YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

 వేదవ్యాస జననం

Highlights

అపోహలు--నిజాలు

 వేదవ్యాస జననం

 మనం ప్రస్తుతం ఉన్న వైవస్వత మన్వంతరంలో 28 వ మహాయుగంలో మనకొరకు వేదవిభాగం చేసిన వేదవ్యాసుడు పరాశర మహర్షి కుమారుడు అయిన కృష్ణ ద్వైపాయనుడు (ఈ వైవస్వత మన్వంతరం లో వచ్చిన 28వ వ్యాసుడు). వ్యాసుడు నారాయణ స్వరూపంగా చెప్పబడతాడు. అతని జననం దాగి ఉన్న రహస్యములతో కూడినది. దానిని గురించి ఇక్కడ మనం చెప్పుకుందాం.

 సంభవం:  మస్త్యగంధి దాశరాజుకుమార్తెగా పెరుగుతూ ఉంది. ఆమెనే సత్యవతి అని కూడ అంటారు. ఆమె యుక్త వయస్సు కు వచ్చాక తన తండ్రికి సాయంగా తాను ఆ యమునా నది మీద పడవ నడుపుతూ ఉంది. ఒక రోజు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్ధయాత్రల నిమిత్తమై యమునను దాటవలసి వచ్చింది. అప్పుడు అతనికి ఈ మస్త్యగంధి పడవ కనిపించగా దానిలో ఎక్కాడు. పడవ నదిలో కొంత దూరం వెళ్ళాక పరాశర మహర్షి కి మస్త్యగంధి పై కామవాంఛ  కలిగింది. అది ఆమెతో ప్రస్తావించగా దానికి ఆమె ఇందరి మహానుభావుల మద్య ఇంత జ్ఞానులయిన మీరు ఇలా ఎలా ప్రవర్తించగలరు? అని అడిగింది. దానికి సమాధానం గా పరాశర మహర్షి ఒక మాయాతిమిరాన్ని(దట్టమైన మంచు పొరను) తాము ఉన్న పడవ చుట్టూ సృష్టించాడు.
పరాశర మహర్షితో సంగమిస్తే తన కన్యత్వం భంగం అవుతుంది, తిరిగి తన తండ్రివద్దకు ఎలా వెళ్ళాలి? అని అడిగింది
తనతో సంగమించిన తరువాత కూడా ఆమె కన్యత్వం చెడదు అని చెప్పి ఏమైనా మరోవరం కోరుకో మని చెప్పాడు.
ఆమె తన శరీరం నుండి వస్తున్న ఈ మస్త్యగంధం తనకు నచ్చలేదు కనుక దానిని దూరం చేయమని కోరింది.
దానికి పరాశర మహర్షి ఈ చేపల వాసన పోవటమే కాదు ఇక మీద ఆమె శరీరం నుండి గంధపు వాసన ఒక యోజనం దూరం వరకు వ్యాపిస్తుంది, దాని వల్లనే ఆమెను ఇక మీద అందరూ యోజన గంధి అని పిలుస్తారు అని వరం ఇచ్చాడు.
అప్పుడు వారి కలయిక లో సద్యోగర్భం లో అప్పటికి అప్పుడే వ్యాసుడు జన్మించాడు. వ్యాసుడు సూర్యసమాన తేజస్సు కలిగి, సర్వ వేద జ్ఞానo తో పుట్టాడు. పుట్టిన వ్యాసుడు తన తల్లితో తానూ తపస్సుకు వెళ్తున్నాను అని, తన తల్లి ఎప్పుడు తనను పిలిస్తే అప్పుడు తాను తప్పక వస్తాను అని మాట ఇచ్చి తన తల్లి అనుమతి తో తపస్సు కు వెళ్ళాడు.
వ్యాసుడు చిన్నప్పుడే ఆ యమునా నది ద్వీపం లో వదిలి వేయబడుటవల్ల అతనిని ద్వైపాయనుడు అని, శరీరం నల్లగా ఉండుటవల్ల కృష్ణద్వైపాయనుడు అని అన్నారు.

ఈ ఘట్టాన్ని చదువుతున్న మనకు ఇక్కడ  కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి.

1. పరాశర మహర్షి కి ఒక చేపల వాసన కల స్త్రీ మీద కామవాంఛ ఎందుకు కలిగింది?
2. తన ఇంద్రియాలను నిగ్రహించుకో లేని పరాశరుడు ఋషి అని ఎలా చెప్పారు?
3. ఆమె అడిగిన అన్ని వరాలు ఇచ్చి మరీ ఆమెతో ఎందుకు సంభోగించాడు? 

 సామాజిక వివరణ:  ఈనాటి మన శాస్త్రముల ప్రకారం కుడా తల్లి తండ్రుల జన్యువులు, సంగమ సమయం లో వారి మనసులలో కలిగిన భావాలు పుట్టబోయే పిల్లల ప్రవర్తనకు సోపానాలు వేస్తాయి. (అందుకే ఎప్పటికి గర్భవతి కావాలనుకున్న, ఐన స్త్రీని మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశాలను, బొమ్మలను చుస్తూ ఉండమని చెప్తాం)

కాబట్టి వ్యాసుడు వంటి ఒక గొప్ప ఆద్యాత్మిక వేత్త జన్మించాలి అంటే అంతే తేజస్సు కలిగిన ఒక మహర్షియొక్క సంగమం ఒక అద్వితీయమైన స్త్రీ తో సహజం గా మనస్సు చలించి జరగాలి. అప్పుడే ఆ తల్లి తండ్రులలోని మంచి గుణములు, జ్ఞానము ఆ పుట్టబోయే బిడ్డకు కలుగుతుంది.
పరాశర మహర్షి మహాజ్ఞాని, మహా తపస్సంపన్నుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించి తెలిసిన వాడు. కాబట్టి పరాశర మహర్షి సత్యవతిని ని చూసినప్పుడు, వారికి ఒక లోకోత్తరమైన సంతానం కలుగ వలసిన సమయం ఇదే అని తెలిసి ఉండాలి.
మస్త్యగంధి,  ఉపరిచర వసువు తన భార్య ఐన గిరిక (ఒక నది, పర్వతముల కుమార్తె) ను తలుచుకొనుట వల్ల స్కలనం అయిన వీర్యం తో శాపగ్రస్తమైన అప్సరస ఐన అద్రిక కు జన్మించింది. వీరిద్దరూ వ్యాస జననానికి కలిసి తీరాలి. కాబట్టి మస్త్యగంధి ని చుసిన పరాశరునికి కామవాంఛ కలిగింది.

తనకు పేరు తీసుకు వచ్చే పుత్రుడిని ఇచ్చే స్త్రీ కి ఆ పురుషుడు సంతోషం గా ఏమి అడిగినా ఇస్తాడు. కాబట్టి సత్యవతి అడిగిన అన్ని కోరికలు పరాశర మహర్షి తీర్చాడు. పైగా ముందు ముందు ఆమె కురు వంశానికి చేరవలసినది, శంతనుడిని వివాహం చెసుకో వలసినది కనుక ఆమె మస్త్యగంధిగా ఉండకూడదు. కాబట్టి ఆమెను యోజనగంధి ని చేసాడు.

ఆద్యాత్మిక వివరణ: సత్యవతి: సత్యస్వరూపుడైన భగవంతుని గురించి తెలుసుకో తలచిన సాధకురాలు/ సాధకుడు  

దాశరాజు:ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు కలిపి పది. సంస్కృతం లో దశ, వాటి అధిపతి రాజు కలిపి దాశరాజు 

పరాశరుడు: పరమాత్మ చే విడువబడిన శరం, సద్గురువు. 

యమునా నది పై పడవ: యమునా నది నీరు తమో గుణానికి, పడవ  దాన్ని దాటాలి అనే ఆలోచనకి గుర్తు. 

పరాశరునికి సత్యవతి పై సంగమ వాంఛ : ఒక సద్గురువు, ఒక సాధకుడిని అనుగ్రహించి జ్ఞాన భోద  చేయాలి అనుకోవటం. 

సత్యవతి చుట్టూ అందరూ  ఉన్నారు అని చెప్పటం: గురువు గారు భోధనలు విని ఈ లోకం లో ఉన్నఆకర్షణలు ఉండగా మీ జ్ఞానోపదేశం ఎలా నిలబడుతుంది అని అడుగుట. 

మాయా తిమిరం: ఈ లోకం లోని ఆకర్షణలు సాధకునికి అడ్డు రాకుండా గురువు చేసే జ్ఞానబోధ 

కన్యత్వం పోతే తండ్రి వద్దకు ఎలా వెళ్ళను:  గురువు గారు , తమరు వైరాగ్యబోధ చేస్తారు. మరి నేను నా గృహ సంబంధం ఐన దశ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అన్ని భాద్యతలు వదిలి వేయాలా?

కన్యత్వం పోకుండా బిడ్డను కనుట: విషయ సాంగత్యం చెడకుండానే గురువు సాధకునకు జ్ఞానోపదేశం చేయగలరు, సాధకుడు పొందగలడు. 

మస్త్యగంధం పోయి సుగంధం:  సాధకుడి గతజన్మ దుర్వాసనలు నశింపచేసి కొత్త సుగుణాలని ఆవిష్కరింప చేయుట 

సధ్యగర్భం:  గురువు చేస్తున్న భోదల వాల్ల అప్పటికి అప్పుడే జ్ఞానం పొందుట 

వ్యాసుడు తల్లి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అనుట: గురు బోధ తో వచ్చిన జ్ఞానం సాధకునకు మనసులో నిలిచి పోవాలంటే ఆ విషయాన్ని మననం చెస్తూనే ఉండాలి. మననం చేసినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది.

 జై శ్రీమన్నారాయణ

Related Posts