YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

పోత్తుతో కత్తులేనంటున్న లేడి అమితాబ్

పోత్తుతో కత్తులేనంటున్న లేడి అమితాబ్

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, ఫైర్ బ్రాండ్, లేడీ అమితాబ్ విజయశాంతికి టీడీపీతో పొత్తు ఇష్టం లేదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్దిరోజులుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలే దీనికి ఉదహరణగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి.. మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాక సైలంట్ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏమైందోకానీ రాములమ్మ మాత్రం పొలిటికల్ స్క్రీన్‌పై కనుమరుగయ్యారు. చాలా రోజుల తర్వాత బోనాల పండుగ సమయంలో తిరిగి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ లేడీ అమితాబ్ మళ్లీ కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆమె మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తెలంగాణ ఇచ్చి కూడా అధికారంలోకి రాని పార్టీ.. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలను రూపొందించుకుంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ పార్టీకి సీనియర్ నేతల అవసరం చాలా ఉంది. అందుకే రాములమ్మను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు సంప్రదించింది. అందుకోసం ఆమెకు కీలక పదవిని కూడా కట్టబెట్టింది. అప్పటి నుంచి ఆమె యాక్టివ్ అయ్యారు.ప్రస్తుత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొద్దిరోజుల కిందట టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని, ఈ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్‌కి లేఖ రాసే యోచనలో విజయశాంతి ఉన్నారని ప్రచారం జరిగింది. అలాగే రాష్ట్ర విభజన అనంతరం చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ఆమె ఆరోపిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని విజయశాంతి కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆమె మాటను ఖాతరు చేయని అధిష్ఠానం పొత్తుకే మొగ్గు చూపింది. రేపో మాపో సీట్ల సర్ధుబాటుపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆమె మరోసారి టీడీపీతో పొత్తుపై మాట్లాడారు. ఎన్నికల కోసమే తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని, అయితే… పరిమితులను నిర్దేశించుకుని టీడీపీతో వ్యవహరించాలని ఆమె టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. దీని బట్టి ఆమెకు పొత్తు ఇష్టం లేదా..? లేక టీడీపీ అంటేనే ఇష్టం లేదా..? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి.

Related Posts