YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

తెలంగాణ సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు ఆమోద ముద్ర

తెలంగాణ సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు ఆమోద ముద్ర

- వచ్చే  విద్యా సంవత్సరంలోనే ప్రారంభం

- కేంద్రంతో సంబంధం లేకుండా నిర్వహణ

- ఎస్సీ విద్యార్థులకు 75 శాతం సీట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ సైనిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ అధ్యయనం చేసింది. ఆ తరహా వసతులతో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 2018-19 విద్యా సంవత్సరంలో కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌ బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్యాంప్‌సలోనే సైనిక్‌ స్కూల్‌ ప్రారంభించేందుకు సొసైటీ చర్యలు చేపట్టింది. రుక్మాపూర్‌ గురుకులం పరిధిలో 20 ఎకరాల స్థలం, మౌలిక వసతులు ఉన్నాయి. సైనిక్‌ స్కూల్‌ ఎందుకంటే... తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) నిర్వహించే పరీక్షల్లో లెవల్‌ వన్‌ దాటడం లేదు. అంటే సైన్యం, నావికా దళం, వైమానిక దళంలో ఆఫీసర్‌ కేడర్‌ పోస్టులకు ఎంపిక కాలేకపోతున్నారు. దీనికి కారణం మానసిక, శారీరక సామర్థ్యాలకు పదునె పెట్టే సరైన శిక్షణ సంస్థలు లేకపోవడం! దీనిని గమనించిన సొసైటీ కార్యదర్శి ఆర్‌.ప్రవీణ్‌ కుమార్‌ ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

ప్రవేశాలు ఇలా...

సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశానికి ప్రతి ఏటా గురుకులాల సొసైటీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేకంగా మరో పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారిని ఎన్‌డీఏ కోర్సుకు ఎంపిక చేస్తారు. 5వ తరగతిలో 80 మందికి, ఇంటర్‌ ఫస్టియర్‌లో 80 మందికి అవకాశం కల్పిస్తారు. ఎస్సీ విద్యార్థులకు 75 శాతం, ఇతరులకు 25 శాతం సీట్లు కేటాయించనున్నారు. సాధారణ విద్యతో పాటు ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షకు అవసరమైన శిక్షణ ఇస్తారు. రిటైర్డ్‌ సైనికాధికారులు, జిల్లా సైనిక సంక్షేమ అధికారులను కన్సల్టెంట్లుగా తీసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, బ్యాండ్‌ ఫ్యాకల్టీ, ఫిజికల్‌ ఇన్‌స్ట్రక్టర్లు, ఎన్‌సీసీ, అఽథ్లెటిక్‌ కోచ్‌లు ఉంటారు. వీరితో పాటు టీజీటీలు (10 మంది), పీజీటీలు (5), జేఎల్‌ (7), స్పెషల్‌ టీచర్స్‌ (5), నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ (6), ఆఫీసర్‌ సబార్డినేట్‌ (4)లను నియమిస్తారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల వస్తువులను ఉచితంగా అందజేస్తారు.

 

Related Posts