
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ నరసింహన్ అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సును ప్రారంభించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సదస్సుకు మంత్రి జోగు రామన్న, సీఎస్ ఎస్కే జోషితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్కే పట్నాయక్, వీసీ ప్రవీణ్రావు హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ జీవవైవిధ్యానికి తానే నిజమైన నిదర్శనమని అన్నారు. 'నర'... 'సింహం' తన పేరులోనే భిన్న వైవిధ్యం ఉంది... అది సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే జీవితమని అయన వ్యాఖ్యానించారు. భారతీయ సంప్రదాయంలో జంతువులు, వృక్షాలను పూజించే సంస్కృతి ఉంది. హైదరాబాద్ నగరంలో కాంక్రీటు జంగిల్ గా మారిపోయింది. పచ్చదనం అదృశ్యమైంది... ఇది అంతా అంగీకరించాలని అన్నారు. ఒకప్పుడు చెరువులతో విలసిల్లిన భాగ్యనగరం కనుమరుగై కలుషితమయ్యాయి. జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు... ప్రతి ఒక్కరి బాధ్యత అని అయన గుర్తు చేసారు.
రాష్ట్ర ఆటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ జీవ వైవిధ్యం సంరక్షణలో తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు. ప్రపంచంలో జీవ రాశుల సంఖ్య 1.30 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో 70 శాతం జంతువులు, 30 శాతం మొక్కలు ఉన్నాయన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం... మూడేళ్లలో 87 కోట్ల మొక్కలు నాటిన ఘనత తెలంగాణ సర్కారుది. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సాహానికి అటవీ శాఖ ప్రోత్సాహమని అన్నారు.