YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అన్నీ వేళ్లూ పల్లా వైపే ఎందుకు...

అన్నీ వేళ్లూ పల్లా వైపే ఎందుకు...

హైదరాబాద్, ఏప్రిల్ 22  
భారత రాష్ట్ర సమితిని నాయకులు పార్టీని వదిలి వెళుతున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో అధికారంలోకి వచ్చిన పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అస్సలు ఆగడం లేదు. పదేళ్లు కీలక పదవులు అనుభవించిన వారు కూడా కారు దిగి వెళ్లిపోతున్నారు. అందులో కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం లేక కాదు. ఈసారి ఓడిపోయారంటే కేసీఆర్ ఇక భవిష్యత్ లో గెలవరన్న గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు కాకపోయినా మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేయలేని పిచ్చోళ్లు కాదు. కానీ వదిలి వెళుతున్నారంటే ఇన్‌స్టంట్ ప్రయోజనాలేనన్నది ఒక కారణంగా వినిపిస్తుంది. అందుకే పార్టీని వీడి వెళుతున్న వారంతా ఒక వ్యక్తి వైపు వేలు చూపి వెళుతున్నారు. ఆయనే పల్లా రాజేశ్వర్ రెడ్డి. పల్లా చెబుతున్న మాటలు వింటూ కేసీఆర్ మిగిలిన నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నది వదలి వెళుతున్న నేతల ఆరోపణ. కడియం శ్రీహరి కూడా ఇదే రకమైన ఆరోపణ చేసి పార్టీని వీడి వెళ్లారు. తాజాగా శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పరోక్షంగా అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చెప్పుడు మాటలు వింటున్నారని, ఆయన మిగిలిన నేతలను పట్టించుకోవడం లేదని, ఎవరినీ కలవరని కూడా ఆయన అన్నారంటే అది పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి అని గులాబీ పార్టీలో నేతలు గుసగుసలాడుకుంటున్నారు. నిజంగా పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పార్టీలో అంత వ్యతిరేకత ఉందా? అంటే నేతల వ్యాఖ్యలను బట్టే కాదు... ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకూ ప్రభుత్వం, పార్టీలో జరిగిన పరిణామాలను చూసి అవుననాలనిపిస్తుందంటున్నారు. బీఆర్ఎస్ చీ‌ఫ్ కేసీఆర్ ఎవరినీ కలవరు. ఎక్కువ సేపు నేతలతో రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. తాను చెప్పిందే ఆచరించాలి. అంతే తప్ప నేతల నుంచి ఫీడ్ బ్యాక్ ను తీసుకునే ప్రయత్నం చేయరన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. అయితే 2018 ఎన్నికల తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాధాన్యత పార్టీలో బాగా పెరిగిందంటున్నారు. ఆయన చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వడం దగ్గర నుంచి కొందరు నేతలకు పదవులు ఇప్పించడంలోనూ పల్లా ప్రముఖ పాత్ర పోషించాడంటారు. అది గులాబీ పార్టీలో అందరూ ఒప్పుకునేదే. ఎక్కడకు వెళ్లినా కేసీఆర్ పక్కన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉండటం కూడా ఆ అనుమానాలకు, వెలిబుచ్చుతున్న సందేహాలకు మరింత ఊతమిస్తుంది. పల్లాను ఎందుకు అంతగా కేసీఆర్ నమ్మారంటే చెప్పలేరు కానీ నేరుగా కేసీఆర్ దగ్గరకు వెళ్లగలిగిన నేత బీఆర్ఎస్ లో ఎవరైనా ఉన్నారంటే ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డి అని చెప్పవచ్చు.పల్లా రాజేశ్వర్ రెడ్డికి తొలుత రైతు సమితి అధ్యక్షుడిని చేశారు. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించారు. మరోసారి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డినే ఎంపిక చేశారు కేసీఆర్. అంతే కాదు శాసనసభ ఎన్నికల్లో పల్లాకు జనగామ టిక్కెట్ ను కూడా ఇవ్వడంతో ఆయన కేసీఆర్ వద్ద ఎంత పట్టు సంపాదించారో చెప్పకనే అర్థమవుతుందన్నది నేతల నుంచి వినిపిస్తున్న వాదన. ఇలాంటి పరిస్థితుల్లో నేతలు వెళ్లకుండా ఉండాలంటే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి తప్పదంటున్నారు. కేటీఆర్, హరీశ్‌రావును మించి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై నేతలందరూ విమర్శల దాడి చేసి వెళ్లడం చూస్తుంటే.. ఆయన ఇప్పటికైనా కేసీఆర్ పక్కన పెట్టి నేతల జంప్ లకు ఫుల్ స్టాప్ పెడతారా? లేక కంటిన్యూ చేసి ఎవరు పోయినా నో ప్రాబ్లం అంటూ ముందుకుసాగుతారా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts