YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

చాప చుట్టేసిన ఎల్జీ పాలిమర్స్

చాప చుట్టేసిన ఎల్జీ పాలిమర్స్

విశాఖపట్టణం, మార్చి 26,
గతంలో హిందుస్థాన్‌ జింక్‌ పరిశ్రమను వేదాంత స్టెరిలైట్‌ కంపెనీ కొనుక్కుని వందలెకరాలను ఎలాగైతే కొల్లగొట్టుకుని ప్లాట్లుగా అమ్ముకుందో... తాజాగా ఎల్‌జి పాలిమర్స్‌ యాజమాన్యం వెంకటాపురం నుంచి వేరొక చోటకి వెళ్లిపోతూ భూములపై లావాదేవీలు నెరపుతోంది. 2020 మే ఏడున జరిగిన విషవాయువు (స్టెరీన్‌) లీకైన ఘటన తర్వాత ప్రజా ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీని మూసివేసింది. 40 మంది పర్మినెంట్‌ కార్మికులకు ఆర్థికపరమైన సెటిల్‌మెంట్‌ 2021లో ఎల్‌జి పాలిమర్స్‌ యాజమాన్యం పూర్తి చేసింది. 360 మంది కాంట్రాక్టు కార్మికులను మాత్రం రోడ్డున పడేసింది. వెంకటాపురం గ్రామా నికి చెందిన వీరందరూ ప్రభుత్వం ప్రకటించిన 'రెడ్‌ జోన్‌' పరిధిలోకే వస్తున్నా యాజమాన్యం వీరికి ఎలాంటి పరిహారమూ చెల్లించలేదు. కంపెనీ లోపల కొద్దిమందితో సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌, ఇక్కడ నుంచి ఎల్‌జి కంపెనీని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు తాజాగా చేస్తోంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెంకటాపురం గ్రామంలో వైసిపికి చెందిన స్థానిక నాయకుడు బెహరా భాస్కరరావు పంచాయితీలు నిర్వహిస్తు న్నట్లు స్థానికులు చెబుతున్నారు. కంపెనీ యాజ మాన్యం అన్యాయం చేయకుండా అండగా ఉంటానని చెప్పడంలో మతలబు ఉందని స్థానికులు అంటున్నారు. యాజమాన్యం ఏదో చేస్తోంది? అది వైసిపి నేతలకు మాత్రమే తెలుసు? అంటూ ప్రజల్లో చర్చ సాగుతోంది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై సిపిఎం, సిపిఐ, టిడిపి, ఇతర ప్రతిపక్షాలు మాత్రమే పోరాడాయి. వైసిపి మధ్యవర్తిత్వం నెరపింది. ఈ సందర్భంలో కూడా కీలకంగా వ్యవహరించని నేతలు ఇప్పుడు పంచాయితీలు నిర్వహిస్తుండడంపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఘటన జరిగిన తర్వాత రెడ్‌జోన్‌గా వెంకటాపురాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడి ఐదు వేల జనాభాకు అవసరమైన కనీస అవసరాలు, తిండి, సరకులను ఇచ్చే బాధ్యత కనీసం ఐదు నెలల పాటు ఎల్‌జి పాలిమర్స్‌ యాజమాన్యం చేపట్టాలని ఆదేశించింది. ఒక్క నెల మాత్రమే దీనిని యాజమాన్యం అమలుచేసి చేతులు దులుపేసు కుంది. అధికార వైసిపి నేతలెవ్వరూ దీనిపై ప్రశ్నించ లేదు. ఘటనానంతర పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వా నికి నివేదికను ఇటీవల ఇచ్చిన నిపుణుల కమిటీ కూడా వైద్య సేవల ప్రాధాన్యతను చెప్పింది. 2020 లో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గ్రామం లో పర్యటించారు. 12 బెడ్స్‌తో గ్రామంలో పర్మినెంట్‌ ఆస్పత్రిని ప్రభుత్వం నిర్మించనుందని ప్రకటించారు. దీనికి వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ అని నామకరణం చేశారు. వెంకటాపురం గ్రామంలో అప్పట్లో తాత్కా లికంగా క్లినిక్‌ ఏర్పాటు చేసి ఆ తర్వాత పట్టించు కోలేదు. ఇప్పటికీ ఎలాంటి భవనమూ నిర్మించలేదు. అందుకు తగిన ఏర్పాట్లూ ప్రభుత్వం చేయడం లేదు. ఘటన జరిగిన రోజే 12 మంది వెంకటాపురం గ్రామస్తులు విషవాయువు పీల్చి మృతిచెందగా, వీరి కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రభుత్వం అందజేసింది. విషవాయువు వల్ల మరో ముగ్గురు నాలుగైదు రోజుల వ్యవధిలో మరణించారు. ఆ ముగ్గురికీ ఇంతవరకూ రూ.కోటి పరిహారం దక్క లేదు. ఇంకా రోగాల బారిన, సైడ్‌ఎఫెక్ట్స్‌తో ప్రజలు బాధపడుతున్నా ప్రభుత్వ పెద్దలు కన్నెత్తి చూడడం లేదు. ఈలోగా సందట్లో సడేమియా అన్న చందంగా ఎల్‌జి యాజమాన్యం కొంతమంది బ్రోకర్లను గ్రామం లోకి దించి ఉద్యమం లేవకుండా తాను చాప చుట్టేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

Related Posts