుంది అని చెయ్యట్లేదా? చేసి ఉపయోగం ఉండదని చెయ్యట్లేదా? సమయం లేక చెయ్యడం లేదా?

శ్రీకంఠయ్యకు ఏమి చెప్పాలో తెలియలేదు. కొద్దిసేపు ఆలోచించిన తరువాత, తాను ఎప్పుడో చదివినది గుర్తొచ్చింది. అది యాజ్ఞవల్క మహర్షి జనక మహారాజుతో బ్రహ్మ జ్ఞానం గురించి చేసిన చర్చ. సాయంత్రమైన సంధ్యావందనం చెయ్యకుండా యాజ్ఞవల్క మహర్షి బ్రహ్మ జ్ఞానం గురించి చర్చిస్తూనే ఉన్నారు. జనక మహారాజు, దీని గురించి మహర్షిని అడుగగా, మహర్షి ఇలా చెప్పారు, "ఎప్పుడూ పరబ్రహ్మతో రమిస్తూ ఉండే జ్ఞాని ఏ కర్మ చేయనక్కర్లేదు". లోక సంక్షేమం కోసం కర్మలు చేయవచ్చు కాని, కర్మ లోపం తప్పు కాదు". శ్రీకంఠయ్య ఈ ఉదంతమంతా శ్లోకంగా చెప్పారు.

మహాస్వామి శ్రీకంఠయ్య సమయస్ఫూర్తి మరియు తెలివికి ప్రీతి చెందినవారై ఇలా అడిగారు.

స్వామి: అయితే నువ్వు యాజ్ఞవల్క మహర్షిలా అత్మానుభవం కలవాడివా?
శ్రీకంఠయ్యకు ఏమి చెప్పాలో తెలియక తలదించుకున్నాడు.

స్వామి: నీ సమాధానం జ్ఞానికి మాత్రమే వర్తిస్తుంది. ఆ స్థితి వచ్చేంతవరకు మానవుడు సాధన చేస్తూనే ఉండాలి. ఆ స్థితికి సోపానాలే సంధ్యవందనము మరియు జపము. వీటి విస్మరణ పాపము. సంధ్యావందనము మరియు జపము విడువకుండా చెయ్యి.

శ్రీకంఠయ్య స్వామి వారి ఆదేశం పాటిస్తున్నారు. స్వామి వారి దర్శనం కూడా తరచు చేసుకుంటున్నారు. అనంతమైన జ్ఞానం అనే సముద్రంలో తనకు తెలిసింది చాలా చాలా తక్కువ అని తెలుసుకున్నారు. మహాస్వామి వారి చర్యలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయసాగారు. ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండే మహాస్వామి మనస్సులో ప్రవేశించాలనుకున్నారు.

ఒకనాడు నిద్రపోతూ ఉండగా, కలలో, తను సూక్ష్మ శరీరం ధరించి మహాస్వామి వారిలో ప్రవేశించారు. అతనికి అక్కడ నిర్మలమైన, అనంతమైన తెల్లని ఆకాశం కనిపించింది. లేచేసరికి తెల్లవారింది. సంధ్యావందం చేసుకుని స్వామి వారి దర్శనానికి వెళ్ళారు శ్రీకంఠయ్య. తీర్థ ప్రసదాలు ఇస్తూ చిరునవ్వుతో స్వామి వారు, "ఎప్పట్నుండి పరకాయ ప్రవేశం చేస్తున్నావు?" అని అడిగారు. ఆశ్చర్యచకితుడైన శ్రీకంఠయ్య పరమాత్మతో తాదాత్మ్యం చెందిన మహనీయులకు తెలియనది ఏదీ ఉండదని వారు సర్వ వ్యాపకులని తెలుసుకున్నారు.

సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాఙ్‍ముఖమ్
నౌమి శాస్త్రేషు నిష్ణాతం చన్ద్రశేఖరభారతీమ్.

                                                                                                                   -  చామిరాజు. శేషు బాబు 

Related Posts