YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

కుప్పలు కుప్పలుగా దొరుకుతున్న నోట్ల కట్టలు

కుప్పలు కుప్పలుగా దొరుకుతున్న నోట్ల కట్టలు

రాష్ట్ర రాజధాని మొదలుకుని ఇతర పోలీసు కమిషనరేట్‌లు, అన్ని జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లలో ఆకస్మిక తనిఖీలను విరివిగా నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. తద్వారా డబ్బుల అక్రమ రవాణాను అడ్డుకోవడమే గాక అసాంఘిక శక్తుల కదలికలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.సరిహద్దుల్లో ఒక పక్క మావోయిస్టుల కదలికలపై కన్నేసి ఉంచుతూనే మరోపక్క కోట్లలో వచ్చి పడుతున్న డబ్బు సంచులపైనా పోలీసులు నిఘా పెంచారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రతోపాటు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులలో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున రాష్ట్రంలోకి డబ్బులు అక్రమంగా చేరుతున్నాయి. గత పదిహేను రోజులలోనే మొత్తం రూ. 31 కోట్లకు పైగా డబ్బులను హైదరాబాద్‌ నగరంతోపాటు వివిధ జిల్లాల్లో పోలీసులు పట్టుకున్నారు. సమాచారం, సోదాల ద్వారా చిక్కింది ఇది మాత్రమేనని, నిజానికి దీనికి పదింతల డబ్బులు రాష్ట్రంలోకి చేరి ఉంటాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఎన్నికల ప్రక్రియకు ఆటంకం సృష్టించేందుకు మావోయిస్టులు కాచుకుని ఉన్నారన్న సమాచారంతో వారిని కట్టడి చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. ఈవిషయంలో రాష్ట్ర ఎస్‌ఐబీ విభాగం గ్రేహౌండ్స్‌తో సమన్వయమవుతూ చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో గాలింపు చర్యలను విస్తృతం చేసింది. ముఖ్యంగా ఇటు ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడమేగాక తాజాగా సరిహద్దుల్లోని బీజాపూర్‌లో కేంద్ర పారామిలటరీ బలగాలకు చెందిన నలుగురు జవాన్లను మావోయిస్టులు హతమార్చడంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమ య్యారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొంత ఉపందుకున్నాయన్న సమాచారం సైతం ఉన్నతాధికారులను కలవరపెడుతున్నది.

ఒకపక్క ఈ పరిస్థితి కొనసాగుతుండగా మరోపక్క సరిహద్దు రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దొంగచాటుగా రాష్ట్రంలోకి చేరుతున్నాయనే సమాచారం కూడా అధికారులను మరింత అలర్ట్‌ చేసింది. ఇంకా ఎన్నికలు జరగడానికి నలభై రోజులుండటం, మరోవైపు ఓటర్లను మభ్య పెట్టడానికి డబ్బులతో పాటు పలు వస్తువుల రూపంలో నజరానాలు కూడా వస్తున్నాయనే సమాచారంపై కూడా అధికారులు దృష్టి సారించారు.

దీంతో రాష్ట్రానికి ఉన్న నాలుగు రాష్ట్రాల సరిద్దుల్లో సాయుధ చెక్‌ పోస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాకే వదలాలని కూడా అధికారులు, చెక్‌ పోస్టుల సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. అదే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే మార్గంలో ఉన్న ప్రతి పోలీసు స్టేషన్‌ అధికారులు, సిబ్బంది సైతం తమ పరిధిలో సోదాలను విస్తృతం చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా ఈ డబ్బులు ఎవరికి ఎలా చేరుతున్నాయనే కోణంలోనూ స్పెషల్‌ ఆపరే షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి రంగంలోకి దింపుతున్నారు. హైదరాబాద్‌లో జయేశ్‌ పటేల్‌ అనే వజ్రాల వ్యాపారి నుంచి ఇటీవల రూ.2.54 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ డబ్బులను ఇక్కడ ఎన్నికల ఖర్చుల కోసం ఆరు శాతం వడ్డీకి ఇస్తున్నట్టు బయటపడటంతో అధికారులు ఖంగుతిన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ సరిహద్దులలో చెక్‌పోస్టులు చురుకుగా పనిచేసేలా చేయడంతోపాటు మావోయిస్టుల కదలికలపై కన్నేసి ఉంచేలా నిఘా వ్యవస్థను డీజీపీ అప్రమత్తం చేశారు.

Related Posts