YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు

రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు

హైదరాబాద్, ఏప్రిల్ 27 
తెలంగాణలో రిజర్వేషన్  రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్,  బీజేపీ ఎన్నికల ప్రచార అంశాలుగా రిజర్వేషషన్ల అంశాన్ని తీసుకుంటున్నాయి. బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణలో బహిరంగసభలో ప్రసంగించి ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. వాటిని ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మరో చోట ఇదే రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు.కేంద్రంలో మరోసారి బీజేపీ వస్తే రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేస్తుందని హెచ్చరించారు. ఆ పార్టీ ఆ దిశగానే ప్రయత్నిస్తోందని మరోసారి అధికారంలోకి వస్తే అదే చేస్తుందని అంటున్నారు. ఇలా జాతీయ పార్టీలు రెండు రిజర్వేషన్ల చుట్టూ ఓటింగ్ ప్రయారిటీ సెట్ చేసే ప్రయత్నం చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకోవడానికి్ మొదటి నుంచి ఓ అస్త్రం ప్రయోగిస్తోంది. అదే ముస్లిం రిజర్వేషన్ల రద్దు. అమిత్ షా ఎప్పుడు తెలంగాణ పర్యటనకు వచ్చినా.. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినా ముస్లిం రిజర్వేషన్ల గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తారు.  ముస్లింలకు ఇప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చెప్పడానికి ముస్లిం రిజర్వేషన్లు అంటున్నారు కానీ.. అవి ముస్లింలలో ఆర్థికంగా బాగా వెనుకబడిన 14 ఉపకులాలకు చెందినవారికి ఉన్నాయి. వైఎస్ హయాంలో ముస్లింలను ఆకట్టుకోవడానికి వీటిని ఇచ్చి కులాల జాబితాలో ఆయా వర్గాలను చేర్చారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం చెల్లవు. అందుకే ఈ రిజర్వేషన్లు ఎప్పటికప్పుడు వివాదం అవుతూనే ఉన్నాయి. వీరికి ఉన్న రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు  ఆ తీర్మానం తర్వాత కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. మునుగోడు ఉపఎన్నికలకుముందు ఎస్సీ రిజర్వేషన్లపై అధికారం లేకపోయినా జీవవో ఇచ్చారు కానీ.. ముస్లిం రిజర్వేషన్లకు ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు మందు  కర్ణాటకలో ఇలా ముస్లిం రిజర్వేషన్లను రద్దు  చేస్తూ అప్పటి బీజేపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది.  కానీ సుప్రీంకోర్టులో అగిపోయింది. కర్ణాటకలో  ముస్లింలకు  నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.వాటిని రద్దుచేసి   నాలుగు శాతాన్ని లింగాయత్, ఒక్కలిగలకు చెరో రెండు శాతాన్ని పంచుతున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది.   మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని, అందుకే ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నామని అప్పటి బీజేపీ ప్రభుత్వం వెల్లడించింది. నిజానికి కర్ణాటకలోనూ మతం ఆధారంగా  రిజర్వేషన్లు కల్పించలేదు.   1994లో మండల్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా  ముస్లింలలోని కొన్ని కులాలను ఇతర వెనుకబడిన కులాలను  ఓబీసీల్లో  సబ్‌ కేటగిరీగా చేర్చారు. ఆ కేటగరిలోనే రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంటే తెలంగాణ తరహాలోనే అక్కడ కూడా కులం ఆధారంగానే ముస్లింలకు  రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందుకే ఈ అంశం సుప్రీంకోర్టులో ఆగిపోయింది.  కర్ణాటకలో లాగే తెలంగాణలోనూ ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. అయితే  తెలంగాణలో ముస్లింలకు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. కానీ, మతం ఆధారంగా ఈ రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నారని అమిత్ షా అంటున్నారు. ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ కాదు. వారు ఓటు వేయరు కాబట్టి.. వారి విషయంలో బీజేపీ ప్రత్యేకమైన వ్యూహంతో ఉంటుంది. ఇప్పుడు వారి రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీలకు పెంచుతామని హామీ ఇస్తున్నారు. కుల పరమైన  రిజర్వేషన్లే చట్ట పరంగా అమలవుతున్నాయి కాబట్టి ముస్లింలకు ప్రత్యేకంగా రద్దు చేయలేరు.. ప్రత్యేకంగా కమిషన్ వేసి.. వారు అంటే ముస్లింలలో కొన్ని కులాల వారు అర్హులు కాదని తేల్చితే అప్పుడు తీసేయగలరు. అది అంత తేలిక కాదు. అందుకే ఇది రాజకీయ నినాదంగానే ఎక్కువ మంది భావిస్తున్నారు. సిద్దిపేట సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల రద్దు ప్రకటన చేసిన కాసేపటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో బీజేపీపై చార్జిషీట్ వేసే కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ  రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, ఇదే మోదీ ఆఖరు అస్త్రమని స్పష్టం చేశారు.  ఆర్ఎస్ఎస్   రిజర్వేషన్లను రద్దు చేయాలని లక్ష్యంగా  పెట్టుకుందని  ఆ ఎజెండాను అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ జరగాలని  ఇందుకోసం మోదీకి మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలన్నారు. అందుకే బీజేపీ నాలుగు వందల సీట్ల టార్గెట్ గా పెట్టుకుందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని.. రిజర్వేషన్లను కూడా వదిలి పెట్టదని కాంగ్రెస్ చాలా కాలంగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడటంతో.. కాంగ్రెస్ మరింత అందిపుచ్చుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయింది. ఈ రిజర్వేషన్ల రద్దు పేరుతో ఓటర్లను భయపెట్టి ఎవరు ఎక్కువగా లబ్ది పొందుతారో చూడాల్సి ఉంది.    

Related Posts