YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పంచాయితీల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ

పంచాయితీల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ

ఏలూరు, జూలై 19, 
గ్రామాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులు వైసిపి, టిడిపి మద్దతుదారుల మధ్య వివాదానికి కారణమౌతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, మినీ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇటీవల ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం పనులను వేగంగా పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోంది. నిబంధనల ప్రకారం ఈ పనులు ఆయా గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో జరగాలి. అయితే, టిడిపి అభ్యర్థుల గెలిచిన చోట్ల దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆ గ్రామాల్లో కూడా వైసిపి నేతలే ఈ పనులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఓడిన వారి పెత్తనం ఏమిటంటూ టిడిపి సర్పంచ్‌లు ప్రశ్నించిన చోట్ల వివాదం నెలకొంటోంది. కొన్నిచోట్ల అధికారులు జోక్యం చేసుకుని టిడిపి సర్పంచ్‌లకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కొన్నిచోట్ల ఎంఎల్‌ఎలు మాట్లాడుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల మంత్రులు కూడా జోక్యం చేసుకుంటున్నట్లు తెలిసింది. అయినా టిడిపి సర్పంచ్‌లు వినని చోట్ల పనులు నిలిపివేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 గ్రామాల్లో వైసిపి నాయకులు ఇలా పనులను నిలిపివేసినట్లు సమాచారం.పనులను వేగవంతం చేసేందుకు గ్రామాల్లోకి వెళ్లగా ఈ 'పంచాయితీలు' ఎదురవుతున్నాయని పంచాయతీరాజ్‌శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి ఆర్‌బికెలు, సచివాలయాలు, మినీ ఆరోగ్యకేంద్రాల నిర్మాణానికి ఉపాధి హామీ నుంచి 90 శాతం నిధులు కేటాయించగా, పది శాతం స్థానిక పంచాయతీ భరించాలి. నిర్మాణ పనులు సర్పంచ్‌ ఆదీనంలో జరగాలన్నది నిబంధన. చాలా గ్రామాల్లో ఈ పనులు ప్రారంభించేనాటికి పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అధికారంలో ఉన్న వైసిపి నేతలే ఈ పనులను చేపట్టారు. సచివాలయ నిర్మాణానికి రూ.35 లక్షలు, రైతు భరోసా కేంద్రానికి రూ.22 లక్షలు, మినీ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ.14.8 లక్షల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత ఎన్నికలు జరిగాయి. టిడిపి సర్పంచ్‌లు గెలిచిన చోట తామే పనులు చేస్తామని అంటున్నారు. దీనికి వైసిపి నేతలు ఒప్పుకోకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయి. విజయనగరం జిల్లాల్లో 14 పంచాయతీల్లోనూ, విశాఖ జిల్లాల్లోని 21, శ్రీకాకుళంలోని 26, గోదావరి జిల్లాల్లోని 43, కృష్ణాలోని 28, గుంటూరులో 32, నెల్లూరులో 10, ప్రకాశంలో 18, అనంతపురంలో 14, చిత్తూరులో 29, కడపలో 3, కర్నూలు జిల్లాలోని 23 పంచాయతీల్లో ఇటువంటి గొడవలు వల్ల పనులను నిలిపేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Related Posts