YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం వ్యాపారులు సిండికేట్

మద్యం వ్యాపారులు సిండికేట్
సిండికేట్ల కనుసన్నల్లో జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్టుదుకాణాలు నడుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత కూడా యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మండలం లేదా మున్సిపాలిటీల పరిధిలోని మద్యం దుకాణాలన్నింటిని సిండికేట్‌గా చేసి, నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఈ సిండికేట్లు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తుండటంతో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో మొత్తం 353 మద్యం షాపులు, 185 బార్‌లు ఉన్నాయి. ఒక్కొక్క మద్యం దుకాణం పరిధిలో పదికి పైగా చొప్పున జిల్లా వ్యాప్తంగా 800 వరకు బెల్టు షాపులు ఉన్నాయని సమాచారం. తెనాలి, రేపల్లె వంటి ప్రాంతాల్లో బెల్టుదుకాణాలకు నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించినా వాటిని అడ్డుకునే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నారంటే అధికార పార్టీ నేతల అండదండలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మిగతా ప్రాంతాల్లో సైతం మద్యందుకాణాల నిర్వాహకులు సిండికేట్‌ల చేతుల్లోకి వెళ్లిపోతున్నారు. సిండికేట్‌ అయితే అధిక ధరలకు మద్యం అమ్మడంతోపాటు, ఆయా మండల, మున్సిపాలిటీల పరిధిలో గ్రామాలు, వార్డుల్లో బెల్టుదుకాణాలు నడుపుకోవచ్చనే ఆశతో వారి గుప్పెట్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించి వాటి పర్యవేక్షణ బాధ్యతలు ఎక్సైజ్‌ శాఖకు అప్పగించింది. ఎక్సైజ్‌ అధికారులు మాత్రం మద్యం దుకాణాల సిండికేట్‌ల కనుసన్నల్లో నడుస్తూ వారు చెప్పినట్లు పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బెల్టుషాపులు రద్దు చేస్తామంటూ నాలుగేళ్ల క్రితం ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు బెల్టుషాపుల తొలగింపుపై పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇష్టం వచ్చిన సమయానికి మద్యం దుకాణాలు తెరిచి అర్ధరాత్రి దాటాక కూడా విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం షాపుల్లోనూ లూజు విక్రయాలు సాగిస్తున్నారు. సిండికేట్‌ల నుంచి అధికార పార్టీ ముఖ్యనేతలకు, ఎక్సై జ్, పోలీసు అధికారులకు సైతం భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటంతో వారు ఏం చేసినా పట్టించుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చేశారు.  వేలం పాటల్లో బెల్టుషాపులు దక్కించుకున్న నిర్వాహకులు గ్రామాల్లో వీధికో బ్రాంచ్‌ చొప్పున ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరలు వసూలు చేస్తూ మందుబాబుల జేబులు గుల్లచేస్తున్నారు.

Related Posts