
శ్రీనగర్, మే 5,
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాద శిక్షణా శిబిరం ఉనికిని వెల్లడిస్తున్న శాటిలైట్ ఫొటోలను భారత నిఘా సంస్థల చేతికి అందాయి. ఏప్రిల్ 22న 26 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో లష్కరే తోయిబా పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘జంగల్ మంగళ్ క్యాంప్’ అని పిలువబడే ఈ శిక్షణా కేంద్రం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మన్సెహ్రా జిల్లాలోని అటార్ సిసా అనే పట్టణంలో ఉంది. నిఘా వర్గాల ప్రకారం.. ఈ శిబిరం చాలా కాలంగా ఎల్‌ఇటి ఉగ్రవాదులకు కీలక శిక్షణా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ శిబిరంలో నివాస ప్రాంతం, మసీదు, అతిథి సమావేశ మందిరాలు, విదేశీ ఉగ్రవాదుల కోసం శిక్షణా మైదానం ఉన్నాయి. శాటిలైట్ ఫొటోలో ఈ శిబిరానికి సమీపంలో ఒక సైనిక భవనం కూడా కనిపిస్తుంది. అంటే ఆ ఉగ్ర శిబిరానికి పాకిస్తాన్ సైన్యం రక్షణగా ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.ఈ శిబిరంలో ఒక పెద్ద గ్రౌండ్‌లో ఆయుధ శిక్షణ, భౌతిక కసరత్తుల కోసం ఉపయోగిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ శిబిరంపై భారత భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు నిరంతరం నిఘా ఉంచాయి. ఈ శిబిరాన్ని భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పంపేందుకు ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. లష్కరే కమాండర్లు, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు తరచుగా క్యాంప్ కాంప్లెక్స్‌లోని ఫాగ్లా బీఆర్ ప్రదేశంలో జరుగుతాయని వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అప్పుడప్పుడు ఇటువంటి సమావేశాలకు హాజరవుతున్నట్లు సమాచారం. ఈ ఫొటోలు బయటికి రావడంతో భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ ఫొటోలు రావడంతో భారత్ పీఓకేపై నిఘాను ముమ్మరం చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతును గుర్తించి, పాక్‌కు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది భారత్.