
కర్నూలు, జూలై 7,
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా పార్టీని 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తేవాలని భావిస్తుంటే నేతలు మాత్రం విభేదాలతో వెనక్కు లాగుతున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు గ్రూపులతో కొట్లాడుకు కుంటున్నారు. బాహాబాహీకి దిగుతున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమయితే దానిని సర్దుబాటు చేయవచ్చు. కానీ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు నాయుడు, లోకేశ్ మాటలను కూడా బేఖాతరు చేస్తూ కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కన పెడితే ఎన్నిసీట్లు వస్తాయన్నది కష్టమేనని టీడీపీ సోషల్ మీడియాలోనే కామెంట్స్ వినపడుతున్నాయి. నంద్యాల జిల్లాలో డిష్యూం.. డిష్యూం... నంద్యాల జిల్లాలో పరిస్థితి తీసుకుంటే అక్కడ పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరికి, ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సమాచారం లేకుండా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఆ నియోజకవర్గానికి రావడంతో బుడ్డా అనుచరులను ఆమెను అడ్డుకున్నారు. మరొక వైపు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై కూడా దాడికి దిగారు. తాము సమాచారం ఇచ్చినా బుడ్డా రాజశేఖర్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేదని బైరెడ్డి అనుచరులు చెబుతున్నప్పటికీ ఈ గ్యాప్ మరింత పెరిగేదిగానే ఉంది. కేవలం బుడ్డాతో మాత్రమే కాదు.. బైరెడ్డి శబరికి మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా సఖ్యత లేదని తెలుసుకున్న అధినాయకత్వం ఆమెను అమరావతికి పిలిపించింది. మహానాడును కడప జిల్లాలో పెట్టి పదికి పది పదిస్థానాలను కైవసం చేసుకోవాలని చంద్రబాబు పిలుపు నిస్తే పులివెందుల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ఇన్ ఛార్జి బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరి మధ్య అధికారులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. మరొక వైపు కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డికి, పట్టణ పార్టీ అధ్యక్షుడికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక ప్రొద్దుటూరులోనూ అంతే. కమలాపురం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇక అనంతపురం పట్టణ నియోజకవర్గంలో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతను హత్యకు ప్లాన్ ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ చేశారన్న ఆరోపణలతో కొంత పార్టీ ఇబ్బంది పడింది. ఇక కల్యాణదుర్గం నియోజకవర్గంలో స్టాంపుల కుంభకోణంలో అమిలినేని సురేంద్ర బాబుపై ఆరోపణలు రావడం వెనక టీడీపీ నేత ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు ఉన్నం మారుతి ఉన్నారన్న విషయం తేలింది. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా అనేక నియోజకవర్గాల్లో నేతలకు, ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య పొసగడం లేదు. గ్యాప్ ఎంతగా పెరిగిందంటే గత నాలుగు రోజులుగా జరుగుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో ఎవరూ పాల్గొనకపోవడం దీనికి అద్దం పడుతుందని అంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకుంటే తప్ప ఈ విభేదాలు పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు.