YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీలతో ఒరిగిందేమిటీ....

ఎంపీలతో ఒరిగిందేమిటీ....

విశాఖపట్టణం, మార్చి 3,
జాతీయ రాజకీయాల్లో విశాఖ జిల్లా ఒకప్పుడు చాలా యాక్టివ్‌.. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులైతే శక్తివంతులు. దమ్మున్నోళ్లు. వారు కనుసన్నల్లోనే అప్పట్లో రాజకీయాలు జరిగేవి అంటే అతిశయోక్తి కాదు. గతంలో ఎంపీలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, ద్రోణంరాజు సత్యనారాయణ, సబ్బం హరి, పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు వంటి వారు ఢిల్లీలో చక్రం తిప్పారు. ప్రజా సమస్యలపై గళం విప్పడంలోనూ.. అభివృద్ధి పనుల కోసం ప్రయత్నించడంలోనూ తమదైన ముద్రను వారు వేశారు. ఇదంతా గతం.ఇక వర్తమానంలోకి వస్తే.. విశాఖ జిల్లాలోని ఎంపీలు జాతీయ స్థాయిలో తమదైన ముద్ర వేయలేక చతికిలపడిపోతున్నారనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత వైసీపీ పార్లమెంట్ సభ్యులు క్రియాశీలకంగా లేరని జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. వైజాగ్ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ రాజకీయాల్లోనే కాదు స్థానికంగా కూడా తమదైన ముద్ర ఏమాత్రం వేయలేకపోతున్నారని అంటున్నారు. తాము గెలిచిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎంపీలను ఖాతరు చేయడం లేదంటున్నారు. విశాఖ జిల్లా నుంచి ఎన్నికైన ప్రస్తుత వైసీపీ ఎంపీలు ఎవరూ ప్రజలకు తెలియకపోవడమే పెద్ద సమస్య. వీరికి ఏమాత్రం జనాదరణ లేదు. వైఎస్ జగన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో విశాఖ జిల్లా ప్రజలు వారికి ఓటు వేసి పార్లమెంట్ సభ్యులుగా గెలిపించారు.  అయితే.. వారు ప్రజలతో సంబంధాలు కొనసాగించడం లేదట. తమ తమ నియోజకవర్గాల్లో ఏనాడూ పర్యటించడం లేదు. ఎక్కువగా తమ సొంత పనుల కోసమే సమయం వెచ్చిస్తున్నారట.విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి ఈ మూడేళ్లలో లోక్‌ సభలో ఏనాడూ నోరు విప్పిన పాపాన పోలేదు. సభకు వెళ్లడం.. మౌన మునుల్లాగా కూర్చుంటున్నారనే ఆరోపణ ఉంది. తమ నియోజకవర్గాలు, పార్టీ వేదికల్లో అయినా ఏమైనా మాట్లాడతారా..? అంటే మౌనమే వారి భాషగా ఉంటోంది. ఎంవీవీ సత్యనారాయణ, మాధవి ఇద్దరూ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అయితే.. చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్న భీశెట్టి సత్యవతి కూడా మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.వైజాగ్ రైల్వే జోన్ సమస్య,ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం ఇతర సమస్యలపైన కూడా వారు చొరవ చూపడం లేదనే విమర్శ ఉంది. విశాఖకు గుర్తింపు తెచ్చింది కీలకమైన స్టీల్ ప్లాంట్. ఐదు లక్షల మంది జీవితాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తుంది ఇది. ఇప్పుడు ఈ పరిశ్రమపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. స్ధానిక ఎంపీలైన ఈ ముగ్గురూ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడమో.. మంత్రులను కలిశామని చెప్పడానికో పరిమితం అవుతున్నారే గానీ గట్టిగా పట్టుబట్టి పార్లమెంటులో నిలదీసే సాహసం చేయడంలేదని విమర్శలు ఉన్నాయి.విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ- స్థానిక ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేదట. సొంత వ్యాపారాలకే ఆయన పరిమితమయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీకి ప్రముఖ నాయకుడితో ఎంవీ సత్యనారాయణకు సమస్యలు ఉండడంతో ఆయన వ్యాపారాలకే పరిమితమయ్యారంటారు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి డాక్టర్‌ గా పెద్ద పేరుంది. అయినా ఆమె ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ వర్గం.. సత్యవతి గ్రూప్ మధ్య విభేదాలు ఉన్నాయి. వారి మధ్య ఆధిపత్యం కోసం పోరు కొనసాగుతోంది. గొడ్డేటి మాధవి.. అరకు ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆమె ఏనాడూ సమస్యలపై ఎలుగెత్తిన దాఖలాలు లేవు. అరకు నియోజకవర్గం పేరుకు పర్యాటక ప్రాంతమైనా గిరిజనుల అగచాట్లు అన్నీఇన్నీ కావు. అరకు ఎంపీ నియోజకవర్గంలో కూడా గ్రూపుల గోల తక్కువేమీ కాదు. పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో ఎంపీ మాధవికి సరిపడటం లేదు. వీరంతా లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్దారని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని వీరిని ఎన్నుకున్నారు. అయితే.. వీరు నామ్‌ కే వాస్తేగా మిగిలిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇంకా ఇలాగే వీరు ఉంటే రాజకీయంగా కనుమరుగు అవడం తథ్యమనేది పొలిటికల్ పండితుల విశ్లేషణ.

Related Posts