YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సాహిత్యం

అసూయా ద్వేషాలకు విరుగుడు ‘అవ్యాజ ప్రేమ’..

 అసూయా ద్వేషాలకు విరుగుడు ‘అవ్యాజ ప్రేమ’..

సద్గుణశీలుడికి సత్కారాలు ఉండకపోవచ్చు. దుర్గుణ పీడితుడికి లభించే దూషణ తిరస్కార దండనలు అతడికి ఉండవు. మనిషి తన బాటలో ఇబ్బంది కలిగించే రాళ్లు, ముళ్లు తొలగించి మార్గం సుగమం చేసుకొని ముందుకు సాగుతాడు. దుర్గుణాలనే గాజుపెంకుల్నీ జీవనయానమనే బాట నుంచి తొలగించుకోవాలి. ఆ పని ఎవరికి వారే చేసుకోవాలి. వేరెవరో చేయరు. దేహంలోని ముళ్లు తీయవచ్చుగానీ మనసులోని ముళ్లు ఎవరు తీయగలరు? ఎవరికి వారే తొలగించుకోవాలి. అందరికీ ఆ నేర్పు ఉండదు. కారణం- చాలామంది తాము ఎలాంటి తప్పులూ చేయడం లేదనే భ్రమలోనే జీవిస్తుంటారు. తమ మనసులో దుర్గుణాలనే ముళ్లు ఉన్నాయన్న సంగతి సైతం తెలియనంతగా, వారి అజ్ఞానం ఉంటుంది. ఇక వాటిని తొలగించుకోవాలని ఎవరైనా ఎలా అనుకుంటారు?

అధిక శాతం మానవుల్లో అసూయ, ద్వేషం అనే రెండు ముళ్లు అశాంతిని కలిగిస్తుంటాయి. ఎదుటివారు స్వశక్తి, కృషి, అంకితభావంతో అభివృద్ధి సాధిస్తుంటే చూడలేరు. అసూయతో రగిలిపోతుంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా వారి గురించి ద్వేషంతో విషం కక్కుతుంటారు. పాముకు కోరల్లోనే ఉండే విషం వీరికి అణువణువునా నిండి విషవృక్షంలా కనిపిస్తారు. ‘ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ’ అన్నాడు శతక కవి. ఈ కారణం వల్లనే ఆధునిక ప్రపంచం ప్రేమలేని ఎడారిలా మారింది.

విషానికి విరుగుడుగా సంజీవని ఉన్నట్లే, అసూయా ద్వేషాలకు విరుగుడుగా ‘అవ్యాజ ప్రేమ’ను చెప్పుకోవాలి. మనసుకు ప్రేమను నేర్పాలి. అది పెరిగే కొద్దీ అసూయ, ద్వేషం మంచులా కరిగిపోతాయి. అప్పుడు జీవనయానం పూలబాటలోనే సాగుతుంది!

Related Posts