YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఆరు రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్

ఆరు రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్

న్యూఢిల్లీ, జూలై 17,
కరోనా వైరస్ కట్టడిలో ఆయా రాష్ట్రాలు వరుసగా వైఫల్యం చెందుతుండటంతో మరోసారి లాక్ డౌన్‌కు కేంద్ర ప్రభుత్వం పిలుపివ్వక తప్పదనిపిస్తోంది. ఇప్పటికే బీహార్, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ, ఏపీ తదితర రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ప్రకటించేశాయి. వ్యాక్సిన్‌, ఔషధం వచ్చేదాకా.. ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. కేంద్రం ‘అన్‌లాక్‌ 2.0’ ప్రకటించినా.. లాక్‌డౌన్‌ విధింపే ఉత్తమమంటున్నాయి. గతంలో విధించిన విడతల వారీ లాక్‌డౌన్ల కారణంగా.. కరోనా వ్యాప్తిని 2 నెలల పాటు అడ్డుకోగలిగామని, ఇప్పుడూ అదే నిర్ణయం ఉత్తమమని అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు నగరాల వరకైనా లాక్‌డౌన్‌ను అమలు చేసి, వైర్‌సను కట్టడి చేయాలని నిర్ణయించాయి. రోజురోజుకూ కేసులు పెరిగిపోతూ కోవిడ్‌-19 పాజిటివ్‌ల జాబితాలో ప్రపంచంలోనే భారత్‌ మూడోస్థానంలో ఉంటూ కేసుల సంఖ్య 9 లక్షలను దాటిన నేపథ్యంలో పాక్షికంగానూ, పూర్తిగానూ మరోసారి లాక్ డౌన్ విధించక పరిస్థితి దేశవ్యాప్తంగా ఎదురవుతోంది. ఏ ఏ రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ఎలా అమలు చేస్తున్నారో చూద్దాం.
బిహార్‌లో జూలై 31 వరకు లాక్ డౌన్:
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బిహార్‌ సర్కారు కూడా లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి 31 వరకు దీన్ని అమలు చేస్తోంది ప్రధానంగా వలస కార్మికులు తిరిగి రావడంతో.. రాష్ట్రంలో కరోనా పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. కాగా.. పట్నాలోని బిహార్‌ బీజేపీ ప్రధాన కార్యాలయంలో.. 75 మంది నాయకులు, పార్టీ ఆఫీస్‌ బేరర్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.
బెంగళూరులో కఠినంగా అమలు:
కర్ణాటక సర్కారు.. బెంగళూరు నగరంలో వారంపాటు లాక్‌డౌన్‌ను విధించింది. లాక్‌డౌన్‌ అమల్లోకి రాగా.. 22వ తేదీ వరకు కొనసాగనుంది. తాజా లాక్‌డౌన్‌ ప్రకటనతో సోమవారం ఉదయం నుంచి వేల సంఖ్యలో వలస కూలీలు బెంగళూరును వీడారు. నేలమంగళ టోల్‌గేట్‌ నుంచి 25వేల మంది, ఎలకా్ట్రనిక్‌ సిటీ టోల్‌ గేట్‌ మీదుగా 8 వేల మంది వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. ధర్వాడ, దక్షిణ కర్ణాటక జిల్లాల యంత్రాంగాలు కూడా బుధవారం నుంచి 9 రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.
మహారాష్ట్ర లోని పుణె కరోనాకు హాట్ స్పాట్: మహారాష్ట్రలోని పుణె నగరం ముందు నుంచి కరోనాకు హాట్‌స్పాట్‌గా ఉంది. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌కు ముందే అక్కడ కేసులు ఉధృత రూపాన్ని చూపించాయి. ఇప్పటి వరకు 30 వేల దాకా కేసులు నమోదవ్వడంతో.. పుణె ప్రభుత్వ యంత్రాంగం సోమవారం నుంచి లాక్‌డౌన్‌, 144 సెక్షన్‌ను అమలు చేస్తోంది ఇది ఈ నెల 23 వరకు కొనసాగుతుంది.
ఉత్తరప్రదేశ్‌లో వారాంతాల్లో లాక్ డౌన్:
ఉత్తరప్రదేశ్‌లో కరోనా కట్టడికి వారాంతాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 39 వేలకు పైగా ఉంది. దీంతో.. యోగి సర్కారు వారాంతాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది.
తమిళనాడులో ఐదు జిల్లాల్లో లాక్ డౌన్:
దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర తర్వాతి స్థానాన్ని తమిళనాడు ఆక్రమించింది. ఆ రాష్ట్రంలో సుమారు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. దీంతో.. ప్రభుత్వం చెన్నై సహా ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది
కేరళలో ముందుజాగ్రత్తగా లాక్ డౌన్:
కేరళలో వైరస్‌ అదుపులోనే ఉన్నా.. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెల 6 నుంచి తిరువనంతపురంలో మూడంచెల లాక్‌డౌన్‌ అమలవుతోంది. నగరానికి ఒకే ప్రవేశం, నిష్క్రమణ ఉంటాయి. ఇది మొదటి అంచె. రెండో అంచెలో.. కట్టడి ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిరోధిస్తారు. మూడో అంచెలో.. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారి ఇళ్లలోంచి ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేస్తారు. తొలుత 7 రోజులకే లాక్‌డౌన్‌ విధించినా.. అది సోమవారంతో ముగియాల్సి ఉన్నా.. 23వ తేదీ వరకు పొడిగించారు. ఇక్కడ నమోదైన కేసుల సంఖ్య 808 మాత్రమే.              
ఏపీలో లాక్‌డౌన్‌ సడలింపు వేళలు కుదింపు:
ఏపీలో ఎక్కడా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కావడం లేదు. అయితే, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి ప్రాంతాలుసహా రద్దీ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సడలింపు వేళలను కుదించారు. నిత్యావసర, ఇతర దుకాణాల సమయాన్ని ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా తగ్గించి, జనసంచారంపై నియంత్రణ విధిస్తున్నారు. చాలా జిల్లాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకే దుకాణాలకు అనుమతినిస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వారం రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అమెరికా మళ్లీ లాక్‌డౌన్‌ బాట!
కరోనా విజృంభణతో కాలిఫోర్నియాలో బార్లు, ఇండోర్‌ డైనింగ్‌ రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, జిమ్‌లు మూతపడనున్నాయి. హెయిర్‌, నెయిల్‌ సెలూన్లపై ఆంక్షలు విధించారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 7వేల మందికిపైనే ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో సోమవారం 60వేలకుపైనే కేసులు నమోదయ్యాయి.  27రాష్ట్రాలు సడలించిన లాక్‌డౌన్‌ నిబంధనలను తిరిగి కఠినతరం చేస్తున్నాయి. ఆస్ర్టేలియాలో క్వారంటైన్‌ నిబంధనలను అతిక్రమిస్తే 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. బ్రిటన్‌లో షాపింగ్‌లో మాస్కులు ధరించకపోతే 100 పౌండ్లు జరిమానా విధిస్తున్నారు. దక్షిణాఫ్రికా 2,87,796 బాధితులతో వైరస్‌ ప్రభావిత దేశాల్లో టాప్‌-10కు చేరుకుంది. పాకిస్థాన్‌లో కేసుల సంఖ్య 2,53,604కి చేరింది. సింగపూర్‌లో 347 కేసులు బయటపడ్డాయి. బ్రెజిల్‌లో బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరువైంది. రష్యాలో కొత్తగా 6,248 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Related Posts