YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అటో.. ఇటో...

అటో.. ఇటో...

విశాఖపట్టణం, జూలై 22, 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో కీలక నేతలంతా అరెస్టయ్యారు. జగన్ చుట్టూ ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరు జైలు పాలు అవుతున్నారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల నుంచి సహకారం లేదు. జాతీయ స్థాయిలో సైతం మద్దతు ఇచ్చే పార్టీలు కరువయ్యాయి. దీంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచే రాజకీయ పార్టీలు లేకపోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోటు. ఏపీలో కూడా ఏ పార్టీ కూడా వైసిపి వైపు లేదు. మరోవైపు జాతీయ స్థాయిలో ఏ కూటమిలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదు. దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.ఏపీలో అధికార పార్టీగా టిడిపి కూటమి ఉంది. ప్రధాన విపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఉన్నాయి. ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసుల్లో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని కూడా ప్రచారం నడుస్తోంది. కానీ ఒక్కరంటే ఒక్క వామపక్ష నేత.. కాంగ్రెస్ పార్టీ నేత మద్యం కుంభకోణం కేసులో అక్రమ అరెస్టులు అని ఆరోపించడం లేదు. పైగా వైసీపీ హయాంలో ఖచ్చితంగా మద్యం కుంభకోణం జరిగి ఉంటుందని ఎక్కువ మంది అనుమానిస్తూ మాట్లాడుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల సహకారం లేదని తేలిపోయింది. భవిష్యత్తులో కూడా అవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తాయని భావించడం లేదు.జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో ఉందో తెలియడం లేదు. కనీసం జాతీయస్థాయిలో ఇతర పార్టీలతో స్నేహం కూడా ఆశించిన స్థాయిలో లేదు. జాతీయ వ్యవహారాలను చక్కబెట్టే వారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి కంటే విజయసాయిరెడ్డి ఎక్కువగా జాతీయ పార్టీ నేతలతో టచ్ లో ఉండేవారు. ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా మారిపోయారు. ఇటువంటి సంక్లిష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో అండగా నిలిచేవారు లేకుండా పోయారు. పైగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారన్న కోపం ఆ పార్టీ హై కమాండ్ లో ఉంది. అందుకే మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్. కేసులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అయితే అంతిమంగా వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తారన్నది హై కమాండ్ అభిప్రాయం.ప్రస్తుతం తెలుగుదేశం ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉంది. చంద్రబాబు పట్ల జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు సానుకూలత ఉంది. ఎందుకంటే చంద్రబాబు గతంలో జాతీయస్థాయిలో చాలా రాజకీయ పార్టీలతో కలిసి పని చేశారు. అందుకే ఆయన బిజెపితో చేతులు కలిపిన జాతీయస్థాయిలో బిజెపి వ్యతిరేక పార్టీలు మాత్రం చంద్రబాబు విషయంలో ఎటువంటి విమర్శలు చేయవు. కానీ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు స్థాయిలో జాతీయ పార్టీలతో చెలిమి లేదు. ఇటు ఏపీలో తోటి పార్టీలతో సఖ్యత లేదు. ఇది ఒక రకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి సంక్లిష్ట పరిస్థితే.

Related Posts