YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఢిల్లీ కేంద్రంగా గవర్నర్ పై ఆందోళన

ఢిల్లీ కేంద్రంగా గవర్నర్ పై ఆందోళన

హైదరాబాద్, జనవరి 28, 
బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయసభల్లో చర్చించబోయే అంశాలు, పార్టీ తరఫున అనుసరించ వలసిన వ్యూహంపై చర్చించనున్నారు.
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్‌ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1న 2023 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. రెండు విడతలుగా అరవై ఆరు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. గత రెండు, మూడు పార్లమెంట్ సెషన్స్‌లో టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వపై విరుచుకుపడింది. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేలా నినాదాలు చేసేవారు. ఈ సారి కేంద్రంపై ఎలా పోరాడాలన్నదానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు ఇతర సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. కొంతకాలంగా గవర్నర్, సీఎంకు మధ్య పడటం లేదు. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. గవర్నర్ పై రాష్ట్ర మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. తమిళిసై పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ ఎంపీలకు ఎలాంటి సూచనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.  ఇప్పటి వరకూ పార్లమెంట్ రికార్డుల్లో  తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటుంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి మేరకు  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా గుర్తించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ .. బీఆర్ఎస్‌గా మారిన తొలి సమావేశాలుగా వీటిని భావించవచ్చు. జాతీయ పార్టీగా మారినందున.. కేంద్రంపై పోరాటంలో తమదైన మార్క్ చూపించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

Related Posts