YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రాజకీయ సంఘంలా మారిన మా

రాజకీయ సంఘంలా మారిన మా

హైదరాబాద్, జూన్ 23, 
తెలుగు సినీ కళాకారుల సంఘం ‘మా’ ఎన్నికలో అధ్యక్ష స్థానానికి ప్రకాశ్ రాజ్ బరిలో నిలవాలనుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కళాకారులకు అండగా, సంక్షేమానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో స్థాపించిన ఈ సంస్థకు ప్రజలతో పెద్దగా సంబంధం లేదు. సినీ పరిశ్రమకు సంబంధించి సంస్థ ఒకటి ఉందని కూడా నాలుగైదేళ్ల క్రితం వరకూ పెద్దగా ప్రజలకు తెలియదు. అయితే గడచిన కొన్నేళ్లుగా ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు ‘మా’ ను రచ్చ కీడ్చాయి. అధ్యక్ష పదవుల కోసం వెంపర్లాట. నిధుల దుర్వినియోగం పై ఆరోపణలు, వ్యవస్థాపనలోని మౌలిక లక్ష్యాలను పక్కదారి పట్టించాయి. ప్రతిష్ఠ సన్నగిల్లిపోవడమే కాదు, మీడియా నిరంతరం ఎదురు చూసే వార్తా సంచలనంగా మారింది. దాదాపు కెరియర్ ముగిసిన ద్వితీయ శ్రేణి నటులు దీనిని ఒక రాజకీయ స్థావరంగా మార్చుకున్నారు. ఏదో రకంగా తాము వార్తల్లో ఉండేందుకు, సినీరంగంలో తమ హవా ఇంకా కొనసాగుతోందని చాటుకునేందుకు ఏదో ఒక పదవి ఉంటే చాలనుకునే దుస్థితికి ‘మా’వచ్చేసింది. సినీ పరిశ్రమను శాసించే ప్రముఖులంతా దీని జోలికి రావడం మానేశారు. ఇటువంటి క్షీణదశలో ఉన్న సంస్థ ప్రతిష్టను పునరుద్దరించేందుకు తాను భుజం పడతానంటూ ప్రకాశ్ రాజ్ ముందుకు రావడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అదే సమయంలో ఆయనను ముందుకు వెళ్లనిస్తారా? అన్న అనుమానాలకూ కొదవ లేదు.గిల్లి కజ్జాలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఒక రాజకీయ సంఘంలా మారిపోయింది. చలనచిత్ర రంగంలో దక్షిణ బారతదేశంలోనే పెద్దది తెలుగు సినీ పరిశ్రమ. వేల కోట్ల రూపాయల వ్యయంతో ఏటా సినిమాలు నిర్మిస్తోంది. స్వాతంత్ర్యానంతర కాలంలో చాలా వేగంగా వృద్ధి చెందింది. ఒకానొక దశలో హిందీలో కంటే బారతదేశంలో తెలుగులోనే సినిమాలు ఎక్కువగా నిర్మించేవారు. అయినప్పటికీ ఎనిమిదో దశకం వరకూ సొంతగడ్డపై కాలు పెట్టలేకపోయింది. మద్రాసు కేంద్రంగానే పని సాగుతుండేది. పెద్ద నటుల సంగతి ఎలా ఉన్నప్పటికీ చిన్నతరహా నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ద్వితీయ శ్రేణి పౌరులుగానే పొరుగు రాష్ట్రంలో అవకాశాలు వెదుక్కునేవారు. ఆ దుస్థితికి వీడ్కోలు పలుకుతూ ప్రభుత్వాల తరఫున చెన్నారెడ్డి మొదలు ఎన్టీరామారావు వరకూ చేసిన కృషి ఫలితంగా క్రమేపీ హైదరాబాద్ లో వేళ్లూనుకుంది. రెండో తరానికి చెందిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి వారి కాలంలో అసోసియేషన్ల ఆవశ్యకతను గుర్తించి ‘మా’ కు ఒక రూపం వచ్చింది. మురళీ మోహన్ , మోహన్ బాబు వంటి సీనియర్ ఆర్టిస్టులు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తొలుత చాలా గౌరవ ప్రదమైన సంఘంగా మూడో కంటికి తెలియకుండా తన పని తాను చేసుకుని పోయే అసోసియేషన్ గా ఉండేది. రాజకీయ విభేదాలు మొదలైన తర్వాత పెద్దలు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు మా ఎన్నికలు అంటే మీడియా ఈవెంట్ అన్న తరహాలో కనిపిస్తోంది.కేవలం అయిదువందల మంది సభ్యుల లోపు ఉన్న మా అసోసియేషన్ కొందరికే పరిమితమైందన్న విమర్శ ఉంది. సభ్యత్వ రుసుము లక్షల రూపాయల్లో ఉండటంతోపాటు సంస్థ అందించే సేవలు పరిమితం. ఎటువంటి ఆసరా లేని వృద్ధకళాకారులకు పింఛన్లు, సభ్యుల కుటుంబాలకు వైద్య సదుపాయం, సినీ పరిశ్రమకు అండగా నిలవడం ప్రధాన ఆశయాలు. ప్రజలకు వినోదం అందించే చలనచిత్ర కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యమైన వాతావరణం ఏర్పాటు చేయాలనేది కూడా ఆశయం. చిత్ర రంగంలోని ఇతర విభాగాలతో ఏర్పడే వివాదాలు, విభేదాలను పరిష్కరించి నటీనటులకు న్యాయం చేయడమూ సమున్నత ఆశయమే. కానీ తమలో తాము కొట్టాడుకోవడంతోనే సరిపోతోంది. ఈ పరిస్థితిని గమనించిన సినీ ప్రముఖులు ‘మా’ను దూరం పెట్టేశారు. చిత్రరంగంలోని కార్మికులు, ప్రజలకు ఏదేని సాయం చేయాలనుకుంటే సొంతంగా చేస్తున్నారే తప్ప మా తరఫున చేయడం మానుకున్నారు. ఫలితంగా అసోసియేషన్ రోజురోజుకీ తన ప్రాధాన్యాన్ని కోల్పోతోంది. వందల కోట్ల రూపాయలు సంపాదించే నటులున్న వ్యవస్థలో ‘మా’ కు కనీసం సొంత భవనం లేకపోవడం విషాదం.ప్రకాశ్ రాజ్ బలమైన సైద్దాంతిక భావజాలం కలిగిన వాడు. సోషలిస్టు, కమ్యూనిస్టు దృక్పథం అతనిది. సిద్దాంతరీత్యా చూస్తే సిని రంగంలోని అనేకమందితో ఆయనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే సేవాదృక్పథం, నటనలో ఆయనపై విమర్శలు లేవు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడంతోపాటు యువతకు ప్రేరణనిచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పుట్టి పెరిగింది కర్ణాటక అయినప్పటికీ తన నివాసం గా తెలంగాణను ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. దీనావస్థలో ఉన్న ‘మా’కు ప్రకాశ్ రాజ్ మంచి చాయిస్ అనేది ప్రముఖుల అభిప్రాయం. అయితే బీజీ కళాకారునిగా ఉన్న ఆయన ఎంతవరకూ సమయం వెచ్చించగలడనే ప్రశ్న తలెత్తుతుంది. పైపెచ్చు ఇప్పటికే రాజకీయ మయం అయిపోయిన ఈ సంస్థలో తమ పెత్తనం పోతుందని భావించిన వారు పోటీపడే అవకాశమూ ఉంది. ఇతర భాషల్లోని పరిశ్రమలతోపాటు జాతీయ స్థాయిలో ప్రకాశ్ రాజ్ కు పరిచయాలున్నాయి. దాంతో ‘మా’కు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ లలో ఏదేని సమస్య ఏర్పడితే తక్షణం పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుంది. అదే సమయంలో అసోసియేషన్ కు దక్షిణభారతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చే అవకాశం కూడా ఉంటుందనేది కొందరి వాదన

Related Posts