YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

ప్రభుత్వంపై అప్రకటిత యుద్ధం

Highlights

  • ప్రభుత్వ, మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు
  • సత్తా చాటాలని యోచిస్తోన్న ప్రభుత్వం  
ప్రభుత్వంపై అప్రకటిత యుద్ధం

కేజీ టూ పీజీ విద్యాసంస్థల జేఏసీకి ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. పరీక్షల బహిష్కరణతో  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ చూస్తుంటే... అనుకున్న సమయానికే... యధావిధిగా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వంపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రకటిత యుద్ధం
ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంపై అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించాయి... కాగా ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టేందుకు తనదైన శైలిలో సన్నద్ధమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి తమ డిమాండ్లు సాధించుకోవాలని చూస్తున్న కేజీ టూ పీజీ విద్యాసంస్థల జేఏసీకి  ప్రభుత్వం రివర్స్‌లో షాకిచ్చేలా నిర్ణయం తీసుకుంది. 
పరీక్షలన్నీ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే 
జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఫీజు రియంబర్స్ మెంట్ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే ఇవ్వకపోతే పరీక్షలను బహిష్కరిస్తామని కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ  ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది... ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరీక్షల  నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షలన్నీ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నిర్వహించేందుకు  ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ విద్యా సంస్థలనే పరీక్షా కేంద్రాలు, పేపర్లు దిద్దే కేంద్రాలుగా  ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇన్విజిలేటర్లతోపాటు.. పేపర్లు దిద్దేందుకు కూడా  ప్రభుత్వ ఉపాధ్యాయులనే  వినియోగించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా పరీక్షల నిర్వహణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీటికి సంబంధించి సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించాలన్నారు.
ప్రభుత్వ, మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు
ఈనెల 28 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో డిగ్రీ వార్షిక పరీక్షలు.. 15నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఐతే ప్రభుత్వ  హైస్కూళ్లు, జిల్లా పరిషత్ స్కూళ్లు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రస్తుతం ఫర్నిచర్ బాగుందని, వీలైనంత వరకూ పరీక్షల కేంద్రాలను అక్కడే ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
సత్తా చాటాలని యోచిస్తోన్న ప్రభుత్వం  
ప్రైవేటు విద్యాసంస్థలు తమ డిమాండ్ల సాధనకోసం పరీక్షలను అస్ర్తంగా వాడుకోవాలని చూస్తుంటే...పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నిర్వహించి సత్తా చాటాలని ప్రభుత్వం యోచిస్తోంది.. కాగా... విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా... సమస్య తీవ్రతరం కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts