
ఫ్లైఓవర్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా
- మేయర్ రామ్మోహన్
ఫ్లైఓవర్ పై వేగ నియంత్రణ ఏర్పాట్లకు మూడు రోజులపాటు రాకపోకలు బంద్
సంఘటన స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటి మేయర్
హైదరాబాద్
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుండి ప్రమాదవశాత్తు కారు పడ్డ సంఘటనలో మృతిచెందిన మహిళ కుటుంబానికి రూ. 5లక్షలు ఎక్స్గ్రేషియాను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ద్రిగ్బాంతిని వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్గ్రేసియాను ప్రకటించారు. ఈ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై వేగాన్ని నియంత్రించేందుకు తగు ఏర్పాట్లు చేసేందుకుగాను మూడు రోజుల పాటు ఈ వంతెనపై రాకపోకలను నిషేదిస్తున్నట్టు మేయర్ స్పష్టం చేశారు. కాగా ఈ సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ పరామర్శించారు. సంఘటన జరిగిన అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే డిజాస్టర్ రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను చేపట్టాయి. ఇదిలా ఉండగా, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ను ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నియమ నిబంధనల ప్రకారమే నిర్మించారు. అయినప్పటికీ ఈ వంతెనపై 40 కిలోమీటర్ల వేగం మాత్రమే ఉండాలని సైనేజి ఏర్పాటు చేసినప్పటికీ వాహనదారులు 90 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్నారు. నేడు జరిగిన ప్రమాద సంఘటన కూడా 90కిలోమీటర్లకు పైగావేగంతో ప్రయాణించడమే కారణంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ ఫ్లైఓవర్ను ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నియమనిబంధనల ప్రకారంగానే నిర్మించినప్పటికీ ఈ వంతెనపై వేగాన్ని మరింత నియంత్రించేందుకుగాను తగు చర్యలను చేపట్టేందుకు కనీసం మూడు రోజులపాటు ఈ వంతెనను మూసివేయాలని నిర్ణయించారు. ఇటీవలే ఈ వంతెన దగ్గర సెల్ఫీ తీసుకుంటూ జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో సెల్ఫీల నిషేదంతో పాటు 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని కోరుతూ ఫ్లైఓవర్ పై సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిబంధనలను కాతరు చేయకుండా అతివేగంతో ప్రయాణిస్తుండడంతో నేటి ప్రమాదం జరిగింది.