YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుడివాడకు దేవినేని ఉమా...

గుడివాడకు దేవినేని ఉమా...

విజయవాడ, సెప్టెంబర్ 19, 
వైసీపీకి, ఆ పార్టీలోని కొందరు కీలక నేతలకు ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని లాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ముకుతాడు వేసి, టీడీపీని పంచకళ్యాణి గుర్రంలా పరుగెత్తించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు చురుగ్గా రచిస్తున్నారు.  విర్రవీగి  అసభ్యంగా మాట్లాడుతున్న కొడాలి నాని మెడలో గుడివాడ బరిలోనే గుదిబండ వేసి మరీ టీడీపీ జెండా రెపరెపలాడించాలని టీడీపీ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో గుడివాడలో అమలు చేయాల్సిన ఎన్నికల వ్యూహాలపై ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో బలమైన నేతగా, వైసీపీకి దీటుగా జవాబు చెప్పగల నేతగా పేరున్న మాజీ మంత్రి దేవినేని ఉమను గుడివాడ బరిలో దింపాలనే యోచన చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది.గుడివాడలో బలమైన అభ్యర్థి ఉంటే కొడాలి నానిని మట్టి కరిపించవచ్చని, ‘కొడాలి ఓటమి మిషన్’ సక్సెస్ అవుతుందన్న భావన టీడీపీ వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోందని సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ అధినేత చంద్రబాబు కూడా దేవినేనికి గుడివాడ టికెట్ ఇచ్చి, సీటు గెలుచుకువచ్చే బాధ్యతలు అప్పగించాలనే యోచన చేస్తున్నారంటున్నారు. కొడాలి నానికి దేవినేని ఉమ అయితే.. సమ ఉజ్జీ అవుతారని, ఉమ గెలుపు తథ్యం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.గుడివాడలో కొడాలి నానిని ఓడించడం, టీడీపీకి విజయం సాధించడం ఆ పార్టీ నేతల ముందు ఉన్న ముఖ్యమైన లక్ష్యంగా ఉంది. కొడాలి నానిని ఓడించడం కృష్ణా జిల్లా టీడీపీ నేతలే కాకుండా.. ఆ పార్టీ  కూడా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం అధినేత సహా,   పార్టీలోని పెద్దలపై నోరు పారేసుకుని మరీ విమర్శలు, ఆరోపణలు చేస్తున్న కొడాలి నానికి గుణపాఠం చెప్పే కార్యాచరణతో టీడీపీలోని కీలక నేతలు ఇప్పటికే వడివడిగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కొడాలిపై ఫోకస్ పెట్టిన క్రమంలో టీడీపీలో కీలకమైన చర్చ కొనసాగుతోందంటున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు దీటుగా బదులిస్తారా? లేక మరింత బలమైన నేతను బరిలో దింపాలా అన్న విషయం  తెరమీదకు వచ్చిందంటున్నారు. ఈ చర్చల క్రమంలోనే గుడివాడ నుంచి దేవినేని ఉమను బరిలో దింపితే ఫలితం అనుకూలంగా వస్తుందనే ధీమా పార్టీ నేతలలో వ్యక్తమైందని అంటున్నారురావి వెంకటేశ్వరరావు గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యారు. అయినప్పటికీ రావి వెంకటేశ్వరరావు స్పీడు రానున్న ఎన్నికల్లో కొడాలి నానిపై విజయం సాధించేందుకు సరిపోదనే అభిప్రాయం స్థానిక తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమైందని సమాచారం. టీడీపీపై, టీడీపీ నేతలపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. ఆయన ఇమేజ్ ని చాలా వరకూ తగ్గించిందని, అయినప్పటికీ.. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్నట్లు దేవినేని ఉమతో చెక్ చెప్పాలనే అభిప్రాయం టీడీపీ అధినేతకు కూడా వచ్చిందని చెబుతున్నారు. ఇదే అభిప్రాయం పలువురు టీడీపీ నేతల్లో కూడా కలిగిందని తెలుస్తోంది. అందుకే ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలోని అనేక మంది కార్యకర్తలు, ముఖ్యమైన నేతలు కూడా దేవినేని ఉమ పేరును పార్టీ చీఫ్ చంద్రబాబుకు సూచిస్తున్నారంటూ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.నిజానికి దేవినేని ఉమ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాతో మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలోని అనేక మంది పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న దేవినేని ఉమ గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దాంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత సమావేశంలో దేవినేని ఉమ చేసిన ప్రసంగం, తొడగొట్టి మరీ కొడాలి నానికి చాలెంజ్ విసరడంపై ఆ పార్టీ గుడివాడ నేతలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ విశ్లేషించుకుంటే.. బూతుల మాజీ మంత్రి కొడాలికి సరైన ప్రత్యర్ది దేవినేని ఉమ అవుతారని, లెక్క సరిపోతుందని అంటున్నారు. ‘మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు.. బాహుబలి తిరిగొచ్చాడు’ అని బాహుబలి సినిమాలో దేవ సేన అన్నట్లు.. ‘గుడివాడా ఊపిరి పీల్చుకో.. కొడాలి నాని కోరలు పీకేందుకు దేవినేని ఉమ వస్తున్నాడు’ అని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.

Related Posts