
విజయవాడ జూలై 22,
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం దేశంలోనే ఒక చరిత్రాత్మక అడుగు ముందుకు వేస్తోంది. విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలకు.. పంట అమ్ముకోవడానికి పడే తిప్పలకు స్వస్తి పలికేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తోంది. విత్తనం నాటిన దగ్గర నుంచి.. పంట అమ్మే వరకూ ప్రతి సేవ ఇకపై రైతన్న సెల్‌ఫోన్‌లోనే అందుబాటులోకి రానుంది.APAIMS 2.0 తో వ్యవసాయ సేవలన్నీ డిజిటలైజ్ అవ్వనున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఉపగ్రహ చిత్రాలు వంటి అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ వ్యవస్థ, వ్యవసాయాన్ని సులభతరం చేయడమే కాకుండా, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడనుంది.అమెరికాకు చెందిన వాసర్ ల్యాబ్ వాసార్ ల్యబ్ ఈ సాంకేతికతను రూపొందించింది. MIT ఇందుకు తోడ్పాటునిస్తోంది.రాష్ట్రంలో 60,02,607 మంది రైతుల్లో 37,65,463 మంది రైతుల గుర్తింపు కార్డులు ఇప్పటికే తయారయ్యాయి. 80లక్షల హెక్టార్ల పంట సాగు దీని పరిధిలోకి రానుంది. 18వేల గ్రామాల్లో ఈసేవలు అందుబాటులోకి వస్తాయి.
ఇంతకీ ఈ కొత్త విధానం వల్ల రైతుకు ఏం లాభం? వ్యవసాయ శాఖ చెబుతున్న దాని ప్రకారం ప్రయోజనాలు ఇలా ఉన్నాయి:
వ్యక్తిగత సలహాలు: ఇకపై రైతు తన పొలానికి ఏ పురుగు ఆశించనుంది, ఏ ఎరువు ఎప్పుడు వేయాలి, నీరు ఎప్పుడు పెట్టాలి వంటి కీలక సమాచారాన్ని తన సెల్‌ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. ప్రతి రైతు పొలానికి ప్రత్యేకంగా సలహాలు అందుతాయి.
అన్నీ ఒక్కచోటే: విత్తనాల బుకింగ్, ఎరువుల సబ్సిడీ, పంటల బీమా, ఈ-క్రాప్ బుకింగ్, మార్కెట్‌లో పంట అమ్ముకోవడం వరకు అన్ని సేవలు ఈ యాప్ ద్వారానే జరుగుతాయి. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి.
పారదర్శకత: సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల అవినీతికి, జాప్యానికి ఆస్కారం ఉండదు. రైతులకు అందాల్సిన ప్రయోజనాలు నేరుగా, వేగంగా అందుతాయి.
నష్ట నివారణ: తుపానులు, తెగుళ్ల వంటి వాటి గురించి ముందుగానే హెచ్చరికలు అందడం వల్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ మార్పుపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లి రావు మాట్లాడుతూ, "ఖరీఫ్ 2025 నుంచి ఆఫ్‌లైన్ సేవలు అనేవే ఉండవు. ప్రతిదీ APAIMS 2.0 వేదిక ద్వారానే జరుగుతుంది. ఇది పారదర్శకతను పెంచి, రైతులకు వేగంగా సేవలు అందిస్తుంది," అని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే ఫలితాలు వస్తున్నాయి. Vassar ల్యాబ్ సూచనలు పాటించడం వల్ల ఎరువుల వినియోగం 7.5శాతం తగ్గింది. అంతే కాదు..వేరు శనగ పంట కాలాన్ని జూన్ నుంచి జూలై 15కు మార్చడం వల్ల చీడపీడల సమస్య తగ్గి దిగుబడి పెరుగుతోంది.
ఏపీ మోడల్‌కు అంతర్జాతీయ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఈ డిజిటల్ నమూనా కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఇటీవల ఇథియోపియా ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శించింది. ఇక్కడి విధానాలను చూసి అబ్బురపడిన వారు, తమ దేశంలో కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రశంసించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 దేశాలు ఏపీ మోడల్‌పై ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ "ఛాంపియన్" అవార్డుకు నామినేట్ చేసింది.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 187.58 కోట్లు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్‌ను సిఫార్సు చేసింది.