YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

జీఎస్టీలో 5 శాతం శ్లాబును ఎత్తివేసే యోచనలో కేంద్రం

జీఎస్టీలో 5 శాతం శ్లాబును ఎత్తివేసే యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18
జీఎస్టీలో 5 శాతం శ్లాబును ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెల జరుగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. 5 శాతం శ్లాబును తొలగించి దానికి బదులుగా కొత్తగా 3 శాతం, 8 శాతం శ్లాబులను తీసుకువచ్చే అవకాశం ఉన్నది. నిత్యావసరాల వస్తువులన్నీ 5 శాతం శ్లాబులో ఉన్నాయి. ఆ శ్లాబులో ఉన్న కొన్ని వస్తువులను 3 శాతం శ్లాబులోకి, మిగతావాటిని 8 శాతం శ్లాబులోకి మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు ప్యాక్‌ చేయని, బ్రాండెడ్‌ కాని ఆహార, డెయిరీ ఉత్పత్తులకు ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తున్నది. మరికొన్నింటిపై జీఎస్టీ మినహాయింపు కొనసాగుతున్నది. వీటిలో కొన్నింటిని 3 శాతం శ్లాబులో చేర్చాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. 5 శాతం శ్లాబును 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనలపైనా చర్చ జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
జీఎస్టీ అమలు చేయటం వల్ల రాష్ర్టాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం పరిహారం కింద చెల్లిస్తున్నది. ఈ ప్రక్రియకు వచ్చే జూన్‌తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో రాష్ర్టాలు ఇకపై నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా జీఎస్టీ మండలి పలు మార్పులు చేయనున్నట్టు తెలుస్తున్నది. కొన్ని అత్యంత విలాసవంతమైన వస్తువులు, హానికారక వస్తువులపై అదనంగా సెస్‌ విధిస్తున్నారు. జీఎస్టీ వల్ల ఆ ఆదాయాన్ని నష్టపోతున్న రాష్ర్టాలకు కేంద్రం పరిహారం ఇస్తున్నది. ఆ పరిహారాన్ని 2017 జూన్‌ 1 నుంచి ఐదేండ్ల పాటు ఇస్తామని ప్రకటించింది. త్వరలో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో రాష్ర్టాలు స్వయం సమృద్ధి సాధించేలా జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
ఒక్క శాతం పెంచినా 50 వేల కోట్లు
5 శాతం శ్లాబును 8 శాతం శ్లాబుగా మార్చితే కేంద్రానికి ఏటా అదనంగా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పన్ను లెక్కల ప్రకారం.. అతి తక్కువ శ్లాబును 1 శాతం పెంచినా అదనంగా రూ.50 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. వచ్చే సమావేశంలో జీఎస్టీ మినహాయింపు వర్తిస్తున్న కొన్ని వస్తువులపైనా పన్ను విధించే అవకాశం ఉండటంతో జీఎస్టీ ఆదాయం మరింత పెరగనున్నది.

Related Posts