YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో ఆర్మీ సాయం కోరిన ఆప్

ఢిల్లీలో ఆర్మీ సాయం కోరిన ఆప్

న్యూఢిల్లీ, మే 3, 
రాజధాని ఢిల్లీలో నెలకొన్న ఆక్సిజన్‌ సంక్షోభానికి తెరపడే సూచనలు కనిపించకపోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఆర్మీ సాయం కోరింది. ఈ విషయమైన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నగరంలో వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండటంతో ప్రత్యేక కొవిడ్‌ కేంద్రాల నిర్వహణ, ఆక్సిజన్‌ సరఫరా బాధ్యతలు ఆర్మీ చేపట్టాలని కోరుతూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రికి లేఖ రాశారు. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలయ్యింది.
ఈ వ్యాఖ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఢిల్లీ ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందన తెలియజేసి, నివేదిక అందజేయాలని కేంద్రాన్ని కోరింది. ప్రత్యేక కోవిడ్ కేంద్రాల్లో ఆక్సిజన్‌తో కూడిన 10వేల పడకలు, 1,000 ఐసీయూ బెడ్స్‌ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఢిల్లీలో కోవిడ్ విలయతాండవం కొనసాగడంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. గత రెండు, మూడు వారాలుగా ఈ సమస్య తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వ యంత్రాంగం సతమతమవుతోంది.ఆసుపత్రుల్లో నెలకొన్న ఆక్సిజన్‌ కొరతపై పలు వ్యాజ్యాలను ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ సరఫరా బాధ్యతను ఆర్మీ చేపట్టాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది రాహుల్‌ మెహ్రా హైకోర్టుకు విన్నవించారు. ఇప్పటికే ఈ విషయంపై డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా కేంద్ర రక్షణ మంత్రికి లేఖ రాశారని, కేంద్రం స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, ఏర్పాటుచేయబోయే కోవిడ్ ఆస్పత్రుల నిర్వహణను ఆరోగ్య మౌలిక సదుపాయాల యంత్రాంగం మొత్తం చూసుకుంటోంది.. రక్షణ మంత్రిత్వ శాఖ తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, అదనపు కోవిడ్ ఆరోగ్య సౌకర్యాలను నిర్వహణ బాధ్యతలను ఆర్మీ చేపడితే ఢిల్లీ ప్రజలకు ఎంతో సహాయపడుతుంది’’ అని సిసోడియా తన లేఖలో పేర్కొన్నారు.మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షకు అత్యవసర సహాయం కావాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని వనరుల వినియోగించుకుని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే దీనిపై ఆర్మీ, కేంద్రప్రభుత్వంతో పాటు ప్రైవేటు విభాగాలను విజ్ఞప్తి చేశాం.. అయినప్పటికీ ఢిల్లీలోని ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు’ అని అన్నారు.దాదాపు 40వేల మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల సేకరణ విషయంలోనూ ఆర్మీ సాయం కావాలని కోరామని, కేంద్ర రక్షణ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన తర్వాత పరస్పర సహాకారంతో కార్యాచరణ రూపొందించి పనిచేస్తామని అన్నారు.ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువ కావడంతో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ప్రస్తుతం 16,272 నాన్-ఐసీయూ ఆక్సిజన్ బెడ్స్, 4,866 ఐసీయూ బెడ్స్ ఉండగా.. అదనంగా మరో 15 వేల నాన్-ఐసీయూ ఆక్సిజన్ బెడ్స్, 1,200 ఐసీయూ పడకలను వచ్చే పది రోజుల్లో ప్రారంభించనుంది. కానీ, ఢిల్లీలో రోజుకు 25 వేలకుపైగా కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వీటిలో 10 శాతం మందికి ఆస్పత్రుల్లో చికిత్స అవసరమవుతోంది.

Related Posts