YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

సరస్వతీదేవి జన్మదినోత్సవమ సందర్బంగా ధ్యాన శ్లోకము

సరస్వతీదేవి జన్మదినోత్సవమ సందర్బంగా ధ్యాన శ్లోకము

నిత్యానందే నిరాధారే నిష్కళాయే నమోన్నమః
విద్యాధరే విశాలాక్షీ శుద్ధజ్ఞానే నమోన్నమః !!
భావం
శాశ్వత ఆనందదాయనివి, ఏ ఆధారమూ అవసరం లేనిదానవు, పరిపుర్ణురాలావు అయిన ఓ సరస్వతీ, విశాలమైన కన్నులు కలిగి, అన్ని విద్యలకు ఆధారమైనదానవు అయిన నీకు అనేక నమస్కారములు తెలుపుతున్నాను.
నేడువసంత పంచమి ,సరస్వతీదేవి జన్మదినోత్సవమే శ్రీ పంచమి.
అక్షరాలకు అధిదేవత, సకల విద్యల రాణి, జ్ఞాన ప్రదాయిని- సరస్వతీదేవి. ఆ వాగ్బుద్ధి వికాస స్వరూపిణి జన్మదినోత్సవమే శ్రీ పంచమి. ఈ వసంత పంచమి రోజున అందరూ ఆతల్లిని తప్పక ఆరాధించాలి. పుస్తకాలను గ్రంధాలను, కలాన్ని అమ్మవారి వద్ద పెట్టి పూజించాలి. బ్రహ్మాది  దేవతలు కూడా ఆ శారదాంబను ఈరోజున పూజిస్తారట.
ఈరోజున అమ్మవారిని ఆరాధించడం వలన విద్యాబుద్దులే కాదు మేధా శక్తి వృద్ది చెందుతుంది.  ఆ  తల్లి కృపవల్లనే జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి, లౌకికమైన చదువులు, పరమమైన బ్రహ్మవిద్య రెండు లభిస్తాయి .

 

వసంతపంచమి_శుభాకాంక్షలు.


అక్షరాలకు అధిదేవత, సకల విద్యల రాణి, జ్ఞాన ప్రదాయిని- సరస్వతీదేవి. ఆ వాగ్బుద్ధి వికాస స్వరూపిణి జన్మదినోత్సవమే శ్రీ పంచమి. నేటి మాఘ శుద్ధ పంచమి పర్వదినాన్ని ‘వసంత పంచమి’ అని పిలుస్తారు. మానవజాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణి సరస్వతి. ఆమె జ్ఞానానంద శక్తిగా, వేదజ్ఞాన మాతృకగా వెలుగొందుతోంది. గాయత్రిగా, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాతగా భాసిస్తోంది. పరిపూర్ణ అనుగ్రహంతో స్వరాన్ని, వరాన్ని ఆ దేవి ప్రసాదిస్తోంది.

విజ్ఞాన నిధులు అనేకం. వాటిలో ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ ఉంటాయి. చైతన్యం, కళా నైపుణ్యం, జ్ఞాన రహస్యం, సంస్కారం సైతం నెలకొంటాయి. వాటితో పాటు సత్కీర్తి, తర్కం, వ్యాకరణం, మీమాంస, వ్యాఖ్యానం, భాష్యం... ఇలా విభిన్న రీతుల్లో సాగిపోతుంటాయి. అన్ని విజ్ఞాన నిధులూ ఆ చల్లని తల్లి కటాక్ష వీక్షణ ఫలితాలే!

శుంభ, నిశుంభులను సంహరించిన వీర నారి ఆమె. మహా సరస్వతిగానే కాదు- సిద్ధ, నీల, ధారణ, అంతరిక్ష సరస్వతిగా ఆ దేవికి అనేక రూపాలున్నాయని ‘మంత్ర శాస్త్రం’ చెబుతోంది.

???? పరాశక్తిని శారద రూపంలో దర్శించాడు బ్రహ్మ. ఆమెనే ఆరాధించి, కృప పొంది, సృష్టి చేసే శక్తిని సాధించగలిగాడు. వాగ్దేవి ఉపాసన వల్లనే వాల్మీకి- రామాయణ రచన చేశాడన్నది పురాణ గాథ. ఆయన నుంచి శారదా దీక్షను స్వీకరించడం వల్లనే, వ్యాస మహర్షి వేద విభజన చేయగలిగాడంటారు. వేదాల్లో దేవీ సూక్తాలున్నాయి. ఆ శ్రీవాణిని శ్రుతులు కీర్తించాయి. సరస్వతి దయ వల్లనే ఆదిశంకరులు అపారమైన తత్వజ్ఞానాన్ని సముపార్జించారు. బృహస్పతి విద్యాసిద్ధి కోసం గీర్వాణిని ప్రార్థించాడని చెబుతారు.

ఆదిశేషుడికి మహా పండితుడిగా పేరుంది. అందుకే భూదేవి అతణ్ని జ్ఞాన రహస్యాలు బోధించాలని కోరింది. అతడు శారదను ఆరాధించి, శాస్త్రజ్ఞాన రహస్యాలు గ్రహించి, భూమాతకు ప్రబోధించాడంటాయి గ్రంథాలు.

శారదాంబను ప్రసన్నం చేసుకున్న వ్యాస భగవానుడు, గోదావరీ తీరాన సైకత మూర్తిగా ఆ దేవి విగ్రహాన్ని రూపొందిస్తాడు. ఆ మహాశక్తి అందులో సుప్రతిష్ఠితురాలై భక్తుల్ని అనుగ్రహించిందని, ఆ క్షేత్రమే వ్యాసపురి (బాసర)గా భాసిల్లుతోందని పెద్దలంటారు.

సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థముంది. ప్రవాహం చైతన్యానికి సంకేతం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వ గుణ శోభిత సరస్వతి- శ్వేత వస్త్రాలతో అలంకృతయై, హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి ఉంటుంది. ఆమె అక్షరమాల, గ్రంథం ధరించడంతో పాటు వీణావాదనం చేస్తుంటుంది. వేదాలు సరస్వతి నుంచే ఆవిర్భవించాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం పేర్కొంది. శ్రీ పంచమి పర్వదినాన వాణిని పలు రకాలుగా ఆరాధిస్తారు. బ్రాహ్మణి సన్నిధిలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేస్తారు.

‘సరః’ అంటే, కాంతి. జనజీవితాల్ని జ్ఞాన కాంతిమంతం చేసే మాతృశక్తి ఆమె. శరన్నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు అందుకుంటుంది. చండీ సప్తశతి, బ్రహ్మపురాణం, సరస్వతీ రహస్యోపనిషత్తు, శారదా తిలకం గ్రంథాలు పలుకుల తల్లి వ్రత-ఉద్యాపన విధానాల్ని వివరించాయి. గంగ, యమునలతో సరస్వతి కలిసి త్రివేణీ సంగమమైంది.

సాహిత్య, సంగీతాలనే అమృత కలశాల్ని మానవాళికి ప్రసాదిస్తున్న జగన్మాత ఆమె. సకల కళారూపిణి. అక్షర సంపద అంతటినీ లోక కల్యాణానికి వినియోగించడమే సరస్వతీ దేవికి అసలైన సమర్చన !

 ఈ వసంత పంచమి రోజున అందరూ ఆతల్లిని తప్పక ఆరాధించాలి. పుస్తకాలను గ్రంధాలను , కలాన్ని అమ్మవారి వద్ద పెట్టి పూజించాలి. బ్రహ్మాది  దేవతలు కూడా ఆ శారదాంబను ఈరోజున పూజిస్తారట.
ఈరోజున అమ్మవారిని ఆరాధించడం వలన విద్యాబుద్దులే కాదు మేధా శక్తి వృద్ది చెందుతుంది.  ఆ  తల్లి కృపవల్లనే జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి, లౌకికమైన చదువులు, పరమమైన బ్రహ్మవిద్య రెండు లభిస్తాయి .

Related Posts