YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

మహబూబ్ నగర్ లో నకిలీ విత్తనాలు

మహబూబ్ నగర్ లో నకిలీ విత్తనాలు

మహబూబ్ నగర్, జూన్ 10, 
అదను చూసి, అధిక దిగుబడుల ఆశచూపి అక్రమార్కులు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. మంచి విత్తనం చేతికొస్తే పంట దిగుబడి పెరుగుతుందన్న ఆశ రైతును ఏటా కడగండ్ల పాలు చేస్తోంది. నకిలీ విత్తనాల బెడద రైతును కష్టాల్లోకి తోసేస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వానాకాలం పంటల సాగుకు నాసిరకం, నకిలీ విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. వర్షం కురవగానే రైతు జ్ఞాపకం చేసుకునే మొదటి విషయం విత్తనం. అయితే కొందరి మాటలు నమ్మి రైతులు నష్టపోతున్నారు. విత్తన విక్రయాల దందా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. నాణ్యత ప్రమాణాలు లేని పత్తి విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. గతేడాది నాసిరకం విత్తనాలు నాటిన గద్వాల ప్రాంత రైతన్నలు సర్వం నష్టపోవాల్సి వచ్చింది. కొంత మంది అధికారులు విత్తన మాఫియాతో కుమ్మక్కై సూత్రధారులెవరో తెలిసినా ఇతరులపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఫర్టిలైజర్‌ దుకాణాలపై దాడులు చేసిన ఇప్పటి వరకు కేవలం 37 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక 150 క్వింటాళ్లకు పైగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్టు అదికారులు సమాచారమిస్తున్నారు తప్పా అదికూడా అదికారికంగా దృవీకరించడం లేదు.  పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పీడీ చట్టం కింద కేసు కూడా నమోదు కాలేదు. విత్తనాల వ్యాపారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల్లో జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకున్న కొందరు వ్యవసాయాధికారులు ఇలాంటి వాటిపై చర్యలు కూడా చేపట్టలేక పోతున్నారన్న విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి.

Related Posts