YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాలమూరు పోస్టుమార్టం

పాలమూరు పోస్టుమార్టం

మహబూబ్ నగర్, మార్చి 26, 
బీజేపీలో పాలమూరు పోస్టుమార్టం మొదలైందా? రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నేతలు మద్దతుగా నిలిచినా.. పాలమూరు కమలనాథులు హ్యాండిచ్చారా? ఇంతకీ కాషాయ శిబిరం ఏం తేల్చింది?ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలు కాషాయ కండువాలు కప్పుకొన్నారు. వీరి రాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరుతుందని భావించారు కమలనాథులు. కానీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పట్టభద్ర ఓటర్లు ఝలక్‌ ఇచ్చారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యి.. రామచంద్రరావు ఓటమికి దారితీసింది. దీంతో పోస్టుమార్టం చేసే పనిలో పడ్డారు బీజేపీ నేతలు.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. వీరేకాకుండా రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకులు ఇటీవల కాలంలో బీజేపీ బండి ఎక్కేశారు. ఇంతమంది ఉండటంతో పార్టీ బలంగా ఉందని, ఎన్నికల్లో ఎలాంటి ఢోకా ఉండబోదని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు నాయకులు. కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి అంచనాలు తలకిందులయ్యాయి. సిట్టింగ్‌ స్థానం కోల్పోవడానికి  పాలమూరు జిల్లా ఓట్లే దెబ్బతీశాయని అనుకుంటున్నారట. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కంటే తక్కువ ఓట్లు బీజేపీకి పాలమూరులో పడ్డాయట. ఇందుకు పెరిగిన ఓట్ల శాతాన్ని దగ్గర పట్టుకుని లెక్కలు వేసినట్టు సమాచారం. మిగతా రెండు జిల్లాలతో పోల్చుకుంటే పాలమూరులో ఈ దఫా ఎక్కువ పోలింగ్‌ నమోదైంది. 2015లో ఈ జిల్లాలో 55 పోలింగ్‌ నమోదైతే.. ఈసారి ఏకంగా 78 శాతానికి పెరిగింది. ఓటర్ల నమోదుతోపాటు ప్రతి ఓటరును పోలింగ్‌ స్టేషన్‌ వరకు రప్పించడంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పెట్టిన ఎఫర్ట్‌.. బీజేపీలో లేదట. కేవలం అర్బన్‌ ఓటింగ్‌పైనే దృష్టిపెట్టిన బీజేపీ నేతలు.. గ్రామీణ ప్రాంతాల ఓటర్లను లైట్‌ తీసుకున్నారట. దీనికితోడు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, ప్రైవేటీకరణ నిర్ణయాలు, రైతు ఉద్యమాల ప్రభావం చూపినట్టు తెలుసుకున్నారట. అలాగే 2015లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రామచంద్రరావు పాలమూరుకు ముఖం చాటేశారనే అపవాదు కొంత నష్టపరిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో బీజేపీకి సీనియర్లు ఉన్నా.. ఎన్నికల సమయంలో వారి మధ్య సమన్వయం కొరవడిందని చెబుతున్నారు. వర్గ విభేదాలు సైతం ఒక కారణంగా నిలిచాయని అనుకుంటున్నారట.  చాలా మంది సీనియర్లు, నియోజకవర్గ ఇంఛార్జులు ప్రచారంతోపాటు ఇతర విషయాల్లో అంటీముట్టనట్టు వ్యవహరించారని టాక్‌. మరి.. ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టుమార్టంలో వెలుగు చూసిన సమస్యలను అధిగమించడానికి బీజేపీ ఎలాంటి మంత్రం వేస్తుందో చూడాలి

Related Posts