YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

స్కూళ్లపై ఇంకా విధివిధానాలు రూపొందించలేదు... నో స్కూల్స్... పేరంట్స్ మనోగతం...

స్కూళ్లపై ఇంకా విధివిధానాలు రూపొందించలేదు...   నో స్కూల్స్... పేరంట్స్ మనోగతం...

హైదరాబాద్, జూన్ 23, 
తెలంగాణలో జులై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. స్కూళ్లు, కాలేజీలను జూలై 1 నుంచి ప్రారంభించడంపై హైకోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. జూలై 1 నుంచి అన్ని తరగతుల విద్యార్థులు తరగతులకు ప్రత్యక్షంగా హాజరు కావాలా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ఆయన్ను ప్రశ్నించింది. అయితే, దీనిపై సందీప్ కుమార్ సుల్తానియా స్పందిస్తూ.. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో తుది విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.అందరూ విద్యార్థులు కచ్చితంగా తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా విద్యా బోధన కూడా కొనసాగుతుందని వివరించారు. అయితే, పాఠశాలల్లో భౌతికదూరం పాటించడం కష్టమని కోర్టు అభిప్రాయపడింది. పిల్లల్ని పంపించే విషయంలో విద్యాసంస్థలు తల్లిదండ్రుల అనుమతి తప్పకుండా తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలో హైకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని విద్యాసంస్థలు తెరవడంలో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. దీంతో వారం రోజుల్లో పూర్తి వివరాలు కోర్టు ఎదుట సమర్పించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది.
పునరాలోచనలో ప్రభుత్వం :
తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై విద్యాశాఖ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత తెలంగాణ కేబినేట్‌ జులై 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు.. డిగ్రీ, ఇంజనీరింగ్‌, పీజీ తరగతులను మాత్రం నేరుగా క్లాసులను నిర్వహించనున్నారు.అదే విధంగా, స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల అంశంపై మాత్రం విద్యాశాఖ కాస్త మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై నేడో, రేపో కీలక నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌ సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది.

నో స్కూల్స్... పేరంట్స్ మనోగతం :

భావి భారత పౌరుల చదువులు వ్యాక్సినేషన్‌పై ఆధారపడ్డాయి. కరోనా భయాలు తొలగక పోకపోవడంతో పిల్లలను స్కూలుకు పంపేందుకు తల్లిదండ్రులు తటపటాయిస్తున్నారు.  మరోవైపు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే పిల్లలకు ఎప్పుడు టీకా ఇవ్వాలనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలను స్కూళ్లకు పంపడం, టీకాలు ఇవ్వడంపై భారతీయుల ఆలోచణ ధోరణిని తెలుసుకునే  ప్రయత్నం లోకల్‌సర్వే సంస్థ చేసింది. అందులో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. జులై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలు తెరుచుకుంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విద్యాసంస్థలు తెరుచుకోవడంపై ఇతర రాష్ట్రాలు ముందు వెనుకా ఆలోచిస్తున్న సమయంలోనే తెలంగాణ సర్కారు నిర్ణయం ప్రకటించింది. అయితే పిల్లలను బడులకు పంపడం, టీకాలు ఇవ్వడంపై తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకునేందుకు లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ 1,789 మంది తల్లిదండ్రు అభిప్రాయాలు సేకరించి విశ్లేషించింది.   విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభమైన పిల్లలను చదువుకునేందుకు పంపిస్తామని 26 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.  జిల్లాలలో పూర్తిగా కోవిడ్‌ కేసులు తగ్గిపోయినప్పుడే తమ బిడ్డలను విద్యాసంస్థలకు పంపిస్తామని 15 శాతం మంది పేరెంట్స్‌ తెలిపారు. తాము నివాసం ఉండే జిల్లాతో పాటు పొరుగు జిల్లాలలో కూడా జీరో కరోనా కేసులు నమోదయితేనే తమ వాళ్లను స్కూళ్లు/ కాలేజీలకు పంపిస్తామని 24 శాతం మంది కుటుంబ పెద్దలు వెల్లడించారు. తమ పిల్లలకు టీకాలు అందించేంత వరకు బడులు/ కాలేజీలకు పంపబోమంటూ 33 శాతం మంది తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. కేవలం  2 శాతం మంది మాత్రమే ఎటూ తేల్చుకోలేకపోతున్నామన్నారు.

Related Posts