
గత ఎన్నికల అనుభవం దృష్ట్యా జిల్లాలో పార్టీ బలోపేతానికి టీడీపీ అధిష్టానం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నా, ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకున్న స్థానాల్లో ఒకటి, రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం దీటైన పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుండటం కొంత ఊరట కలిగించే అంశం.
సూళ్లూరుపేటలో ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ పట్టు నిలుపుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో 2.11 శాతం ఓట్ల తేడాతో చేజార్చుకుంది. ఈ నాలుగేళ్ల ‘అధికార’ కాలంలోనైనా పార్టీ బలపడకపోగా అంతర్గత కుమ్ములాటలతో మరింత బలహీనపడిన వైనం కనిపిస్తోంది. నియోజకవర్గ నాయకులు మూడు వర్గా లుగా చీలిపోయారు. వాకాటి నారాయణరెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, గంగాప్రసాద్ వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయారు. ఈ ముగ్గురు నాయకుల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఒకరంటే ఒకరికి కాని పరిస్థితి. పార్టీ కార్యక్రమాల్లోనూ వర్గ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో ఉంటూనే వేనాటి రామ చంద్రారెడ్డి కుమారుడు సమంత్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో జరిగిన జగన్ పాదయాత్రలో పాల్గొనడం విశేషం. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి పరసా రత్నం ఇక్కడి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్ని కైనా నియోజవకవర్గం మీద పట్టు సాధించలేక పోయారు. నియోజకవర్గాన్ని శాసించే అగ్రనాయకులు ఎవరూ ఈయన కంట్రోల్‌లో లేరు. వాస్తవానికి తెలు గుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉంది. ఆ విషయం ఇప్పటికి వరకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో రుజువయ్యింది. కేవలం నియోజకవర్గ నాయకుల మధ్య కుమ్ములాటల కారణంగా క్యాడర్ నిర్వీర్యం అయిపోతోంది.
ప్రస్తుతానికి గూడూరు నియోజకవర్గంలో తెలుగు దేశం బలంగా కనిపిస్తోంది.ఎమ్మెల్యే పాశం సునీల్‌కు మార్ చేరికతో తెలుగుదేశం అనూహ్యంగా పుంజుకుం ది. ఈయన పార్టీ మారిన సందర్భంగా మెజారిటీ సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తం గా తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఏర్పడింది. క్యాడర్ పరంగా బలంగా కనిపిస్తున్నా... అక్కడక్కడా అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను కొంత దెబ్బ తీస్తున్నాయి. వెంకటగిరిలో ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత తెలుగు దేశం పార్టీని వెన్నాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కురు గుండ్ల రామకృష్ణ బలమైన నాయకునిగా ముద్రప డినా, అంతే స్థాయిలో నియోజకవర్గం పరిధిలోని నాయకుల్లో వ్యతిరేకత మూటకట్టుకున్నారు. తీవ్రస్థా యికి చేరుకున్న అంతర్గత విభేదాలు పార్టీ గెలుపోట ములను శాశించే స్థాయికి చేరుకున్నాయి. తెలుగు దేశం గెలుపునకు వెంకటగిరి మున్సిపల్ ఓటు బ్యాంక్ చాలా కీలకం. అయితే, మున్సిపాలిటీలో ప్రస్తుతం పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతు శారదకు ఎమ్మెల్యే రామకృష్ణకు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. క్యాడర్ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోజకవర్గం పరిధిలో ముఖ్యులైన వెంకటగిరి రాజా కుటుంబంతో కూడా ఎమ్మెల్యేకి సఖ్యత లేదు. ప్రజలు రాజా కుటుం బీకులకు దగ్గర కావడాన్ని ఎమ్మెల్యే సహించడం లేదని, ఆ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా ఎమ్మెల్యేకి మంచి పేరు ఉన్నా పై పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో చికాకు కలిగించే అవకాశం లేకపోలేదు.
మంత్రి హోదాతో అభివృద్ధి పనులు, నియోజక వర్గంలో కుమారుడు రాజగోపాల్ విస్తృత పర్యటనలు, ఎత్తిపోతల పథకం ద్వారా పొదలకూరుకు కండలేరు జలాలు.. నియోజకవర్గ వ్యాప్తంగా పటిష్ట నాయక త్వం..! ఇవి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తున్నాయి. గత ఎన్నికల్లో కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో సీటు చేజార్చుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల తరువాత సోమిరెడ్డి నియోజకవర్గం మీద గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పట్టు బిగించారు. పొదలకూరు మండల రైతుల కోసం ఎత్తి పోతల పథకం ద్వారా సాగునీటిని మళ్లించాడు. దీని వల్ల పొదలకూరు, వెంకటాచలం మండలాలకు లబ్ది చేకూరింది. నియోజకవర్గం పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త హోదాలో ఈయన కు మారుడు రాజగోపాల్ నిత్యం పల్లెల్లో తిరుగతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మంత్రికి సం బంధించిన బలాల మాట ఇలా ఉండగా, మంత్రికి.. ప్రజలకు మధ్య స్థానిక నాయకులు అడ్డుగోడగా నిలిచారనే అసంతృప్తి కనిపిస్తోంది. కొంత మంది నాయకులు మంత్రి చుట్టూ కోటరిగా ఏర్పడ్డారని, వారు తమను మంత్రి వద్దకు వెళ్లనివ్వడం లేదనే అసంతృప్తి ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి బలంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే పోలం రెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా గుర్తింపు పొందారు. అయితే ఇక్కడ క్యాడర్‌లో అనైక్యత ప్రతికూలాంశం. ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్యకర్తలకు ఇచ్చే విలువ పాత తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వడం లేదనే అసంతృప్తి కొంత మందిలో వ్యక్తం అవుతోంది. ఆ సమస్యను అధిగమించుకోగలిగితే పార్టీ పరిస్థితి మ రింత మెరుగుపడుతుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలచిన సామాజిక వర్గాలను కాపాడుకోవడం ఒక పెద్ద సవాల్. తెలుగుదేశం నాయకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలకు ఈ నియోజకవర్గంలో అనుచర వర్గం ఉంది. గెలుపు కోసం ఈ ఇద్దరి సహకారం అవసరం.
గత ఎన్నికల్లో 2.72 శాతం ఓట్ల తేడాతో చేజారిన కావలిని ఈ సారి తమ ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి బీద మస్తాన్ రావుకు ఉన్న మంచి పేరు, ప్రధాన ప్రతిపక్షంలో నెలకొన్న వర్గ పోరు ఈ రెండు టీడీపీకి కలిసివచ్చే అంశాలు. ఈ నియోజకవర్గంలో నాయకత్వ సమస్య లు లేవు. అయితే ఇన్‌చార్జి ప్రజలకు అందుబాటులో ఉండరు, పార్టీ కార్యక్రమాల్లో మమేకం కారు అనే చి న్న అసంతృప్తి కార్యకర్తల్లో కనిపిస్తోంది. నియోజక వర్గం పరిధిలోని అన్ని మండలాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల్లో వర్గాలుగా చీలిపోయారు. కావలి మున్సి పల్ చైర్మన్ మార్పు విషయంలో నాన్పుడి ధోరణి కారణంగా కమ్మ సామాజికవర్గం అసంతృప్తిగా ఉంది. రూరల్ మండలంలో మత్స్య కారులు ఒక వర్గంగా, మిగిలిన సామాజికవర్గాలు మరో వర్గంగా ఉన్నారు. మస్తాన్ రావు సోదరుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, అభ్యర్థి అందుబాటులో లేడనే వెలితి, ద్వితీయ శ్రేణి నాయకులను ఒక తాటిపై నడిపించలేక పోతున్నారనే అసంతృప్తి కార్యకర్తల్లో గూడుకట్టుకొని ఉంది.
ఆత్మకూరు నియోజకవర్గంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఇన్‌చార్జి ఆనం రామ నారాయణరెడ్డి తెలుగుదేశంలో ఉన్నారా..! లేదా..! అనే సందిగ్దలో కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. ముం దు నియోజకవర్గ నాయకత్వానికి సంబంధించిన అనుమానాలు కొలిక్కి వస్తే కాని ఇక్కడ పార్టీ పరిస్థితి మెరుగుపడదు. ఈయన టీడీపీలోనే ఉంటారా , లే దా అనే విషయంలో ఒక స్పష్టత రావాల్సి ఉంది. అధి ష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోని పక్షంలో నియోజకవర్గంలో పార్టీ మరింత బలహీపనపడటం ఖాయం.
తెలుగుదేశం నాయకులు సమష్టిగా శ్రమిస్తే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అనుకూల ఫలితాలు సా ధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజక వర్గంపై మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, ప్రస్తుత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంచి పట్టు ఉంది. ఆనం కుటుంబం టీడీపీలో కొనసాగే పక్షంలో ఆ కుటుంబ అభిమానులు, అనుచరులు అదనపు బలంగా మారుతారు. ధీటైన అభ్యర్థితో పాటు పార్టీ నాయకుల సంపూర్ణ సహకారం లభిస్తే ఇక్కడ టీటీడీకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. నాయకులెక్కువ... కార్యకర్తలు తక్కువ అన్న చందంగా ఉంది నెల్లూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి. మంత్రి నారాయణ, నగర మేయర్, నుడ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు, ఆనం కుటుంబ సభ్యులు... ఇలా నెల్లూరు కేంద్రంగా చేసుకొన్న నాయకుల సంఖ్య పెద్దదిగా ఉందే కాని కార్యకర్తల హడావుడి కనిపించడం లేదు. ఉన్న నాయకులు సైతం కలిసికట్టుగా పనిచేయడం లేదు. వాస్తవానికి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ. 1200 కోట్ల పైచిలుకు నిధులతో భూగర్భ డ్రైనేజ్, డ్రికింగ్ వాటర్ స్కీము పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగరంలోని పేదల కోసం 6000 పక్కా గృహాలు అధునాతన పద్దతుల్లో నిర్మిస్తున్నారు. అమృత్, స్మార్ట్‌సీటీ పధకాల కింద వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి జరుగుతున్నా తెలుగుదేశం నాయకులు వీటిని క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. వైసీపీ సంప్రదాయ ఓటర్ల శాతం ఎక్కువగా ఉన్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దించడంతో పాటు నాయకుల సమష్టి కృషి ఎంతో అవసరం. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ప్రజలకు అందుబాటులో ఉండడనే అసంతృప్తి వ్యక్తం అవు తోంది. ఈయన కలిగిరి పార్టీ ఆఫీసుకు పరిమితం అవుతున్నారనే విమర్శలున్నాయి. మండలాలకు చుట్టపు చూపుగా వస్తారు తప్ప ప్రజలతో మమేకం కావడం లేదనే ఆరోపణలున్నాయి. అన్ని మండలాల్లో క్యాడర్‌లో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయి. జన్మభూమి కమిటీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎన్నికల లోపు ఈ సమస్యలన్నీ చక్కదిద్దుకోవాల్సి ఉంది.