YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాయపాటి ఫ్యామిలీలో లుకలుకలు

రాయపాటి ఫ్యామిలీలో లుకలుకలు

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి బ్రదర్స్. రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాసరావులు అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే. అన్న సాంబశివరావు ఏ పార్టీకి జై కొడితే.. తమ్ముడు శ్రీనివాస్ కూడా అదే పార్టీలో తిరిగేవారు. నాలుగు ద‌శాబ్దాలుగా చిన్నా చిత‌కా స‌మ‌స్యలు ఉన్నా వీరు ఎక్కువుగా కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అయ్యారు. ఇక, రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్న రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌కు వీడి టీడీపీలోకి చేరడంతో తమ్ముడు శ్రీనివాసరావు కూడా సైకిల్ ఎక్కేశారు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణుల మాదిరిగా ఒకే పార్టీ ఒకే అజెండాతో ముందుకు సాగారు.కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అన్న ఎంపీగా చక్రం తిప్పితే.. తమ్ముడు శ్రీనివాస్ కుమారుడు మోహ‌న‌సాయి కృష్ణ గుంటూరు కార్పొరేషన్ మేయర్‌గా రాజకీయాలు చక్కగాబెట్టారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి వ‌చ్చాక రాయపాటి సాంబశివరావు న‌ర‌సారావుపేట ఎంపీ అయ్యారు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ సీటు ఇస్తామ‌న్నారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యే సీటు అయినా వ‌స్తుంద‌ని వాళ్లు ఆశ‌లు పెట్టుకున్నా చంద్రబాబు ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు ఈ కుటుంబంలో రాజకీయ విభేదాలు చోటుచేసుకున్నాయని సమాచారం.ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టిడిపికి రాం రాం చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. సమయం వచ్చినప్పుడు ప్రజలు నిర్దేశించినప్పుడు మార్పు తప్పద‌ని చెప్పుకొచ్చారు. ఇక, తమ్ముడు కూడా ఇదే బాట పడతారని అందరూ అనుకున్నారు. అయితే దీనికి విరుద్ధంగా రాయపాటి శ్రీనివాసరావు కుటుంబం రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆయన కుమారుడు రాయపాటి మోహన్ సాయి కృష్ణ.. సీఎం జగన్‌కు తాజాగా రాసిన లేఖ సంచలనంగా మారింది. జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. ఆయన రెండు నెలల పాలన‌ను కూడా మెచ్చుకుంటూ.. లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. “మీరు(జగన్) సీఎంగా ప్రమాణం చేయగానే రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై సమరశంఖం మోగిస్తాన‌ని చెప్పడం హర్షణీయం. దీనికి సంబంధించి మేము కూడా కొన్ని సూచనలు చేస్తాం“ అంటూ మొదలు పెట్టిన సాయికృష్ణ ఎనిమిది విషయంలో కొన్ని సూచనలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ సుదీర్ఘ లేఖ సోషల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది.పనిగట్టుకుని సీఎం జగన్‌కు రాయపాటి సాంబశివరావుసోదరుడి కుమారుడు లేఖ రాయడం వెనుక ఖ‌చ్చితంగా త్వరలోనే ఈ కుటుంబం వైసిపి తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతోంద‌న్న వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఎన్నిక‌ల‌కు ముందు కూడా రాయ‌పాటి శ్రీనివాస్ వైసీపీ అధినేత‌ను మెచ్చుకుంటూ ఓ ప్రక‌ట‌న రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు మూడు మాసాల్లో రాయపాటి కుటుంబంలో రాజకీయ చీలిక వచ్చే అవకాశం కనిపిస్తోంద‌ని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండర‌నడానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది.

Related Posts