
వరంగల్, ఏప్రిల్ 30,
బీఆర్‌ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లయిన సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ జనసమూహంగా విజయవంతమయినా, వేదిక నుండి పార్టీ శ్రేణులకు సరైన సందేశం ఇవ్వకుండా దశ దిశ లేని సభగా ముగిసింది. సభలో ఏకైక వక్త అయిన పార్టీ చీఫ్ కేసీఆర్ నుండి రావాల్సిన పంచ్‌లు రాలేదు. ఆయన హాహాభావాల్లో కూడా మునుపటి వేడి కనిపించలేదు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీపై సమాన స్థాయిలో విమర్శల వాన కురిపిస్తారని భావించినా తేడా కనిపించింది. పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎజెండా నిర్ణయిస్తారనుకున్నా బీఆర్‌ఎస్‌లో ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించ లేదు.ఎల్కతుర్తి సమావేశం కోసం బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామల నుండి ఎంతో ఉత్సాహంగా తరలి వచ్చారనడంలో ఎలాంటి సందేహాలు లేవు. పెద్దఎత్తున జనప్రవాహం ఉన్నా సభ వేదికపై కేసీఆర్‌లో తడబాటు కనిపించింది. సభకు వచ్చిన జనాలను చూస్తుంటే ఏడాదిన్నర కాంగ్రెస్‌పై ప్రజల ఆగ్రహం కనిపిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొత్తదనం ఏమీ లేదు. కేసీఆర్ సభలకు పెద్ద ఎత్తున జనాలు రావడం కొత్తేమీ కాదు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా బీఆర్‌ఎస్ సభలకు భారీగా ప్రజలొచ్చినా ప్రతికూల ఫలితాలు వచ్చాయనేది మరవకూడదు. జనాలు రావడం ఒకెత్తయితే, దాన్ని అనుకూలంగా మల్చుకోవడం మరో ఎత్తు.రాష్ట్రంలో పదిహేను నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా భావిస్తున్నా, ఆ వ్యతిరేకత బీఆర్‌ఎస్‌కు సానుకూలంగా మారుతుందా అనే దానిపై అంచనాలు తప్పే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఉనికే లేకుండా ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందని ఫలితాలే నిరూపిస్తున్నాయి.బీఆర్‌ఎస్‌కు ఒక వైపు కాంగ్రెస్ నుండి మరో వైపు బీజేపీ నుండి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ దశలో ఎల్కతుర్తి సభలో కాంగ్రెస్‌ను పెద్ద ఎత్తున విమర్శించిన కేసీఆర్ బీజేపీపై కేవలం రెండే నిమిషాలు మాట్లాడడం ఆశ్చర్యకరం. బీఆర్‌ఎస్‌కు బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతున్నా ఆయన ఆ పార్టీని అంతగా పట్టించుకోకపోవడంతో పలు సందేహాలకు తావిస్తున్నాయి.బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని ఇప్పటికే విమర్శిస్తున్న వారికి కేసీఆర్ తీరు మరిన్ని ఆయుధాలు అందించినట్టు ఉంది. పదకొండేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించిన కేసీఆర్ బీజేపీని ఎందుకు తీవ్రంగా తూర్పారపట్టలేదు..? ఈ పదకొండేళ్లలో కేసీఆర్ పదేళ్ల పాలనలో పలుమార్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కీలకాంశాల్లో బేషరుతగా మద్దతిచ్చారనేది వాస్తవం.పలుమార్లు బీజేపీ చేతిలో భంగపడ్డ కేసీఆర్ బహిరంగ సభలో కఠినంగా ఎందుకు వ్యవహరించలేదు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ అంశాన్ని మాత్రమే సభలో ప్రస్తావించిన కేసీఆర్ వక్ఫ్ సవరణ చట్టంపై నోరు మెదపలేదు. కగార్ ఆపరేషన్ కూడా వామపక్షభావ సానుభూతిపరులను ఆకట్టుకోవడంలో భాగంగానే ప్రస్తావించారు. మొత్తం మీద బీజేపీపై కేసీఆర్ మెతకవైఖరి చూస్తుంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చనేది మరోసారి నిజం కావచ్చు.తెలంగాణ అస్తిత్వానికి బీఆర్‌ఎసే మారు పేరని చెప్పుకునే కేసీఆర్ దీనికి సంబంధించి సభల్లో కీలకాంశాలను ప్రస్తావించలేదు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు సంబంధించి పాత విషయాలను కేసీఆర్ మళ్లీ వల్లె వేశారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ మళ్లీ ఉద్యమాల విషయాలను ప్రస్తావిస్తే ప్రజల్లో సానుకూలత వచ్చే అవకాశాలు తక్కువే.రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి పరిణామాలు సంభవించినా కేసీఆర్ సభలో వాటి ప్రస్తావనే తేలేదు. సభలో ‘జననీ జన్మభూమిశ్చ’ అని కేసీఆర్ చెప్పినా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడంపై, తెలంగాణ గేయంపై ఆయన సభాముఖంగా స్పందిస్తారని పార్టీ శ్రేణులు ఆశించినా నిరుత్సాహమే ఎదురైంది.కృష్ణా జలాలపై పక్క రాష్ట్రం ఏపీతో ఉన్న వివాదాలపై కేటీఆర్, హరీశ్‌రావు పలు మార్లు విమర్శలు చేసినా కేసీఆర్ నామమాత్రంగానే ప్రస్తావించారు. జలాలపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ కృష్ణా జలాలపై లోతుగా ప్రసంగిస్తారని ఆశించినా అలా జరగలేదు.రజతోత్సవ సభ కాబట్టి ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ ప్రస్తావించాల్సింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని తలచి భంగపడిన కేసీఆర్ జాతీయ నేతలకు కూడా దూరమయ్యారని ఈ సభ నిరూపించింది. గతంలో జాతీయ నాయకులను పలు సభలకు ఆహ్వానించిన కేసీఆర్ పార్టీ రజతోత్సవ సభకు ఏ జాతీయ నాయకుడిని పిలవకపోడమే నిదర్శనం.కాంగ్రెస్ సర్కార్ బీఆర్‌ఎస్ నేతలపై పలు కేసులు చేయడంతో పాటు, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ కమిషన్లు వేసింది. ఈ కేసులను కేసీఆర్ సభలో తిప్పి కొడుతారనుకున్నా ప్రస్తావించలేదు. తనును బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా లిక్కర్ స్కాంలో ఇరికించిందని కవిత పలు మార్లు చెప్పినా కేసీఆర్ సభలో దాన్ని ఊసే ఎత్తలేదు.కాంగ్రెస్ అధికారం చేపట్టాక కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక పరిణామాలు జరిగిన కేసీఆర్ సభలో వాటిపై ఎలాంటి ప్రస్తావన తేలేదు. కులగణన లెక్కలు తప్పంటూ హరీశ్‌రావు, కేటీఆర్ పెద్దఎత్తున విమర్శిస్తున్న తరుణంలో పార్టీ పెద్దగా స్పందించాల్సిన కేసీఆర్ దీన్ని విస్మయించారు. గతంలో తాము అమలు చేసిన పథకాల గురించి చెప్పిన కేసీఆర్ అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైన అంశాలను గణాంకాలతో ప్రస్తావించి ఉంటే పార్టీ ప్రజలకు గట్టి సందేశం వెళ్లి ఉండేది.
కేసీఆర్‌ది ఆకట్టుకునే వాక్చాతుర్యం అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ సభలో ఆయన ప్రజలకు దూరమయ్యారా అనిపించింది. అనర్గళంగా మాట్లాడే కేసీఆర్ కాగితం చూస్తూ మాట్లాడడం కొత్తదనమే. ఎన్నికల అనంతరం ఒకటి రెండు సార్లు మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భాలు ఉండడంతోనే ఆయన రాసుకొని మాట్లాడాల్సి వచ్చింది.అసెంబ్లీకి రావడంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. మా పిల్లలు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం నేను రావాలని అంటుందా అని కేసీఆర్ ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యకరం.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వం సమాధానం చెప్పడం ఒక భాగం. ఇందులో పిల్లలు పెద్దలు తేడా ఉండదు. అలా అనుకుంటే సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు ఆ పిల్లల్లోనే ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు కదా!రజతోత్సవ భారీ సభతో పార్టీలోని అభిప్రాయభేదాలకు విరామం పడుతుందని ఆశించిన పార్టీ సానుభూతిపరులకు ఆశాభంగం కలిగింది. సభ ఏర్పాట్లపై మొదట్లో హరీశ్‌రావుకు ప్రాధాన్యతిచ్చినట్టు కనిపించినా సభలో హరీశ్‌రావును పక్కనపెట్టినట్టే ఉందని పార్టీ కేడర్ బలంగా విశ్వసిస్తుంది. ఎన్నడూ లేని విధంగా సభా ప్రాంగణంలో హరీశ్ రావు ఫొటో లేకుండా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతోనే ఫ్లెక్సీలు దర్శనమివ్వడం ఇందుకు ఊతమిస్తుంది.వివిధ కారణాలతో కేసీఆర్ క్రియాశీలకంగా లేకపోవడంతో పార్టీలో ఆధిపత్య పోరు పెరిగి కేటీఆర్, హరీశ్‌రావు, కవితల మధ్య మూడు ముక్కలాట సాగుతుందనేది బహిరంగ రహస్యమే. ఎల్కతుర్తి సభావేదికగా కేసీఆర్ దీనిపై పరోక్షంగానో, ప్రత్యక్షంగానో స్పందించుంటే పార్టీ శ్రేణులకు మార్గదర్శకంగా ఉండేది. రాబోయే రోజుల్లో తాను క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టు ఆయన ప్రకటించుంటే పార్టీలో మూడు ముక్కలాటలకు తెరపడేది.బహిరంగ సభ సన్నాహక సమావేశాల్లో హరీశ్‌రావుకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు అనిపించినా సభకు వచ్చేసరికి ఆయనను పూర్తిగా పక్కన బెట్టారనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో కలిగింది. సభ వేళ దగ్గరపడుతున్న కొద్దీ వ్యూహాత్మకంగా హరీశ్‌రావును దూరం చేశారు. అదే సమయంలో కేటీఆర్‌కు ఇస్తున్నట్టు భావం కలగకుండా కేసీఆరే పర్యవేక్షించారు. చివరికి సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోస్టర్లలో కేసీఆర్‌తోపాటు, కేటీఆర్ ఫొటోలు ఏర్పాటు చేసి కేటీఆర్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. దీంతో పార్టీలో హరీశ్‌రావుకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవ్వడం పార్టీలో ఇంటి పోరు పెంచడం ఖాయం.ఎన్నికలే డీఎన్‌ఏగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ గతంలో ఎన్నికలంటే ఉరకలేసేది. ఇప్పుడు ఎన్నికలంటేనే వెనకడుగేస్తుంది. గతంలో పలు ఉప ఎన్నికలతో సత్తా చాటిన ఉద్యమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పలు ఎన్నికలకు దూరమవడం స్వయంకృతాపరాధం. అసెంబ్లీ ఎన్నికల పరాజయం షాక్ నుండి తేరుకోలేక లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోయింది.అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేసీఆర్ పార్టీ కేడర్‌కు తప్పుడు సందేశమిచ్చారు. దీనిపై కేసీఆర్ ఎల్కతుర్తి సభలో మాట్లాడలేదు. మరో కీలకాంశం పార్టీకి చెందిన 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను దమ్ముంటే పోటీ చేయండని కేసీఆర్ సవాలు విసిరితే వేడి పుట్టించేది. గతంలో బీఆర్‌ఎస్ మిత్రపక్షంగా ఉండి ఎన్నో ప్రయోజనాలు పొందిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన చేరి అసెంబ్లీలో, బయట బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసినా కేసీఆర్ బహిరంగ సభలో స్పందించలేదు.ఎన్నడూ లేని విధంగా కేసీఆర్‌లో అభద్రతాభావం కలిగిందా అనేలా సాగింది ఎల్కతుర్తి సభ. బహిరంగ సభలో ఆయన ఒక్కరే ప్రసగించారు. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత వంటి వారు మాట్లాడి ఉంటే తన ప్రసంగం చప్పబడుతుందని ఆయన అభిప్రాయపడ్డారా అనిపిస్తుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం నైరాశ్యంలో కూరుకుపోయినా బీఆర్‌ఎస్ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను సద్వినియోగం చేసుకుంటే పార్టీకి బలం చేకూరుతుంది. ఆ దిశగా పార్టీ కేడర్‌కు కేసీఆర్ మార్గదర్శకం చేసుంటే ప్రయోజనం ఉండేది.దేశంలో అత్యధికంగా రూ. 200 కోట్ల నిధులతో ధనిక ప్రాంతీయ పార్టీగా పేరు గాంచిన బీఆర్‌ఎస్‌కు జానాదరణ ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. పార్టీని మరోసారి అధికారానికి దగ్గర చేయడంతోపాటు అంతర్గత పోరుకు చికిత్స చేయాల్సిన బాధ్యత కూడా కేసీఆర్‌పైనే ఉంది.